- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్లు దారి తప్పుతున్నాయ్..!
ప్రజా సంక్షేమ కేంద్రాలు, చట్ట శాసన సభలుగా పార్లమెంటరీ వ్యవస్థలు చేస్తున్న అపార కృషికి స్పందనగా సాధారణ మానవాళి కృతజ్ఞతలు తెలియజేయడానికి పార్లమెంటరీ వేదికలు ఉపకరిస్తున్నాయి. పార్లమెంటరీ వ్యవస్థలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించాలని కూడా సూచనలు చేయడం జరుగుతుంది. 1889 జూన్ 30 ఉద్భవించిన “ఇంటర్-పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ)” అంతర్జాతీయ సంఘ కృషికి గుర్తుగా 2018 నుంచి ప్రతి ఏటా జూన్ 30న ప్రపంచ దేశాలు “అంతర్జాతీయ పార్లమెంటరిజమ్ దినోత్సవం“ నిర్వహించబడుతున్నది.
135 ఏండ్ల ఘన చరిత్ర కలిగిన ఐపీయూలో 180 దేశాల పార్లమెంట్లకు చెందిన 46,000 మంది పార్లమెంటేరియన్లు సభ్యులుగా ఉండడం విశేషం. అన్ని వర్గాల ప్రజలకు పార్లమెంటరీ వ్యవస్థలో సమాన అవకాశాలు కల్పించాలని కోరడం, ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టడం, శాంతి నెలకొల్పడం, లింగ సమానత్వ సాధన, మానవ హక్కుల పరిరక్షణ, మైనారిటీ వర్గాల హక్కులు కాపాడడం, యువతకు చోటు ఇవ్వడం, దివ్యాంగులకు సముచిత స్థానం ఇవ్వడం, అవినీతి పాలకుల పంతం పట్టడం లాంటి పలు అంశాలను చర్చించే వేదికలుగా అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవ సమావేశాలు ఉపకరిస్తాయి.
ఈ వేదికలు.. ప్రజల గొంతుకలు కావాలి!
ఫ్రెంచ్ భాషలో ‘పార్లర్’ అనగా ‘చర్చించడం (టు టాక్)’ అని అర్థం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య నియమాలను ప్రపంచ దేశాలు పాటించాలని సూచించడం జరుగుతున్నది. ప్రజాస్వామ్యానికి గుండెకాయలుగా పార్లమెంట్లు సేవలు అందించాలి. ప్రజల గొంతుకలుగా పార్లమెంట్లు పని చేయాలని, ప్రజాహిత నిర్ణయాలను నిష్పాక్షికంగా తీసుకోవాలని, అన్ని వర్గాల ప్రజల సమ్మిళిత సమగ్రాభివృద్ధికి ప్రతిన బూనడానికి వేదికలుగా పార్లమెంట్లు కృషి చేయాలని విశ్వ మానవాళి కోరుకుంటున్నది. ప్రజాస్వామ్యానికి పడుతున్న తూట్లు, బడుగులకు ప్రాతినిధ్యం కొరవడడం, రాక్షస రాజకీయ క్రీడలు, స్వేచ్ఛా హక్కుకు తలుపులు మూయడం, చట్ట సభలు డబ్బునోళ్లకే చుట్టాలుగా మారడం, అశాంతి నెలకొన్న సమాజం లాంటి పలు సవాళ్ల నడుమ నేటి పార్లమెంట్లు దారి తప్పుతూ ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కడం కొనసాగుతోంది.
క్రిమినల్ కేసుల్లో మన ఎంపీలు
భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా నిరక్షరాస్యత, పేదరికం, అనంత అవినీతి, లింగ వివక్ష, అసమానతల అగాధాలు, ఉగ్రవాదం, నిరుద్యోగం, ప్రాంతీయ వాదనలు, కులమత వివక్షలువిబేధాలు, డ్రగ్స్ దుర్వినియోగాలు, మహిళలపై హింస, కోరలు చాస్తున్న కాలుష్యం లాంటి అంశాలు అనాదిగా నిలుస్తున్నాయి. 17వ పార్లమెంట్‌లోని రెండు సభల్లోని 776 ఎంపీల్లో 306 మంది (40 శాతానికి పైగా) ఎంపీలపై క్రిమినల్ కేసులు (మర్డర్లు, మానభంగాలు, కిడ్నాపులు, మహిళల పట్ల హింస లాంటి అభియోగాలు) నమోదు కాగా వాటిలో 194 (25 శాతం) మందిపై కేసులు తీవ్రమైనవిగా గుర్తించారు. మన ఎంపీల సగటు ఆస్తులు 38 కోట్లుగా ఉండగా అందులో 53 మంది (7 శాతం) బిలియనీర్లు ఉన్నారు. 2024 లో నేడు కొలువు తీరిన 18వ లోకసభలో ఎంపికైన 543 మంది ఎంపీల్లో 251 మంది (46 శాతం) ఎంపీలపై క్రిమినల్ కేసులు, 31 శాతం ఎంపీలపై తీవ్రమైన ఆరోపణలు నమోదు అయ్యాయని తెలుస్తున్నది.
దాదాపు సగం మంది పార్లమెంట్ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు కావడం, ధన బలం గెలుపును నిర్ణయించడం, కండబలం పార్లమెంటరీ స్ఫూర్తికి తూట్లు పొడవడం జరుగుతున్న నేపథ్యంలో భారత పార్లమెంట్ ప్రజల పక్షపాతిగా సేవలు అందిస్తుందనే విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతోంది. ప్రజాస్వామ్యం పరిహాసం పాలు కావడం, అధికారం స్వార్థ ప్రయోజనాలకు నెలవుగా మారడంతో పార్లమెంటరీ వ్యవస్థలపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోవడం ప్రమాదకర పరిణామంగా భావించాలి. పార్లమెంటరీ వ్యవస్థలు ప్రజాభిప్రాయాలకు పట్టం కట్టాలని, అసలైన నాయకులే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావాలని ఓటర్లు అభిప్రాయపడే రోజులు రావాలని కోరుకుందాం.
(నేడు అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం)
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037