ఉత్తమ ధ్యేయం

by Ravi |   ( Updated:2023-10-23 00:30:20.0  )
ఉత్తమ ధ్యేయం
X

ఉద్యమేనహి సిధ్యన్తి కార్యాణి న మనోరథైహి!

సహి షుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగ:

ఏదైనా పనిని సాధించడానికి శ్రద్ధగల కృషి అవసరం. కేవలం ఆలోచన కాదు. అదే విధంగా, నిద్రిస్తున్న సింహం నోట్లోకి జింక ప్రవేశించదు అన్నది ఒక ఆర్యోక్తి. ఇక్కడున్న విషయాలు, ధ్యేయ నిర్ణయం, అది సాకారమయ్యేందుకు మంచి ఆలోచన, కార్య సాధన పట్ల పట్టుదల, అందుకు గానూ మానసిక సిద్ధ,, శారీరక కృషి అవసరం అవుతాయి. మానవుడికి ఇతర ప్రాణులకు గల జీవన వైవిధ్యాన్ని మనం పరిశీలించినప్పుడు మనకి బోధపడే అంశాలు కొన్ని ఉన్నాయి. ఆహార నిద్రా భయ మైధునాలు ప్రాణులన్నింటికీ సమానమే. కానీ, మానవుడికి మాత్రమే విజ్ఞాన సముపార్జన కౌశలం, ఆలోచించి నడవగలిగే నైజం, చిత్త శుద్ధి, పరోపకార పరాయణత్వం ఇత్యాది సద్గుణాలతో జీవిత గమనాన్ని నిర్దేశించుకుని తద్వారా కోరుకున్న ధ్యేయాన్ని పొందగలిగే అవకాశం ఉంది.

ధ్యేయం, నిష్టతోటే సాధన సఫలం

ధ్యేయ సాధనకై చేసే ప్రయత్నంలో ముందుగా మనకి కావాల్సింది ధ్యేయ నిర్ణయం. అందుకోసమే ప్రణాళిక అవసరం. రామాయణంలో సాగరోల్లంఘన సమయంలో అంజనేయుడి ధ్యేయం సీతాదేవి ఆచూకీ కనుగొని శ్రీరామునికి తెలియపర్చడం, ఆయన పట్టుదల, కృషి ఎంత గట్టివి అంటే, మైనాకుడి ఆతిధ్యం మభ్య పెట్టలేదు. సురస, లంకిణి వంటి వారి రాక్షసత్వం భయపెట్టలేదు. అనుకున్నది సాధించే తిరిగి వచ్చాడు. స్పష్టమైన ధ్యేయం, దానికోసం నిష్ఠ ఉన్నప్పుడు సాధన తప్పక సఫలం అవుతుంది.

ప్రయత్నమే ధ్యేయ సాధన మార్గం

పైన చెప్పినట్లు సింహం నిద్రపోతుంటే, ఆహారం నోటికందదు. దృయం కోసం శ్రమించకపోతే, సాధన ఫలించదు. ఒక్కోసారి కృషి చేసినా ధ్యేయం సిద్దించక పోవచ్చు. కానీ చేసిన కృషి తాలూకు అనుభవం మాత్రం జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు తప్పక ఉపయోగిస్తుంది. అలవి కాని ధ్యేయ నిర్ణయం సమంజసం కాకపోయినా, దాని దరిదాపుల్లోకయినా వెళ్లే అవకాశం కేవలం ప్రయత్నిస్తేనే లభ్యమౌతుందనేది నిర్వివాదాంశం. మహాభారతంలో వనవాస సమయంలో ఒక కారణం వలన అర్జునునికి దేశ సంచారం చేయవలసిన అగత్యం ఏర్పడింది. దాదాపుగా అదొక శిక్ష.. అతగాడు కనుక తల్చుకుంటే ఆ శిక్ష తప్పించుకునే సౌలభ్యం ఉందని యుధిష్ఠిరుడు అవకాశం కూడా ఇచ్చాడు. అయితే, కార్య సాధకుడు కనుక అర్జునుడు ఆ శిక్షా సమయాన్ని శిక్షణకు వినియోగించుకున్నాడు. రాబోయే యుద్ధంలో విజయ సాధన కోసం శస్త్రాస్త్ర సముపార్జన చేసాడు. కొత్త మిత్రులను పొందాడు. రాజ్య సాధన అనే ధ్యేయానికి కురుక్షేత్ర సంగ్రామంలో అది ఎంతో ఉపయోగించింది.

మనకూ, జంతువుకీ తేడా అదే

ధ్యేయ పాధనలో మరో మెట్టు నానాటికీ పురోభివృద్ధిని పొందడం. ఇతర ప్రాణికోటి విషయంలో శతాబ్దాల నుంచీ కూడా వాటి నిత్యకృత్యం ఒక్కలాగే ఉంది. కానీ, మనిషి దినదినాభివృద్ధి చెందుతున్నాడు. గతంలో అసాధ్యమైన విషయాలు చాలా వరకూ నేడు సుసాధ్యమౌతున్నవి. భరద్వాజ మహర్షి రచించిన బృహత్ విమానశాస్త్రంలోని ఆకాశయానానికి సంబంధించిన విజ్ఞానాన్ని, కొన్ని తరాల తర్వాత మానవుడు సుసాధ్యం చేసుకోవడం గమనిస్తే, నిశ్చలమైన ధ్యేయం వెనుక సుసాధ్యమయ్యే ప్రయత్నం కూడా వుండి తీరుతుందని మనం గ్రహించవచ్చు.

లోకహితమైన ధ్యేయమే ఉత్తమం

ఇక ధ్యేయాన్ని పొందే గమనంలో గమ్యం కేవలం అది సాధించడం మాత్రమే కాక సాధించిన ధ్యేయం 'బహుజన హితాయ బహుజన సుఖాయ' అనే ఋగ్వేద సూక్తి ప్రామాణికం. అది ప్రాథమిక సూత్రం. 'సర్వే భవస్తు సుఖినః సర్వే సన్తు నిరామయ' అని బృహదారణ్యకోపనిషత్తు కూడా రచిస్తోంది. లోక హితమైన ధ్యేయంతో ముందుకు సాగి కోరినది సాధించిన మానవుడే మహనీయుడు. కపిల మహర్షి కోపాగ్నికి ధన్యమై పోయిన సగరపుత్రుల ఊర్ద్వగతులే ధ్యేయంగా తలపెట్టిన భగీరథ ప్రయత్నం గంగమ్మను క్రిందికి తెచ్చింది. నేటికీ ప్రాణికోటికి జీవజలాలను అందిస్తున్న గంగాదేవిని తలచినప్పుడల్లా భగీరథుడు జ్ఞప్తికి రాక మానడు. ఉత్తమ ధ్యేయం, ఉత్కృష్టమైన ఆలోచన గల మనిషి ఎప్పటికీ ఉన్నతుడే.

(విజయదశమి సందర్భంగా)

నందిరాజు పద్మలత జయరాం,

చందమామ రచయిత

94929 21383

Advertisement

Next Story

Most Viewed