అమరత్వం సరే.. ఆస్తుల మాటేమిటి?

by Ravi |   ( Updated:2024-03-01 00:31:15.0  )
అమరత్వం సరే.. ఆస్తుల మాటేమిటి?
X

ఎంతోమంది త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో భవిష్యత్తు కాదు కదా కనీసం నిలువ నీడ లేకుండా పోయినా, గడిచిన దశాబ్ద కాలంలో మేధావులు, హక్కుల నేతలు స్పందించాల్సిన స్థాయిలో ఎవరూ స్పందించకపోవడం మాట్లాడలేని పరిస్థితి చూశాం. మరోవైపు మాజీ మావోయిస్టులు, అర్బన్ మావోయిస్టులు, మేధావుల ముసుగులోని కొందరు, సంఘం పేరుతో కొందరు, సంస్థల పేర్లతో మరికొందరు రచయితలుగా, కళాకారులుగా, కులాల పేరుతో, మతం పేరుతో, జర్నలిస్టులుగా, ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతస్థాయి అధికారులు ఇలా ఎవరికి వారు ఓ గిరి గీసుకొని నిన్నటి బీఆర్ఎస్ అడుగులకు మడుగులు ఒత్తుత్తూ వీరంతా ప్రజాగొంతుకలుగా పేరుపొందారు.

ఇలా గత ప్రభుత్వంలో దశాబ్ద కాలం పాటు ఎంతో పీడన వేదన తెలంగాణ అనుభవించింది. అందుకే తెలంగాణ ప్రజలు తమ తమ జీవితాల్లో మార్పు కావాలంటూ కాంగ్రెస్‌కి అధికారం కట్టబెట్టారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దృష్టిని ఆకర్షించేందుకు తమ ఉనికిని కాపాడుకునేందుకు కొందరు ప్రాంతాల వారిగా తమది అమరుల కుటుంబం అంటూ, తమ వారు మావోయిస్టులుగా అమరులయ్యారని పుంఖాలు పుంఖాలుగా పుస్తకాలు ప్రచురించడం ఇప్పటికే మొదలైంది. ప్రాంతం పేరుతో, తమ చరిత్ర గురించి గొప్పగా చాటి చెప్పుకుంటూ రాష్ట్రంలో పేరున్న వక్తలతో, వ్యక్తులతో సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఆనాడు సమసమాజం అంటూ నిస్సహాయంగా ఉన్న నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి చరిత్ర, ఉద్యమం పేరుతో రెచ్చగొడుతూ దశాబ్దాల పాటు పాలకుల పాదపూజకు యువత ప్రాణాలను ఆహుతి చేయడం నిన్నటి దాకా చూసాం. మాజీ మావోయిస్టులుగా ఓ ట్యాగ్, అర్బన్ మావోయిస్టులుగా మరో అడిషనల్ ట్యాగ్ వేసుకొని వారి వారి ప్రాంతాల్లో రౌడీయిజం పెంచి పేకాట క్లబ్బులు, భూ, ఇసుక, మద్యం మాఫియా, కబ్జాలు, గిరిజన భూముల్లో రియల్ వ్యాపారం, బెదిరింపులకు పాలుపడుతూ అందినకాడికి దండుకొని అపరకుబేరుల జాబితాలో చేరారు. ఇందులో మొదటి స్థానం బీఆర్ఎస్ నేతలదే. దశాబ్దాల క్రితం నాటి ఉద్యమ చరిత్రలోని అమరత్వం సరే.. మరి మీ ఆస్తుల మాట ఏమిటి? అని అడిగేవారు ఎవరు? ప్రతిదినం బ్రతకడం కోసం మన కళ్ళ ముందే చస్తున్న నిరుద్యోగులు, నిరుపేద అభాగ్యుల గురించి ఆలోచన చేసేవారు ఎవరు?

-చాట్లపల్లి అనిల్

9491743506

Advertisement

Next Story