- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సార్థకత లేని అమరత్వం!
ఏ ప్రజా ఉద్యమానికైనా కొందరి త్యాగం, ఎందరో బలిదానాలు, పోరాటాలు, యుద్ధాలు, మృత్యువాతలు తప్పనిసరి. ఇదే 60 సంవత్సరాల తెలంగాణ పోరాటంలోనూ కొనసాగింది. పాలకుల కర్కశత్వానికి నేలకొరిగిన వారు కొందరైతే, తమ అమరత్వంతోనైనా పాలకుల తీరు మారి, రాష్ట్రం ఆవిర్భవించి ఇక్కడి ప్రజలు కలలుగన్న పరిపాలన వస్తుందని, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడంతో పాటు స్వరాష్ట్ర అభిమానం పెలుబుకుతుందని ఆశపడి తనువు చాలించినవాళ్ళు ఎందరో. 1969 తొలిదశ ఉద్యమం నుంచి ఇల్లు, జాగా, కుటుంబం, చదువు వదిలిపెట్టి రాబోయే తరాల కోసం ఆత్మబలిదానం చేసుకుని సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో వారి ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదు. అమరుల కలలుకన్న పాలనకు భిన్నంగా కొనసాగుతున్నది. అమరుల కుటుంబాలు ఆగమైపోయినాయి.
త్యాగం.. రాజకీయ పార్టీకి ఆపాదించడమా?
మరణం లేనటువంటి వాళ్ళు, మరణించినా ప్రజల హృదయాలలో బ్రతికి ఉన్నవాళ్లు, మరణానికి ఒక అర్థం ఉన్నవాళ్లు, తాము జీవించి లేకపోయినా తమ ఆశయాలను భావితరాలకు అందించగలిగిన వాళ్ళు మాత్రమే అమరులు అనబడతారు. వారి చావుకు ఒక ఆశయం, మరణానికి ఒక లక్ష్యం, మృత్యువాతకు ఒక అర్థం, బలిదానానికి ఒక సార్థకత. ఆ పోరాటంలో సహజ మరణం కూడా అమరత్వమే. ఇలా డా. బియ్యాల జనార్దన్ రావు, ప్రొఫెసర్ జయశంకర్, ఆకుల భూమయ్య, డా. బాలగోపాల్ వంటి వారు సహజ మరణం పొందిన వారి జీవితం మొత్తం తెలంగాణ గురించి ఆకాంక్షించిన వారే. ఇలాంటి మహానుభావులు, చరిత్రకారులు, సామాజికవేత్తలు, ప్రజాస్వామ్య, సామాజిక, స్వతంత్ర సమాన అవకాశాలు గల తెలంగాణ కోసం ఆరాటపడిన వాళ్లే.
1969 తొలిదశ ఉద్యమంలో 370 మంది అమరులు కాగా, ఇప్పటికీ ఆ కుటుంబాల పట్ల తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనైనా వారి త్యాగాన్ని లెక్కించకుండా ఉండటం అవమానకరం కాదా! 1996, 97లలో విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ జనసభ లాంటి సంస్థలు ప్రబలంగా ఉద్భవించడంతో అందులో పనిచేసిన వేలాది మంది కార్యకర్తలు చనిపోవడం, అలాగే మలిదశ ఉద్యమంలో తుపాకి గుండ్లకు బలైన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, పోలీస్ కిష్టయ్య లాంటి వాళ్లు చనిపోవడంతోనే ఆ మాత్రమైనా తెలంగాణ ఉద్యమం మొగ్గతొడిగింది. ఉద్యమం పతాక స్థాయికి చేరడం వల్లనే రాజకీయ పార్టీలు సహకరించడంతో జూన్ 2 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అంతేకానీ ఇది ఒకరి వల్ల సిద్ధించింది కాదు. దీని పునాది 70 ఏళ్ల క్రితం ఉన్నదనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. అందుకే పాలకులు ఉద్యమం తమతోనే ప్రారంభమైందని, రాష్ట్రాన్ని సాధించామని గొప్పలు చెప్పుకోవడం మాని ఉద్యమం వెనుక ఉన్నటువంటి అమరుల ఆశయాలకు మొగ్గ తొడిగి, వారి త్యాగాలు గుర్తించినప్పుడు మాత్రమే తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. ఇంతటి త్యాగాన్ని ఒక రాజకీయ పార్టీకి అంటగడితే అది చరిత్రకు మిగలదు.. చరిత్రకు నిలబడదు.
ఉద్యమకారులపై కేసులు పట్టించుకోరా?
తెలంగాణ ఉద్యమంలో ముందునుంచి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు కోకొల్లలు. కానీ ఆ ఆకాంక్షల వైపుగా ప్రస్తుత ప్రభుత్వం ప్రయాణించని కారణంగా 9 సంవత్సరాలు గడిచిన సాంప్రదాయ పాలనే తప్ప, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణను ఆవిష్కృతం చేసుకోలేకపోయాము. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనే పేరుతో తెలంగాణ ఉద్యమం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నది. అమరులు ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కానటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు, ప్రజాస్వామ్య, సామాజిక తెలంగాణ కోసం అర్రులు చాచి తమ బలిదానాల ద్వారానైనా ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఇస్తారని రాష్ట్రం సాధిస్తే ఆ లక్ష్యాలు చేరుకుంటామని ఆశించారు.. వారి త్యాగాలను గుర్తించిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఇస్తే, స్వరాష్ట్రంలోనే దగా మరింత పెరిగిపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, పేదరికం నిర్మూలించబడలేదు, ఆకలి చావులు ఆపలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, నిర్బంధం, అణచివేత కొనసాగుతున్నది. యువతకు ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడలేదు, ప్రజల ఆత్మగౌరవాన్ని పాలకుల పాదాల చెంత తాకట్టు పెట్టడం జరిగింది. స్వయంగా శాసనసభ్యులు, మంత్రులు, కలెక్టర్లే ముఖ్యమంత్రి పాదాలకు వందనం చేయాల్సి రావడం, పాలాభిషేకాలతో ఏక వ్యక్తి పాలన కొనసాగించడం వంటి దయనీయ పరిస్థితులు కొనసాగుతుంటే ఇక ఆత్మగౌరవం ఎక్కడిది?
అందుకే యువత నడుం బిగించాలి. పాలకుల కళ్ళు తెరిపించాలి. స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఉద్యమించాలి. రాబోయే ఎన్నికల్లో విద్య, వైద్యం, సామాజిక న్యాయాన్ని ఉచితంగా అందించే రాజకీయ పార్టీలకు మాత్రమే తమ ఓటు అని ఓటర్లు గర్జించాలి. అలాగే ఉద్యోగ అవకాశాల మెరుగుదల కోసం, రాష్ట్రంలో వివిధ పథకాలు ప్రాజెక్టుల విషయంలో కొనసాగుతున్న అవినీతిని నిర్మూలించడం కోసం, అధికార దుర్వినియోగాన్ని అంతం చేయడానికి విద్యార్థి ఉద్యోగ ఉపాధ్యాయ మేధావులు, ఐక్య ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వం ముందు అమరుల ఆకాంక్షలను నిలిపి వాటి సాధన కోసం డిమాండ్ చేసి పాలకుల కళ్ళు తెరిపించినప్పుడు మాత్రమే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, అమరుల ఆశయాలు నెరవేరినట్లు. ఇప్పటికి ఎంతోమంది ఉద్యమకారులు కేసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వారిని కేసుల నుండి విముక్తి చేయలేని ఈ ప్రభుత్వం ఇక చనిపోయిన అమరుల గురించి పట్టించుకుంటుందనే ఆశ.. అత్యాశే అవుతుంది! ఆశయాలు, ఆకాంక్షలకు భిన్నంగా నడుస్తున్న తెలంగాణ పాలనలో... అమరవీరుల త్యాగం, వెలకట్టలేని తెలంగాణపై అభిమానం పాలకుల కళ్ళు తెరిపించాలి.
వడ్డేపల్లి మల్లేశం
సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత
90142 06412