ఈ బెదిరింపులను ఉపేక్షిస్తే భారీ ప్రమాదమే!

by Ravi |   ( Updated:2024-10-26 00:46:00.0  )
ఈ బెదిరింపులను ఉపేక్షిస్తే భారీ ప్రమాదమే!
X

గుర్తు తెలియని ఆగంతకుల నుండి మన విమా నాలకు ఒక్కసారిగా బాంబులున్నాయని బెదిరింపు కాల్స్ అదేపనిగా వస్తూ ఉండటంతో ప్రయాణికులూ, వారి బంధుమిత్రులు, విమానయాన సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ బెదిరింపు కాల్స్‌ను ఫేక్ కాల్స్‌గా భావించి నిర్లక్ష్యమూ చేయలేం.. అదే విధంగా పట్టించుకోకుండా ఉండలేం. ఇది ప్రయాణికుల భద్రతకూ, ప్రాణాలకు సంబంధించినది.

బెదిరింపు కాల్స్‌తో కలవరం..

ఇలా మన విమాన వ్యవస్థలకు సవాల్ విసురుతున్న శక్తులను మన పోలీసులు పసిగట్టి త్వరగా వారి ఆచూకీ కనుక్కోవాలి. ఇవి కేవలం ఆకతాయి చేష్టలుగా కనిపించడం లేదు. మన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే, చికాకు పరిచే దుశ్చర్యలే. ఈ దుండగులు స్వదేశీయులైనా, విదేశీయులైనా ఈ విషయంలో ఉపేక్ష కూడదు. ఈ సవాల్ మన పాలనా యంత్రాంగం చురుకుతనానికి, రక్షణ సిబ్బంది సామర్ధ్యానికి అగ్ని పరీక్షగా భావించాలి. ఒకటి రెండు బెదిరింపు కాల్స్ కావు... వందలాదిగా ఫేక్ బెదిరింపు కాల్స్ రావటం అందర్నీ కలవరపాటుకు గురి చేస్తోంది.

నిశితంగా గాలించాల్సిందే!

పౌర విమానయానరంగం ఇప్పటికే వణికిపోతుండగా, ఒక్కరోజే యాబై బెదిరింపు కాల్స్ రావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. బాంబు బెదిరింపు కాల్స్ చేసినవారిని వదిలేది లేదని, వారికి జీవిత ఖైదు విధించేలా కఠిన చట్టాలు చేస్తామని, మన ప్రభుత్వం తరపున కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గట్టిగా చెప్పారు. ఒకపక్కన మన పోలీసులు కేసులు బుక్ చేస్తున్నా వారు బెదరడం లేదు. అంటే, బహుశా వారు శిక్షణ పొందిన తీవ్రవాదులై ఉంటారు. ఏది ఏమైనా వారి బెదిరింపులను తేలికగా తీసుకోలేం. మన ఉపేక్ష భారీ ప్రమాదానికి దారితీయవచ్చు. ప్రాణాలకు విలువ కట్టలేము. ఈ విషయంలో నిశితంగా గాలించాల్సిందే. ఏ ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాకే విమానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. మన నిఘా విభాలు,రక్షణ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.

ఎయిరిండియాలో ప్రయాణించవద్దట!

ఇది చిన్న విషయం కాదు. పిల్లకాయ చేష్టలు కావు. బహుశా విదేశీ తీవ్రవాదుల కుట్రలు కావచ్చు. ఏది ఏమైనా మన రక్షణ సిబ్బంది క్షుణ్ణంగా ప్రయాణికులను, సిబ్బందిని, వారి లగేజీని తనిఖీ చెయ్యాలి. ఈ మధ్యనే ఖలిస్తానీ తీవ్రవాది గురుపత్ వంత్ సింగ్ పన్నూ.. మన ఎయిరిండియా విమానాలలో ఎవరూ ప్రయాణం చేయవద్దు అని హెచ్చరించారు. ఇలాంటి ఖలిస్తానీ తీవ్రవాదులకు మద్ధతు, రక్షణ కల్పిస్తున్న కెనడా ప్రభుత్వం ఈ విషయంలో సిగ్గుపడాలి. ఇలాంటి వారిని పెంచి పోషించిన ప్రభుత్వాలు వారి చేతుల్లోనే భంగపడ్డ చారిత్రిక సత్యాలను మరువ కూడదు. ఈ చర్యలు మనకు ఆర్ధికంగా నష్టపరచటమే కాక ప్రయాణికులకు భయమూ...వారి కుటుంబాలకు ఆందోళనా కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చర్యలు, ప్రయత్నాలు త్వరగా ఫలించాలని కోరుకుందాం.

డాక్టర్ కిశోర్ ప్రసాద్

98493 28496

Advertisement

Next Story

Most Viewed