నిర్లక్ష్యం చేస్తే... భారీ మూల్యం తప్పదు

by Ravi |   ( Updated:2024-03-06 01:15:27.0  )
నిర్లక్ష్యం చేస్తే... భారీ మూల్యం తప్పదు
X

మాదక ద్రవ్య వ్యసనం, కుటుంబం దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థిరత్వం, పాలన వ్యవస్థలు, శాంతిభద్రతలు, ఆరోగ్య పంపిణీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నార్కో-టెర్రరిజం కారణంగా అంతర్గత, బాహ్య భద్రతకు ఇది ప్రమాదకరంగా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, సమాజం కూడా డ్రగ్స్ మహమ్మారి గూర్చి పెద్దగా పట్టించుకోవడం లేదు. వీరి నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో జరిగే విధ్వంసం ఊహించలేం.

నేడు ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న భయంకరమైన సమస్యలలో ‘మాదక ద్రవ్యాల తయారీ-అక్రమ రవాణా, వినియోగం’ అత్యంత ముఖ్యమైనది. వీటిని అరికట్టడానికి చాలా దేశాలు కఠిన చట్టాలను, శిక్షలను సైతం అమలు చేస్తూ ఈ సమస్యను ‘యుద్ధంతో సమానమైన’ తీవ్రతగా పరిగణిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6 శాతం జనాభా అంటే 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి.

దుర్వినియోగంలో ఈ రాష్ట్రం టాప్

డ్రగ్స్ మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే రసాయనిక పదార్థాలు. నేటి యువతరాన్ని దారి మళ్ళించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒకసారి దీనికి బానిసలైతే బయటికి రావడం చాలా కష్టం, దీన్ని వాడే క్రమంలో డబ్బుల కోసం ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయడానికి అసలు వెనుకాడరు.

18-75 సంవత్సరాల వయస్సు గల జనాభాలో మాదకద్రవ్యాల దుర్వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల జాబితాలో 29,57,000 మందితో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండగా, 17,02,000 మందితో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 10,07,000 మందితో కేరళ మూడో స్థానం, 9,82,000 మందితో చివరి స్థానంలో తమిళనాడు నిలిచాయి.

డ్రగ్స్ బారిన కోట్లాదిమంది

సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ వెలువరించిన “భారతదేశంలో మత్తు పదార్థాల వినియోగం విస్తృతి, నమూనాపై జాతీయ సర్వే” 2019 నివేదిక ప్రకారం దాదాపు 3.1 కోట్ల మంది వ్యక్తులు (2.8%) గంజాయి వినియోగదారులు, 72 లక్షల (0.66%) మంది ప్రజలు గంజాయి సమస్యలతో బాధపడుతున్నారు. మొత్తం ఓపియాయిడ్ వినియోగదారులు 2.06%, దాదాపు 0.55% (60 లక్షలు) మందికి ఆరోగ్య చికిత్స సేవలు అవసరం ఉన్నాయి. 1.18 కోట్ల (1.08%) ది ప్రస్తుతం మత్తుమందులను (వైద్యేతర ఉపయోగం) ఉపయోగిస్తున్నారు. 0.58% ఉన్న పెద్దలతో పోలిస్తే 1.7% మంది పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు ఇన్హేలెంట్ వినియోగదారులు. దాదాపు 18 లక్షల మంది పిల్లలకు ఇన్‌హేలెంట్ ఉపయోగం కోసం సహాయం కావాలి. సుమారు 8.5 లక్షల మంది డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ అధికారిక యంత్రాంగం ఇచ్చిన లెక్కలు అసలు వాస్తవాలు వీటికి రెట్టింపుగా ఉంటాయి.

తెలంగాణలో 9 శాతం కస్టమర్లు

గత సంవత్సరం ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో సమర్పించిన సామాజిక న్యాయం, సాధికారతపై పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక ప్రకారం 3.5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో 29.54 లక్షల మంది డ్రగ్స్ వినియోగదారులున్నారు. ఇందులో 10-17 సంవత్సరాల వయస్సు గల పిల్లల సంఖ్య 2.89.700, 18-75 ఏళ్ల వయసు గల వారిలో 29,57,000 మందికి పైగా మత్తు మాదక ద్రవ్యాల వినియోగదారులున్నారని వెల్లడించింది. అంటే రాష్ట్ర జనాభాలో 9 శాతం పైగా మంది డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు ఈ నివేదిక అందించిన గణాంకాలు చెబుతున్నాయి.

వీరిలో 16.63 లక్షల మంది నిద్రమత్తు మందులు తీసుకుంటున్నారు, 5.47 లక్షల మంది ఓపియాయిడ్లను, 1.95 లక్షల మంది ఇన్‌హలేంట్‌లను, 1.90 లక్షలమంది సాధారణ గంజాయిని, 1.75 లక్షల మంది హలుసినోజన్లను, 1.65 లక్షల మంది కొకైన్‌ను, 22.000 మంది యాంఫేటమిన్-రకం స్టిములెంట్స్‌ను తీసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. అయితే డ్రగ్స్‌కు బానిసలయిన 2,89, 700 పిల్లలలో, అత్యధికంగా 98,000 మంది పిల్లలు ఓపియాయిడ్‌లు, 71,000 మంది పిల్లలు ఇన్హాలేషన్‌లు, యాంఫేటమిన్-రకం స్టిములెంట్స్ 46,000 మంది, మత్తుమందులను 36,000 మంది వినియోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. 10-17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలలో 3,19,200 మందితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం 2,89,700 మంది పిల్లలతో రెండవ స్థానంలో, 1.14.300 మంది పిల్లలతో కేరళ మూడో స్థానం, 87,100 మంది పిల్లలతో చివరి స్థానంలో తమిళనాడు ఉంది.

జీరో టోలరెన్స్ విధానమే బెస్ట్

భవిష్యత్తులో నార్కో టెర్రరిజం‌తో మెజారిటీ దేశాలు అతులాకులం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అంటే 'బాటమ్ టు టాప్', 'టాప్ టు బాటమ్' పద్ధతిని అనుసరించాలి. అన్నీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉమ్మడిగా, నిజాయితీగా శ్రద్ధ తీసుకొని వ్యవహరించాలి. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమన్వయం, సహకారాన్ని పెంపొందించడం ద్వారా డ్రగ్స్ రహిత భారతదేశం, డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా ముందుకు వెళ్ళాలి. డ్రగ్స్ భూతాన్ని దేశం భూభాగం నుండి శాశ్వతంగా తరిమేయగలం లేనిచో భవిష్యత్తు తరాలు మూల్యం చెల్లించుకోవాల్సిందే.

డాక్టర్. బి. వి. కేశవులు. ఎండీ.

చైర్మన్, నేషనల్ యాంటీ - డ్రగ్స్ సంస్థ.

85010 61659

Advertisement

Next Story