మహనగరాన్ని మహానరకంగా మారుద్దామా?

by Ravi |   ( Updated:2024-09-13 01:30:55.0  )
మహనగరాన్ని మహానరకంగా మారుద్దామా?
X

హైడ్రా కూల్చివేత‌ల‌తో నిజంగానే కొంత‌మంది పేద‌ల‌కు గూడు లేకుండా పోతుండ‌వ‌చ్చు..! మ‌రి హైద‌రాబాద్ న‌గ‌రం, న‌గ‌ర ప‌రిస‌రాల్లో అన్యాక్రాంత‌మ‌వుతున్న జ‌లాశ‌యాల‌పై ఎలాంటి స‌మాధానం చెబుతారు? చెరువులు, కుంట‌లు మ‌టుమాయం కావ‌డంతో నేటి ముంబై, బెంగ‌ళూరు, చెన్నై న‌గ‌రాల ప‌రిస్థితేంటో మ‌నం చూస్తూనే ఉన్నాం. హైద‌రాబాద్‌కి కూడా ఆ ప‌రిస్థితి వచ్చేదాకా చూద్దామా?

సహజంగా నీరు పల్లం వైపు పోతుందని మన అందరికీ తెలుసు. అది ప్రకృతి ధ‌ర్మం. ప్రకృతి నియామ‌వాళికి వ్యతిరేకంగా వ్యవ‌హ‌రిస్తే ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న వ‌ర‌ద బీభ‌త్సాలే సాక్ష్యం. మ‌న పూర్వీకులు మనకు అంద‌జేసిన అద్భుత నీటి వ‌న‌రుల‌ను మనమే మన చేజేతులా నాశ‌నం చేసుకుంటున్నాం. చెరువుల గొలుసుక‌ట్టును తెంపేస్తున్నాం. ప‌ట్టణీక‌ర‌ణ ముసుగులో జ‌ల‌శ‌యాల భూములు కొల్లగొడుతూ.. కాంక్రీట్ జంగిళ్లను నిర్మించేస్తున్నాం. వర్షం పడితే చినుకు కూడా భూమిలో ఇంకకుండా, వ‌ర్షపు నీరు నిలిచే మార్గం లేక‌, న‌గరాల బ‌య‌ట‌కు వెళ్లే మార్గాలు మూసుకెళ్లడంతో ఒకేసారి వరద తాకిడి పెరిగి లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అవుతున్న ప‌రిస్థితులను క‌ళ్లారా చూస్తున్నాం. ప్రకృతి ప్రకోపానికి కార‌ణ‌మ‌వుతూ మ‌న వినాశానాన్ని కొని తెచ్చుకుంటున్నాం.

మంచిపనిని తక్కువచేసి చూడటమా..?

ప్రస్తుతం యావత్ దేశ ప్రజానీకం నోళ్లలో నానుతున్న ప‌దం ‘హైడ్రా’. మన హైడ్రా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మ‌హాన‌గ‌రాల‌కు మార్గం చూపుతోంది. చెరువుల అక్రమార్కుల‌పై క‌టువుగా ఉండ‌క త‌ప్పదన్న సందేశాన్ని, సారాంశాన్ని రేవంత్ స‌ర్కారు నిరూపిస్తోంది. అయితే, చెరువు, శిఖం భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న కొంత‌మంది పేద‌ల‌ను హైడ్రా కూల్చివేస్తుం డ‌టంపై అనేక విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వాస్తవ‌మే పేద‌ల‌కు అన్యాయం జ‌ర‌గ‌డాన్ని ఎవ‌రూ స‌మ‌ర్థించ‌రు. అందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇళ్లు మంజూరు చేస్తామ‌ని చెప్పడం వారికి కొంత సాంత్వన క‌లిగించే అంశమేన‌ని చెప్పవ‌చ్చు. హైడ్రా చేప‌డుతున్న మంచిని త‌క్కువ చేసి చూడ‌టం మాత్రం స‌రైంది కాదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రాను తీసుకురావ‌డం అన్నది రాజ‌కీయంగాను దుస్సాహ‌స‌మేన‌న్నది నిర్వివాదాంశం. పైగా అవ‌కాశవాద రాజ‌కీయం రాజ్యమేలుతున్న నేటి ప‌రిస్థితుల్లో.. హైడ్రాను ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించుకోవ‌డం అభినందించ‌ద‌గిన విష‌యం.

నగరాన్ని మహానరకంగా మారుద్దామా?

హైడ్రా కూల్చివేత‌ల‌తో నిజంగానే కొంత‌ మంది పేద‌ల‌కు గూడు లేకుండా పోతుం డ‌వ‌చ్చు..! మ‌రి హైద‌రాబాద్ న‌గ‌రం, న‌గ‌ర ప‌రిస‌రాల్లో అన్యాక్రాంత‌మ‌వు తున్న జ‌లాశ‌ యాల‌పై ఎలాంటి స‌మాధానం చెబుతారు? చెరువులు, కుంట‌లు మ‌టుమాయం కావ‌డం తో నేటి ముంబై, బెంగ‌ళూరు, చెన్నై న‌గ‌రాల ప‌రిస్థితేంటో మ‌నం చూస్తూనే ఉన్నాం. హైద‌ రాబాద్‌కి కూడా ఆ ప‌రిస్థితి వచ్చేదాకా చూద్దా మా? ఇప్పటికే, హైదరాబాద్‌ ఆ నగరాలకి భిన్నంగా ఏం లేదు. కాస్త బెట‌ర్‌గా మాత్రం పోల్చి చెప్పవ‌చ్చు. నాలాలు, చెరువుల‌ను, కుంట‌ల‌ను రాజ‌కీయ నేత‌లు త‌మ ప‌లుకుబ‌డితో ఎప్పటిక‌ప్పుడు మింగేస్తూ వ‌చ్చారు. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు అడ్డగోలుగా చెరువుల ప‌క్కన భూములు కొనుగోలు చేసి.. లేక్ వ్యూల పేరుతో శిఖం భూముల‌ను కొల్లగొట్టారు ఇది నిజం కాదా..? హైడ్రాను త‌ప్పుబ‌ట్టేవారు.. భూ ఆక్రమ‌ణ‌లకు పాల్పడిన వారి గురించి మాట్లాడ‌టం లేదెందుకు? వంద‌ల చెరువుల్లో వేల ఎక‌రాల శిఖం భూములు ఆక్రమ‌ణ‌ల‌కు, అన్యాక్రాంతమ‌వు తూ బ‌డా నేత‌లు, వారి బినామీ, రియ‌ల్టర్ల చేతుల్లోకి వెళ్లి ఆకాశ హార్మ్యాలు వెలుస్తున్న వాటిపై ఏం స‌మాధానం చెబుతారు? చెరువుల ఆక్రమ‌ణ‌ల‌కు ఎవ‌రో ఒక‌రు.. ఎప్పుడో ఒక‌ప్పుడు గ‌ట్టి నిర్ణయం తీసుకోకుంటే.. ప‌ట్టణీక‌ర‌ణ ప్రమాదంలో ప‌డ‌దా? మ‌హాన‌గ‌రం.. మ‌హాన‌ర‌కంగా మార‌దా..? గొప్ప సిటీగా చెప్పుకుంటూ.. చిన్న వ‌ర్షానికే అత‌లాకుత‌లం అయితే.. అంత‌ర్జాతీయంగా అప‌హాస్యం పాల‌వ‌డం ఖాయం కాదా? ఇవన్నీ హైడ్రాపై అడ్డగోలుగా విమ‌ర్శలు చేస్తున్న సోకాల్డ్ మేధావి వ‌ర్గం, రాజ్యాంగ బ‌ద్ద ప‌దవుల్లో కొన‌సాగుతున్న నాయ‌కులు ఆత్మ సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

నిబంధనలు అతిక్రమించి..

చెరువుకి గరిష్ట సామ‌ర్థ్యం క‌లిగి ఉన్నప్పుడు ఎంత విస్తీర్ణంలో నీరు ఉంటుందో అక్కడి వ‌ర‌కు చెరువు ప‌రిధిగా నిర్ణయించ‌డం జ‌రుగుతుంది. దీన్నే ఫుల్ ట్యాంక్ లెవ‌ల్‌(ఎఫ్‌ టీఎల్‌గా) చెబుతారు. ఇరిగేష‌న్ శాఖ రూల్స్‌, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ తీర్పు ప్రకారం ఈ ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టంగా పేర్కొన్నాయి. శిఖం భూముల్లో ప‌ట్టాలు క‌లిగి ఉన్నప్పటికి వ్యవ‌సాయం చేసుకోవాలి గాని నిర్మాణాల‌కు అనుమ‌తి ఉండ‌దు. ఇక బఫర్ జోన్లని కుంటలు/చెరువుల/సరస్సులు/నదులు/ నాలాలు, కెనాల్‌ లు జలాశయాల స్వభావం, విస్తీర్ణం బట్టి విభజించబ‌డుతాయి. చట్టప్రకారం బఫర్ జోన్లో కూడా ఎలాంటి భవన నిర్మాణాలు చేప‌ట్టకూడ‌దు. కానీ గ్రీన్ కారిడార్ లాంటివి డెవలప్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఏ అధికారి అయినా నిబంధనలను అతిక్రమించి ప్రభావాలకు లొంగి అనుమతులు ఇస్తే అక్రమాలు సక్రమాలు కాజాల‌వ‌న్నది గుర్తిం చాలి. అలాంటి అధికారులు ఏ స్థాయిలో ఉన్నా శిక్షార్హులే.

ముంపు గ్రామాలకు పునరావాసం కల్పించినట్టు..

ఇప్పుడు హైడ్రా కూల్చివేతలపై ప్రధానంగా వస్తున్న విమర్శలు పేదల ఇళ్లు కూల్చుతున్నారని.. అందుకే ప్రభుత్వం జలాశయాలు, ప్రాజెక్టులు కట్టినప్పుడు ముంపు గ్రామాలకు పునరావాసం కల్పిస్తున్న మాదిరిగా పేదలు.. చెరువులు, కుంట‌ల్లో నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఆశ్రయం క‌ల్పించేందుకు చ‌ర్యలు తీసుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అలా అయితేనే హైడ్రాను ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వానికి ప్రతిబంధ‌కాలు తొలుగుతాయి. జ‌లాశ‌యాల భూముల ప‌రిర‌క్షణ‌కు క‌ఠిన నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వం పేద‌ల‌కు గూడు లేకుండా చేసింద‌న్న విమ‌ర్శలు, అప‌వాదుల‌ను మూట‌గ‌ట్టుకోకుండా చూసుకోవాలి. ముఖ్య మంత్రి హైడ్రాను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్న ప్రకటన స్వాగతించదగినదే.

- పేరం గోపికృష్ణ

81425 90789

Advertisement

Next Story

Most Viewed