హైడ్రా, కబ్జాకోరుల కంట్లో నలుసు..

by Ravi |   ( Updated:2024-08-25 15:22:00.0  )
హైడ్రా, కబ్జాకోరుల కంట్లో నలుసు..
X

జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటలు, నాళాలు 70 శాతం వరకు కబ్జాకు గురికావడమే కాకుండా. 80కి పైగా చెరువులు పూర్తిగా అదృశ్యం అయినట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితికి అడ్డుకట్టు వేస్తేనే హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింపచేసి విశ్వ నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని హైడ్రా సంస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఈ సంస్థకు సమర్ధవంతమైన అధికారిగా పేరు గడించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ.వి.రంగనాధ్‌ను కమిషనర్‌గా నియమించారు. ఈ సంస్థ ఏర్పాటు చేసిన కొద్ది రోజులలోనే నగ రంతో పాటూ యావత్ తెలంగాణా రాష్ట్ర ప్రజల మనసు దోచింది. అందుకే హైడ్రాను తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తూ ఉండటం గమనార్హం.

రోడ్లు చెరువులయ్యే భాగ్యనగరం

హైదరాబాద్ మహానగరంలో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు అన్నీ చెరువులను తలపిస్తాయి. అనేక ప్రాంతాలలో వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంటుంది. పర్యవసానంగా అప్పుడప్పుడూ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువు లు, కుంటలు, నాళాలు 70 శాతం వరకు కబ్జాకు గురికావడమే దానికి ప్రధాన కారణం. ప్రభుత్వ భూములు కూడా హైదరాబాద్ మహానగర పరిధిలో విచ్చలవిడిగా కబ్జాకు గురి అయ్యాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేస్తేనే హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింపచేసి విశ్వనగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందనేది నిర్వివాదాంశం. హైడ్రా సంస్థ అనతి కాలంలోనే కబ్జా కోరులకు కంటి మీద కునుకు లేకుండా చేయడం గమనార్హం. కబ్జాకు గురైన ప్రభుత్వ ఆస్తుల గురించి ప్రతిరోజూ హైడ్రాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. హైడ్రా సంస్థ ఇప్పటికే కబ్జాకు గురైన ఇరవై చెరువులను స్వాధీనం చేసుకుని వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రికవరీ చేయడం గొప్ప పరిణామం.

వాళ్లే విమర్శిస్తే ఎలా?

అయితే, దానం నాగేందర్, అరికెపూడి గాంధీ లాంటి అనేక మంది అధికార పార్టీ శాసన సభ్యులు హైడ్రా సంస్థ పని తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుండడం చర్చనీయాం శం. దానం నాగేందర్ ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆక్రమణ దారులకు మద్దతు ఇస్తున్నారని హైడ్రా సంస్థ కూడా దానం నాగేందర్‌పై కేసు ఫైల్ చేయడం గమనార్హం. కొంతమంది అధికార పార్టీ నేతలు ఏకంగా హైడ్రా సంస్థను రద్దు చేయమని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. వీరంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదుద్దేశాన్ని విస్మరించి హైడ్రా సంస్థపై విమర్శ లు చేయడం ఆశ్చర్యకరం.

ఒత్తిడికి తలొగ్గకూడదంటే...!

అధికారాలు పరిమితంగా ఉండడంతో ప్రజా ప్రతినిధులు, కబ్జాకోరుల ఒత్తిడితో హైడ్రా సంస్థ అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హైడ్రా సంస్థకు ప్రత్యేక చట్టం తేవడంతో పాటూ ప్రత్యేక అధికారాలు కల్పించడం లేదా స్వయం ప్రతిపత్తి కల్పించినప్పుడే హైడ్రా నిర్భయంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేది నిర్వివాదాంశం. కనుక ఆ దిశగా చర్యలు చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సంకల్పించినట్లు హైదరాబాద్ మహానగరాన్ని విస్తరింపచేసి విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ మహానగరాల సరసన నిలుపుతారని ఆశిద్దాం.

కైలసాని శివప్రసాద్

94402 03999

Advertisement

Next Story