ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు

by Ravi |   ( Updated:2022-09-03 13:38:12.0  )
ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు
X

హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడతామని ప్రకటించిన ప్రభుత్వం కొన్ని నెలలు మాత్రమే మాట నిలుపుకుంది. ఇప్పుడు దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు. మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుండి పిట్టలు కట్టిన, పురుగు పట్టిన, ముక్కిన బియ్యాన్ని అనుమతిస్తున్నారు. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విద్యార్థులు తరచుగా వాంతులు విరేచనాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం మేల్కొని హాస్టల్స్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలలో పెడుతున్న తిండి తినలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. నాణ్యత లేని, కలుషిత భోజనం పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. సముచిత పౌష్టికాహారం పెట్టాలంటూ రోడ్డెక్కుతున్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడ చూసినా ఆహారం కలుషితం అవుతూనే ఉంది. ఫలితంగా విద్యార్థుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వమా లేక అధికారులా? ఇంత జరుగుతున్నా 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంతో మంది విద్యార్థులు అర్థాకలితోనే చదువులను కొనసాగిస్తున్నారు. ఆఖరికి యూనివర్సిటీలలోనూ భోజనం బాగుంటలేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

2017-18లో ఖరారు చేసిన మెస్ చార్జీలనే ఇప్పటికీ కొనసాగించడంతో ప్రస్తుత ఖర్చుకు ఏ మాత్రం సరిపోవడం లేదు. అందుకే మెనూలో క్వాలిటీ, క్వాంటిటీ తగ్గుతున్నాయి. నిర్వాహకులు పెరిగిన ఖర్చులను తట్టుకోలేక క్వాలిటీ లేని సరుకులు, ఎండిపోయిన కూరగాయలు, పుచ్చు పట్టిన పప్పులు వాడుతున్నారు. అపరిశుభ్రత వాతావరణంలో వంటచేయడంతో తరచూ ఫుడ్ పాయిజన్‌ అవుతోంది. మంత్రులు, అధికారులు ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా కార్యాలయాలకు పరిమితమవుతూ, ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా పరిశీలిస్తున్నారు. ఇటీవలే బాసర ట్రిపుల్ ఐటీలో క్వాలిటీ ఫుడ్ అందించాలని స్టూడెంట్స్ దాదాపు పది రోజులు దీక్ష చేశారు. విద్యా శాఖ మంత్రి వారిని పరామర్శించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆమె హామీ ఇచ్చి వారం రోజులు కాకముందే మరలా ఫుడ్ పాయిజన్ అయింది. బాసర లాంటి యూనివర్సిటీలలో ఫుడ్ క్వాలిటీ ప్రమాణాలు పాటించడం లేదంటే ప్రభుత్వ వసతి గృహలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

వారి ఒత్తిడి వలన

ఇటీవల మహబూబాబాద్ జిల్లాలోని ఓ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం భోజనంలో వానపాములు రావడంతో 36 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో సరిగా ఉడకని అన్నం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సొంత జిల్లా సిద్దిపేట బాలికల గురుకుల పాఠశాలలో దాదాపు 128 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలోని అన్ని గురుకుల సంక్షేమ హాస్టల్స్‌లో ఇదే దయనీయ పరిస్థితి ఉంది. దీంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.

హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెడతామని ప్రకటించిన ప్రభుత్వం కొన్ని నెలలు మాత్రమే మాట నిలుపుకుంది. ఇప్పుడు దొడ్డు బియ్యమే సరఫరా చేస్తున్నారు. మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుండి పిట్టలు కట్టిన, పురుగు పట్టిన, ముక్కిన బియ్యాన్ని అనుమతిస్తున్నారు. అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో విద్యార్థులు తరచుగా వాంతులు విరేచనాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం మేల్కొని హాస్టల్స్ కోసం ప్రత్యేక అధికారులను నియమించి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

దేవేందర్ ముంజంపల్లి

కేయూ, వరంగల్

89784 58611

Advertisement

Next Story