వరల్డ్ వాక్ : తీవ్ర సంక్షోభంలో అఫ్ఘానిస్తాన్

by Ravi |   ( Updated:2022-09-03 18:24:00.0  )
వరల్డ్ వాక్ : తీవ్ర సంక్షోభంలో అఫ్ఘానిస్తాన్
X

ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటైన అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక ఆర్థిక సంక్షోభం, కరువుతో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా తమ ఫెడరల్‌ బ్యాంకు నుంచి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అఫ్ఘాన్ కి అందాల్సిన నిధులను స్తంభింపజేయడంతో అక్కడి ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆహార సంక్షోభంతో ఆకలిచావులు పెరిగిపోయాయి. ప్రజలు తిండి కోసం తమ పిల్లలను, తమ శరీర భాగాలను విక్రయిస్తున్నారు. దేశంలో సగం మందికి పైగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరంలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఖండ భారతంలో 'గాంధార దేశం' ఒక భాగం. మధ్య ఆసియాలో నాలుగు వైపులా భూమి ఉన్న దేశం ఇది. దీనిని పూర్వం అరియానా అని, ఖోరాసన్ అని పిలిచేవారు. 1919లో ఆ దేశానికి పూర్తి స్వాతంత్ర్యం వచ్చాక అఫ్ఘానిస్తాన్ గా పేరొందింది. ఆ దేశంలో గొర్రెల పెంపకం, వ్యవసాయం ప్రధాన వృత్తులు, ఉప్పు, బొగ్గు, రాగి, ఇనుము, పెట్రోలియం ఈ దేశంలో విరివిగా లభించే ఖనిజాలు. ఇన్ని వనరులు ఉన్న దేశం పరిస్థితి నేడు మధ్య ఆసియాలో ఉన్న 15 దేశాలలోనే అత్యంత దయనీయంగా ఉంది.

దానికి కారణం తాలిబన్లు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడమే. అమెరికా, నాటో దళాలు ఇక్కడి నుంచి నిష్క్రమించిన తరువాత ఉగ్రవాదానికి మరో రూపమైన తాలిబన్లు అఫ్ఘానిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాము మారామని, ప్రజలందరికీ గౌరవం కల్పిస్తామనీ, ప్రజలను హింసించబోమనీ మొదట నమ్మించిన తాలిబన్లు ఆ తర్వాత వారి అసలు రంగు బయట పెడుతున్నారు. మరోసారి షరియా చట్టాలను అమలులోకి తీసుకు వచ్చి మహిళలను బానిసలుగా చూస్తున్నారు. అక్కడి ప్రజల పట్ల ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్నారు. గతంలో తాలిబన్లు రాజ్యాధికారం చేయడానికి ముందు కూడా అఫ్ఘానిస్తాన్ లో కరువు ఉంది. కానీ, వారి చేతుల్లోకి వెళ్లాక మరింత పెరిగింది.

వేలాది మంది ఉపాధ్యాయులు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. దేశానికి ప్రధాన ఆధారం వ్యవసాయం. ఈ ఏడు వ్యవసాయమే లేదు. దీంతో రెండున్నర కోట్ల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. తాలిబన్లు మొదటిసారి 1996లో అధికారంలోకి వచ్చినప్పుడే ఆ దేశ స్వరూపం, పరిపాలన పూర్తిగా మారిపోయాయి. దేశంలో వారు పలు ఆంక్షలు విధించారు. మహిళలు బయటకు రాకూడదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరి తోడు ఉండాలని, బురఖా ధరించాలనే నిబంధనలు పెట్టారు. దేశంలో ఉన్న అతి పెద్ద బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి ప్రపంచ మద్దతు పోగొట్టుకున్నారు. కాల క్రమేణా వారి పాలన నుండి విముక్తి పొంది ప్రజలు, మహిళలు స్వేచ్ఛతో చదువుకొని ఉద్యోగం చేయడం ప్రారంభించారు. దీంతో ప్రపంచ దేశాలు ఈ దేశానికి ఆర్థిక సహాయం చేశాయి.

నిధులు స్తంభింపజేయడంతో

మరోసారి తాలిబన్లు అధికారం చేపట్టడంతో అఫ్ఘానిస్తాన్ లో ప‌రిస్థితులు మ‌రింత‌ అధ్వానంగా త‌యార‌వుతున్నాయి. హింస‌, హ‌త్యలు, ఆక‌లి చావులు పెరిగిపోయాయి. ప్రజ‌ల‌కు తిండి క‌రువైపోయింది. చేయ‌డానికి ప‌నిలేక‌, తిన‌డానికి తిండిలేక అల్లాడుతున్న వేళ తాలిబ‌న్‌ల విధానాలు పరిస్థితులను మ‌రింత ద‌య‌నీయంగా మారుస్తున్నాయి.ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటైన అఫ్ఘానిస్తాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక ఆర్థిక సంక్షోభం, కరువుతో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా తమ ఫెడరల్‌ బ్యాంకు నుంచి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అఫ్ఘాన్ కి అందాల్సిన నిధులను స్తంభింపజేయడంతో అక్కడి ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆహార సంక్షోభంతో ఆకలిచావులు పెరిగిపోయాయి.

ప్రజలు తిండి కోసం తమ పిల్లలను, తమ శరీర భాగాలను విక్రయిస్తున్నారు. దేశంలో సగం మందికి పైగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సంవత్సరంలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా తాలిబన్లు మేల్కోని అక్కడి ప్రజలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి, ప్రజాస్వామ్య రీతిలో పాలన సాగిస్తూ ఇతర దేశాలతో సఖ్యత పెంచుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచించింది. మానవతా దృక్పథంతో ప్రపంచ దేశాలు సహయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చింది. దీనికి అనుగుణంగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్, అమెరికా దేశాలు తమ ప్రత్యేక రాయబారులతో అఫ్ఘానిస్తాన్ పరిస్థితి పై చర్చించారు.

దేశాల సహాయం అవసరం

ఐక్యరాజ్య సమితి వారి ఆహార వ్యవసాయ సంస్థ కూడా అక్కడి కరువు అంచనా వేసింది. కరువు నివారణకు, మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొల్పాలి అంటే సుమారు రెండున్నర వేల కోట్ల రూపాయలు అవసరమని చెప్పింది. అన్ని దేశాల మాదిరిగా అఫ్ఘానిస్తాన్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం నడుపుతూ దేశాల మధ్య సఖ్యత పెంచుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు గ్రహించాలి. కరువు నివారణకు కృషి చేయాలి. మహిళలకు సరియైన అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహించాలి. అపుడు కోరితే అన్ని రంగాలలో సహాయం చేసేందుకు ఎన్నో దేశాలు ముందుకు వస్తాయి.

మన దేశం కూడా ఇప్పటికే అక్కడికి బియ్యం, గోధుమలు పంపించింది. ఇలా మన దేశం ఒక్కటే కాకుండా ప్రపంచంలో ఉన్న దేశాలు ఆ దేశ పరిపాలన, తాలిబన్లు క్రూర అరాచకాలు చూడక, మానవతా దృక్పథంతో వ్యవహరించి అఫ్ఘానిస్తాన్ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తాలిబన్లు కూడా తమ వైఖరి మార్చుకుని ప్రజాస్వామ్య రీతిలో పరిపాలన సాగించి, దేశాల మద్దతు, సఖ్యత పొందవలసి ఉంది.

కనుమ ఎల్లారెడ్డి

93915 23027

Advertisement

Next Story