ఇంకెంతమందిని బలి తీసుకుంటరు?

by Ravi |   ( Updated:2024-07-05 01:00:55.0  )
ఇంకెంతమందిని బలి తీసుకుంటరు?
X

శరణుజొచ్చి వచ్చిన శత్రువునైనా కాపాడాలనేది ఒక నీతి ఉంది. మరి నమ్ముకొని వచ్చిన భక్తులను ఆ దేవుడు ఎందుకు కాపాడడం లేదు. ఈ మాట అంటే మూఢత్వానికి ఎక్కడ దెబ్బ వస్తుందోనని భయపడే మూఢులు ఈ సంఘటనలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దేవుడికి కోపం వచ్చిందని ఒకరు అంటుంటే, ఏదో అపచారం జరిగితేనే ఇలా అయ్యిందని ఇంకొకరు సమర్థించుకుంటున్నారు. పాపాలు పెరుగుతున్నాయి కాబట్టే అలా చనిపోతున్నారని మరికొందరు నమ్మిస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో లోపాలు ఉండడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వీళ్లు ఎందుకు ఒప్పుకోవడం లేదు?

ఎన్నో ప్రమాదాలు..

ఉత్తరప్రదేశ్ లోని హాథ్‌రస్‌ జిల్లా సికంద్రారావు సమీపంలోని ముఘల్‌గఢీ గ్రామంలో భోలే బాబాకు చెందిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా తొక్కిసలాటలు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. 2003లో ఇండోర్ లో రామనవమి సందర్భంగా వచ్చిన భక్తులపై అక్కడి పురాతన మెట్లబావిపై అమర్చిన స్లాబ్ కూలడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 36 మంది మృతి చెందారు. వారు ఆరాధించే రాముడు వారి ప్రాణాలను కాపాడలేదు.

2005లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న మాంఢర్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది చనిపోయారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది, హిమాచల్‌ప్రదేశ్‌లోని నైనా దేవి గుడిలో ఇలాంటి ఘటనలోనే 162 మంది చనిపోయారు. 2008 ఆగస్ట్ 3న హిమాచల్ ప్రదేశ్, బిలాస్‌పూర్ జిల్లాలోని నైనా దేవి మందిరం వద్ద ఒక పర్వతం నుంచి రాళ్లు పడుతున్నాయనే వదంతులు రావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత, తొక్కిసలాట జరగడంతో 162 మంది చనిపోయారు. 47 మంది గాయపడ్డారు.

2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్‌, జోధ్‌పూర్ నగరంలోని చాముండా దేవి ఆలయంలో బాంబు పెట్టారనే వదంతులలో అక్కడికి వచ్చిన భక్తుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మందికి పైగా చనిపోగా, 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. వీరందరూ నమ్ముకున్న ఆ అమ్మవార్లు వారిని కాపాడలేదు. 2010 మార్చి 4న ఉచితంగా పంచుతున్న ఆహారం, దుస్తులు తీసుకోవడం కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ నగరంలో ఉన్న రామ్ జానకీ మందిరానికి ప్రజలు పోటెత్తారు. స్థానిక ఆధ్యాత్మిక గురువు ఒకరు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన దుస్తులు, ఆహారం పంచుతుండగా ప్రజలు నియంత్రణ కోల్పోయి తొక్కిసలాట జరిగింది. దీంతో 63 మంది చనిపోయారు.

2011 జనవరి 14న కేరళలోని ఇడుక్కి జిల్లా పుల్మేదు సమీపంలో ఒక జీప్, శబరిమలకు వెళ్లి తిరిగొస్తున్న భక్తుల్ని ఢీకొట్టింది. ఈ ఘటన తర్వాత అక్కడ చెలరేగిన తొక్కిసలాటలో 104 మంది చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. 2011 నవంబర్ 8న హరిద్వార్‌లోని హర్‌ కీ పౌడీ వద్ద గంగా ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 20 మంది చనిపోయారు. 2012 నవంబర్ 19న ఛఠ్ పూజ సందర్భంగా పట్నాలోని గంగా తీరంలో ఉన్న అదాలత్ ఘాట్‌పై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి.

2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లా రత్నగిరి మందిరంలో నవరాత్రి ఉత్సవాల కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు వెళ్తున్న మార్గంలోని ఒక బ్రిడ్జి కూలిపోయిందనే వదంతి వ్యాప్తి చెందడంతో అక్కడున్న భక్తులంతా భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి 115 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2014 అక్టోబర్ 3న పట్నాలోని గాంధీ మైదానంలో దసరా సంబరాల్లో తొక్కిసలాట కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోగా, 26 మంది గాయాల పాలయ్యారు.

2015 జులై 14న పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద గోదావరి నదికి ప్రజలు పోటెత్తారు. ఘాట్ వద్ద తొక్కిసలాట జరగడంతో 27 మంది చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 2022 జనవరి 1న జమ్మూకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 12 మంది చనిపోగా, చాలా మందికి గాయాలయ్యాయి. ఇదే కాకుండా 2003 ఆగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కుంభమేళ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో 39 మంది చనిపోయారు. 140 మంది గాయపడ్డారు.

నిర్వహణ లోపాలు ఒప్పుకోరా?

ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో లోపాలు ఉండడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వీళ్లు ఎందుకు ఒప్పుకోవడం లేదు అసలు ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటున్నారా తీసుకుంటే అధికారులు ఆ ప్రదేశాలు అంతమంది పాల్గొనేందుకు అనువైనవేనా అని ఎందుకు పరిశీలించడంలేదు అంతమంది ప్రాణాలు పోతున్నా కారకులైన వారిని ఎందుకు శిక్షించడంలేదు శిక్షిస్తే దేవుడు చంపుతాడనే భయమా..‍‍‍‍‍‍‍‍! బోలో బాబా.. ఇంకెంతమందిని బలితీసుకుంటవ్?

మేకల ఎల్లయ్య,

99121 78129

Advertisement

Next Story

Most Viewed