పుస్తకాలు లేకుండా చదువులా?

by Ravi |   ( Updated:2022-09-03 13:51:49.0  )
పుస్తకాలు లేకుండా చదువులా?
X

తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. దీంతో పాఠశాల విద్య, ఉన్నత విద్య అనే తేడా లేకుండా ఫీజుల దోపిడీ జరుగుతోంది. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలలో కనీస మౌలిక వసతులు కల్పించలేదు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ ఇప్పటివరకు ఇవ్వలేదు. రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలలో దాదాపు 25 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో వారు పాఠశాలలకు వస్తున్నా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి మే నెలలోనే గోదాములకు రావాలి. బడి ప్రారంభమైన వెంటనే ఇవ్వాలి. కానీ, ఇప్పటికీ ఇంకా గోదాములలో ఉన్నాయంటే దానికి కారణం అధికారుల నిర్లక్ష్యం. వీరి నిర్లక్ష్యం విద్యార్థుల పట్ల శాపంగా మారింది.

పేద, మధ్య తరగతి విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం తగదు. పిల్లలు తినే 'మిడ్ డే మీల్స్' బిల్లులను సకాలంలో చెల్లించలేని దుస్థితి. దీంతో బాలబాలికలకు పోషకాహారం అందడం లేదు. ఇప్పటికి మిడ్ డే మీల్స్‌లో ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ఏడు రూపాయలు, ప్రైమరీ విద్యార్థులకు రూ.4.48 మాత్రమే ఖర్చు పెడుతోంది. దీనిని కూడా పెండింగ్ పెడితే పిల్లలకు నాణ్యమైన భోజనం ఎలా అందుతుంది? ప్రభుత్వ పాఠశాలలలో టీచర్ నుంచి స్వీపర్ వరకు అన్ని ఖాళీలే. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. నీరు, టాయిలెట్స్, తరగతి గదులు లేవు. వందల మందికి ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. బడి భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. విద్యార్థులు భయం భయంగా చదువులు కొనసాగిస్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం మాత్రం 'మన ఊరు-మన బడి' అంటూ కాలం గడిపేయడం దారుణం.

నిర్లక్ష్య వైఖరి వీడాలి

నిబంధనల ప్రకారం విద్యాసంస్థలు ఎటువంటి వస్తువులను అమ్మరాదు. నిబంధనలు తుంగలో తొక్కి క్యాంపస్‌లోనే వ్యాపారం చేస్తున్నాయి విద్యాసంస్థలు. స్టేషనరీ, నోట్ బుక్స్, యూనిఫామ్ అన్నింటిని పాఠశాలలోనే రెట్టింపు ధరతో అమ్ముతున్నాయి. మధ్యతరగతి తల్లిదండ్రులు వాటిని భరించలేమని చెప్పినా వినిపించుకోకుండా బలవంతం చేయడంతో అప్పులు చేసి మరి కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఫీజులను నియంత్రించడానికి చట్టం తీసుకొస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్లక్ష్య వైఖరి వీడాలి. అధిక ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ పాఠశాలలపై ఉక్కుపాదం మోపి ఫీజులను నియంత్రించాలి. ప్రభుత్వ పాఠశాలలలో మిడ్ డే మీల్స్ సరిగా అందేలా చూడాలి.. ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని నియమించాలి. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ సకాలంలో ఇవ్వాలి. తరగతి గదులు నిర్మించాలి. ఖాళీగానున్న పర్యవేక్షక అధికారుల పోస్టులు భర్తీ చేయాలి. అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.

పి. శ్రీహరి

ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్

96765 43472

Advertisement

Next Story