- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైడ్రాకు ఇంత మద్దతు ఎలా..?
దాదాపు గత నెల రోజులుగా సమాజంలో ఎన్నో సమస్యలున్నా, వైరల్ ఫివర్స్ వల్ల జనంతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ హాస్పిటల్స్‌లో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతున్నా, విద్యా రంగ సమస్యలను కనీసం కన్నెత్తి చూడకుండా, గురుకులాల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో విద్యార్థులు రోడ్లు ఎక్కుతున్నా, దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు నెలకొంటున్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తం మారుమోగుతున్న ఒకే ఒక్క వార్త హైడ్రా (HYDRAA)..!
ఇది ఇంత ప్రాచుర్యం పొందడానికి రెండు కారణాలు. ఒకటి సిన్సియర్ ఆఫీసర్‌గా పేరు పొందిన ఐపీఎస్ రంగనాథ్ గారిని కమిషనర్‌గా నియమించడం, రెండు, హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి ఒక సవాలుగా తీసుకోవడం, వీటితో సామాన్య జనాల్లో సైతం ఏదో మంచి జరగబోతోందని పెద్ద నమ్మకం పెట్టుకున్నారు. ప్రభుత్వానికి కింది స్థాయి నుండి భారీ ఎత్తున మద్దతు వస్తుండడంతో పాటు, ఈ నిర్ణయం మూలాన ఒక్కసారిగా ప్రభుత్వం మీద ప్రజల్లో విశ్వసనీయత పెరగడంతో పాటు, సానుకూల ప్రభావం పడినట్లు తెలుస్తుంది.
ఇబ్బందికి గురవుతున్నది వీళ్లే..!
హైడ్రా వల్ల పెద్ద మొత్తంలో ఇబ్బందికి గురవుతున్నది బడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు..! వీళ్లకు ముఖ్యంగా రాజకీయ నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఏం చేసినా చెల్లుతున్నదనే ధోరణిలో చెరువులు కుంటలు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారు. అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా లాభం లేకపోవడం అనేది వీరికి మింగుడు పడని అంశంగా మారింది. అయితే ఇందులో ఎప్పుడూ ఏ పార్టీ అధికారంలోకి వస్తే అందులోకి జంప్ అయ్యి తమ ఆస్తులు కాపాడుకునే వాళ్లకి అసలు కంటి మీద కునుకు ఉండడంలేదు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కబ్జా చేశారా? లేదా అనే స్పష్టత ఇవ్వకుండా నన్ను చంపండి కానీ మా కబ్జాలను కూల్చొద్దు అనడం, దాన్ని కూడా ఎమోషనల్‌గా అదేదో పేదోళ్లకు తమ ఆస్తులను రాసిచ్చినట్టు మాట్లాడినా ప్రజల నుండి సింపతీ పొందలేకపోయారు. అదే విధంగా కేటీఆర్ జన్వాడ ఫామౌస్ గురించి మాట్లాడుతూ లీజ్ తీసుకున్నానని అంటూనే, సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నారు అని మాట్లాడి ఇరుక్కుపోయాడు. రాజకీయ నాయకుల ఆస్తులు చాలా వరకు బినామీల పేరు మీదనే ఉంటాయన్న విషయం ప్రజలకు తెలియనిది కాదు.!
ఇప్పుడు కడుతున్న వాటికి..
సాక్ష్యాత్తు సీఎం మీడియాతో మా కుటుంబ సభ్యులవి ఉంటే చూపించండి, కంప్లైంట్ ఇవ్వండి దగ్గరుండి కూలగొడుతాం అని మాట్లాడిన మరుసటి రోజే, సీఎం సోదరుడి ఇంటికి నోటీసులు వెళ్లాయి. సీఎం సోదరుడు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం కొన్నవాటిని, ఇప్పుడు చెరువులో ఉంది అనడం ఏంటి? అప్పుడు పర్మిషన్ ఎలా ఇచ్చారనడం విస్మయం కలిగించింది. అయితే ఉన్నోడిది కూలగొడితే వాళ్లకు వచ్చే నష్టం పెద్దగా లేకపోవచ్చు, దీని ద్వారా పేదలకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు కానీ, కబ్జా చేసిన వారిని కూలగొట్టడంతో సరిపెట్టకుండా శిక్ష పడేలా చేస్తే మళ్లా కబ్జాలు అనేవి పునరావృతం కాకుండా ఉంటాయేమో ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది. అదే విధంగా అప్పట్లో చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతుంటే ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుని కూడా చూసి చూడనట్లు వ్యవహరించిన ప్రభుత్వ అధికారులకు ఏ విధమైన జరిమానాలు, శిక్షలు విధిస్తారో కూడా ప్రభుత్వం ఆలోచిస్తే, మునుముందు ఇట్లా అధికార దుర్వినియోగానికి పాల్పడాలంటే అధికారుల వెన్నుల్లో వణుకు పుట్టే విధంగా చట్టం చేయాలి. కట్టిన వాటిని కంప్లైంట్స్ ఇస్తే తొలగిస్తున్నారు బాగానే ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా నిబంధనలకు విరుద్ధంగా ఇస్తున్న పర్మిషన్ల మీద ప్రభుత్వ పరమైన పర్య వేక్షణ ఉందా లేదా అనేది ప్రశ్నార్ధకమే..?
తిమింగలాలను వదిలి చేపపిల్లలను పడితే..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC ACT) చట్టం, 1955 లోని సెక్షన్ 405 ప్రకారం ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చే అధికారం ఉన్నది. అలాగే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ VS నవాబ్ ఖాన్ గులాబ్ ఖాన్ వివాదంలో, తగిన సమయం ఇచ్చి వాటిని స్వయంగా తొలగించక పోతే ఆయా అథారిటీ వాళ్లు ఆయా అక్రమ నిర్మాణాలను తొలగించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కమిషనర్ తాము చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నాము అంటున్నారు బాగానే ఉంది కానీ "దున్నపోతుల ఊరేగింపులో లేగదూడలు బలి అయిన్నట్లు" బతుకుదెరువుకని పట్నం వచ్చిన బడుగుజీవులు తల దాచుకునే మార్గం లేక ఏదో చిన్న నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే వీరి ప్రతాపం ఈ పేదజనంపై ఉండనంత వరకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది. చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంలో తిమింగలాలను వదిలి చిన్న చేప పిల్లలపై ప్రభుత్వ ప్రతాపం చూపిస్తే ఎంత మద్దతు వస్తుందో అంతకు మించిన వ్యతిరేకత మూటగట్టుకోక తప్పదు. గత ప్రభుత్వంలో దాదాపు ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఉన్న వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పనంగా ఆయా పదవుల్లో ఉన్నోళ్లకి రెగ్యులరైజ్ చేశారని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించింది. వాటిపై కూడా ఉక్కు పాదం మోపి వాటి రిజిస్ట్రేషన్‌లు క్యాన్సిల్ చేస్తే గ్రామ స్థాయి నుండి మద్దతు పెరుగుతుంది.
విపత్తు నిర్వహణా ముఖ్యమే!
మరోవైపున ప్రజల సమస్యలను దారి మళ్లించేందుకు ఒక తాత్కాలిక ఆయుధంగా హైడ్రాను వాడుతున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. దీనికి పనితనమే సమాధానంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా దీన్నే ప్రధాన శీర్షికలుగా వేస్తే సామాన్యుల సమస్యలు నీరుగారిపోయే ప్రమాదం లేకపోలేదు. హైడ్రా కేవలం కూలగొట్టుడే దాని పని కాదు, వరదల వేళ ప్రజలకు అంతరాయం కలగకుండా విపత్తుల నిర్వహణ కూడా వారి ప్రధాన బాధ్యతే! మరీ ముఖ్యంగా బుల్డోజర్ రాజ్యానికి కాంగ్రెస్ వ్యతిరేకమని సాక్ష్యత్తూ ప్రియాంక గాంధీనే ప్రకటన చేశారు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇదే సత్వర న్యాయ పరిష్కారం అన్నట్టుగా ప్రచారం చేస్తుండడం విరోధభాసే..! ఎవడిదో ఉన్నోడిది పడగొడితే జనం జీవితాల్లో వచ్చే గొప్ప మార్పు ఏమి రాదు, వాడి అక్రమ ఆస్తులను జాతీయం చేయడమో, పేదలకు పంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటే పేద ధనిక వర్గాల మధ్యనున్న వ్యత్యాసాన్ని తగ్గించవచ్చు, ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాల్లో ఇదొకటి మాత్రమే..! కానీ ఇదే అన్నింటికీ పరిష్కార మార్గం అయితే కాదు.
ముఖేష్ సామల
అడ్వకేట్, తెలంగాణ
97039 73946