ఆరోగ్యకరమైన.. క్లీన్ చిత్రం

by Ravi |   ( Updated:2023-12-16 01:00:39.0  )
ఆరోగ్యకరమైన.. క్లీన్ చిత్రం
X

దర్శకుడు శౌర్యన్ తన చిత్రానికి కథను ఎంపిక చేసుకోవడంలో శ్రద్ధ తీసుకున్నా బలమైన స్క్రీన్ ప్లే లేకపోవడం, ఊహించలేని ట్విస్టులు పెట్టకపోవడం వంటివి ‘రచయిత’ బలహీనతలను చెబుతాయి. అయితే ఇవన్నీ భౌతికపరమైన కారణాలుగా కనిపించినా ‘చిత్ర’ నిర్మాణంలో వచ్చిన అడ్డంకులను దాటుకుని మంచి సాంకేతిక నిపుణులు బృందాన్ని ఎంపిక చేసుకుని ఆరోగ్యపరమైన చిత్రాన్ని నిర్మించారు. అయితే, స్క్రీన్ ప్లేలో ఉన్న కొద్దిపాటి లోపాలను సవరించుకొని ఉంటే కథ పాతదే అయినా కొత్తగా చూపించే ప్రయత్నం చేయవచ్చు.

నానికి సహజ నటుడు అనే పేరుంది. అతని చిత్రాలలో ఎంతో కొంత ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు ఊహిస్తూ థియేటర్‌కు వెళ్తారు. తొలి చిత్రం ‘అష్టా చమ్మా’ నుంచి అతడు తన సహజమైన నటన కొనసాగిస్తూనే కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. కానీ ఎక్కువ శాతం నాని చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఆర్థిక విజయాలను అందించారు. మధ్యలో మాస్ గెటప్ కోసం ‘కృష్ణార్జునులు’ వంటి చిత్రం చేసి దెబ్బతిన్న తర్వాత ఆ తరహా సినిమాలకు నాని స్వస్తి చెప్పాడనే అనుకోవాలి. అందుకే ‘శ్యామ్ సింగరాయ్’ వంటి ప్రయోగాత్మక వ్యాపార సూత్రాల మిళిత కథలను సమర్థవంతంగా నాని ‘డీల్’ చేశాడు. దర్శక నిర్మాతలకు నాని ఓ విజయ సూత్రం. నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రంపై అందరికీ ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమాలో కథానాయికి మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ చిత్రంతో క్లాస్ ఆడియన్స్‌కు దగ్గర అయింది. ఆమెను ప్రేక్షకుడు ఆ సినిమా పరిధిలో చూసే అవకాశాలు ఎక్కువ. నాని, మృణాల్ ఠాకూర్ కలయికలో వచ్చిన ‘హాయ్ నాన్న’ చిత్రంను అన్ని రకాల ప్రేక్షకులు చూడాలనుకోవడం నిర్మాతల ఆశ. అయితే ఈ చిత్రంలో దర్శకులు (రచన కూడా చేసిన) శౌర్యన్ కథను ఎంపిక చేసుకోవడం వెనుక ‘డెఫినెట్లీ, మే బి’ అనే హాలీవుడ్ చిత్రం ప్రభావం ఉందనిపిస్తుంది. ఇది ఆ సినిమాకి దగ్గరగా సాగే కథాంశం మరి.

స్లో కథనం ఉన్నా..

‘కథ’ పాయింట్ పాతదే.. విరాజ్(నాని) సింగిల్ పేరెంట్. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతనికి మహి అనే ఆరేళ్ల కూతురు (కియారా ఖన్నా) ముంబైలో అతని జీవనం. వీరికి తోడుగా వారి ఇంట్లో ‘ఫ్లూటో’ అనే పెంపుడు కుక్క, పాపకి తాతయిన ‘జయరాం’ ఉంటారు. అనుకోకుండా పాప ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యే సమయంలో ‘యష్ట’ (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. తదనంతర పరిణామాలతో ‘యష్ట’, ‘విరాజ్’లు పరస్పరం ప్రేమించుకుంటారు. అసలు ‘విరాజ్’ ఎందుకు సింగిల్ పేరెంట్‌గా ఉన్నాడు? అతను భార్య ఏమైందనేది తదుపరి సినిమా? ఈ కథను వింటుంటే అనేకమైన పాత సినిమాలు గుర్తుకు వస్తాయి. చిత్రం చూస్తున్నంత సేపు ‘ఎప్పటికీ ముందుకు కదలదే’ అనిపిస్తుంది. ప్రథమార్థమంతా ఇంతే! కథాపరంగా ‘హ్యూమన్ డ్రామా’ కోసం దర్శకుడు తగిన సమయం తీసుకున్నాడు. అయితే దీనిని నాని, మృణాల్ ఠాకూర్‌ల సహజమైన నటన వల్ల ప్రేక్షకులు ‘సహించే విధంగా’తీర్చిదాద్దారు. ఇంటర్వెల్ బ్యాంగ్ సన్నివేశం పాత చింతకాయ పచ్చడిని గుర్తుకు చేస్తుంది. ప్రస్తుత తెలుగు ప్రేక్షకుడు సినిమాతో అంతట్రావెల్ చేయగలడు. ఈ చిత్రంలో శృతిహాసన్, జయరాం లాంటి గొప్ప నటులున్నా వారి పాత్రలకు పెద్దగా స్కోప్ లేదు.

అయితే, ఈ చిత్రంలో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. ముందుగా నేపథ్యసంగీతమందించిన హేషం అబ్దుల్ వాహబ్ తనవంతు పాత్రను వందశాతం విజయవంతంగా చేశారు. సినిమాకు పెద్ద ప్లస్ నేపథ్య సంగీతం. స్లో కథనాన్ని ప్రేక్షకులు ‘కూర్చుని’ చూడగలిగేలా చేసింది. సంగీతానికి తగిన సాహిత్యం కూడా సరిగ్గా సమకూరింది. పాటల్లో మంచి ‘సాంద్రత కలిగిన లోతైన’ సాహితీ పద భావజాలంలో ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. ప్రేమకి, బాధ్యతకి తేడా చెప్పే సంభాషణలు బాగున్నాయి. కెమెరా వర్క్ సనూజాన్ వర్ఘీస్, ఎడిటింగ్ ప్రవీణ్ ఆంటోనీలు తమవంతు బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేసి సినిమాను ‘పర్వాలేదనిపించారు. నటీనటుల పరంగా చూస్తే నాని, మృణాల్ బాగానే చేశారు.

కథనంలో కొంత ఇబ్బంది ఉన్నా..

మంచి ఎమోషన్‌ని పండించడానికి స్కోప్ ఉన్న కథ. అది అందుకు తగిన విధంగానే వారి నటన ఉంది. ఇందులో ఆరేళ్ల మహిపాత్ర చాలా మెచ్యూర్డ్‌గా ప్రవర్తిస్తుంది. పాత్ర పోషించిన బేబీ కియారా ఖన్నా కూడా పాత్ర స్వభావానికి తగిన విధంగా నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. ప్రియదర్శి, జయరామ్, శృతిహాసన్ వంటి వారు వారి పద్ధతిలో వారు నటించారు. శృతిహాసన్ అతిథి పాత్రను కొంచెం స్థాయిని పెంచి చిత్రించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. దర్శకుడు శౌర్యువ్ తన చిత్రానికి కథను ఎంపిక చేసుకోవడంలో శ్రద్ధ తీసుకున్నా బలమైన స్క్రీన్ ప్లే లేకపోవడం, ఊహించలేని ట్విస్టులు పెట్టకపోవడం వంటివి ‘రచయిత’ బలహీనతలను చెబుతాయి. అయితే ఇవన్నీ భౌతికపరమైన కారణాలుగా కనిపించినా ‘చిత్ర’ నిర్మాణంలో వచ్చిన అడ్డంకులను దాటుకుని మంచి సాంకేతిక నిపుణలు బృందాన్ని ఎంపిక చేసుకుని ఆరోగ్యపరమైన చిత్రాన్ని నిర్మించారు. అయితే, స్క్రీన్ ప్లేలో ఉన్న కొద్దిపాటి లోపాలను సవరించుకొని ఉంటే కథ పాతదే అయినా కొత్తగా చూపించే ప్రయత్నం చేయవచ్చు. ఇందులో మంచి సెంటిమెంట్, డ్రామా పూర్తిస్థాయిలో పండలేదనే చెప్పాలి. కథనంలోని కొద్ది ఇబ్బందులు, ప్రధాన పాత్రలపైన పెట్టిన శ్రద్ధ మిగిలిన పాత్రలపైన పెట్టకపోవడం, స్లోనెరేషన్, రోటీన్ సన్నివేశాలు వంటి వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో రేంజ్‌లో ఉండేదనిపిస్తుంది. మంచి అనుభూతిని అందించి ఉండేది. కథకనుగుణమైన సన్నివేశాలు చిత్రానికి బలాన్నిస్తాయి. హీరోయిన్ తల్లిదండ్రుల మధ్య గొడవలకు కారణాలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వంటి ఉదాహరణలు ఆశించిన ఫలితాన్నివ్వవు. ఈ లోపం హాలీవుడ్ కథలోనిదా అనే భావన కలగటం సహజం.నాని చిత్రాల నుంచి ఆశించే ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. అతను తన పాత్రను ప్రేమించే చేశారు. దర్శకుడు శౌర్యున్ కథను హెండిల్ చేయడంలో మరికొంచెం చక్కని స్క్రీన్ ప్లే అవసరమనిపించే విధంగా ‘హాయ్ నాన్న’ ఉంది. మొత్తం మీద ఇది క్లీన్ చిట్ చిత్రం.

చిత్రం - హాయ్ నాన్న

నటీనటులు- నానీ, మృణాల్ ఠాకూర్

దర్శకుడు- శౌర్యన్

ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో వీక్షించవచ్చు

- భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Advertisement

Next Story