'గుంజన' మా నయాగరా

by Ravi |   ( Updated:2023-03-16 19:15:05.0  )
గుంజన మా నయాగరా
X

గుంజన.. ఎత్తైన కొండ పైనుంచి దుముకుతున్న జలపాతం. దానికి రాత్రీ పగలు తేడా లేదు. రుతువులను పట్టించుకోదు. ప్రవహిస్తూనే ఉంటుంది జీవనదిలా. లెక్కలేనన్ని ఏర్లను తనలో కలుపుకుంటుంది మహాసముద్రంలా.

గుంజన..హెూరెత్తుతూనే ఉంటుంది. నీటి ముత్యాలను విరజిమ్ముతూనే ఉంటుంది. జలసంగీతాన్ని వినిపిస్తూనే ఉంటుంది. ఎన్ని రాగాలు పలుకుతుందో! ఎన్ని గారాలు పోతుందో!

గుంజన..శేషాచలం కొండల్లో కొలువైన జలపాతం. జలపాతానికి ముందు, వెనుక ఇదొక పెద్ద ఏరుగా ప్రవహిస్తోంది. ఈ ఏరు ఎన్ని కొండల్ని చూసిందో! ఎన్ని లోయల్లోకి ఉరికిందో! ఎన్ని గుండాల్లోకి దూకిందో!

గుంజన.. దీన్ని చూడడం ఒక అనుభూతి. దాని దరి చేరడం ఒక పెద్ద సాహసం. 'సీమ'కు ఇదొక నయాగరా! గుంజనకు వెళ్ళాలంటే అటవీ అనుమతి కావాలి. తిరుపతి నుంచి కోడూరుకు 40 కిలోమీటర్లు. కోడూరుకు రెండు కిలోమీటర్ల ఆవల ఎడమ వైపున గంగరాజు పాడు గ్రామం నుంచి అడవిలోకి దారి. ఏడు కిలోమీటర్ల వరకు గ్రామాలే. ఆ తరువాత అడివిలో పదకొండు కిలోమీటర్లు . ఆ రహదారి ఎన్ని మెలికలు తిరిగిందో! దారికి ఇరువైపులా పచ్చని అరటి, మామిడి తోడలు. దూరంగా గుంజన ఏరు కొట్టుకు వచ్చిన రాళ్ళతో నిండి ఉంది. వర్షాకాలంలో ఆ ప్రవాహం ఉధృతంగా ఉంటుంది.

గ్రామాలు దాటాక అంతా అటవీ ప్రాంతం. దట్టంగా పెరిగిన వృక్షాలు. వాటికి అల్లుకున్న తీగలు. ద్విచక్రవాహనాల్లో వెళుతుంటే, కొండగాలి శరీరాన్ని స్పృశిస్తూ పలకరిస్తుంది. ఆ శీతల వాయువు తాకిడికి చెట్లు తలలూపుతుంటాయి. పక్షుల పలకరిస్తుంటాయి. వాహనాల వేగం గంటకు పదికొలోమీటర్లు వెళితే చాలా ఎక్కువ. మధ్యలో అటవీశాఖకు చెందిన పులిగోరు పెంట బేస్ క్యాంప్. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లలో దొంగల బండ. ఇక్కడి వరకే వాహన యోగం.

గుంజన ఏటిని చూడాలంటే ఇక్కడి నుంచి లోయలోకి దిగాలి. నిజానికిది ఎంత పెద్ద ఏరో! ఇరు వైపులా రెండు ఎత్తైన కొండలు. రెండు కొండల నడుమ ప్రవహిస్తున్న ఏరు. ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన బండ రాళ్ళు. ఏటి ప్రవాహానికి పెకిలించుకుని వచ్చిన మహావృక్షాలు. అక్కడక్కడా ఎత్తుగా పెరిగిన బోద. పడమర నుంచి తూర్పునకు ప్రవహిస్తున్న గుంజన. అనేక నదులు, ఏర్లు పిల్ల కాల్వలు సముద్రంలో సంగమించినట్టు, గుంజనలోకి ఎన్ని ఏర్లు వచ్చి కలిశాయో! మూడేర్ల కురవ, యుద్ధగళ, హలాయుధ తీర్ధం, విష్ణుగుండం, బృగముని తీర్థం, నారాయణ తీర్థం, కంగుమడుగు, పెద్ద గోడ, నంది తీర్థం, కైలాస తీర్థం, శనేశ్వర తీర్థం, మునీశ్వర తీర్థం; ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవి కాకుండా రెండు కొండల పైనుంచి జాలు వారే ప్రతి నీటి బొట్టు గుంజనలో సంగమించాల్సిందే. వర్షాకాలంలో చూడాలి దీని విశ్వరూపం. రెండు కొండల నడుమ పోటెత్తిన నదిలా ప్రవహిస్తుంది.

గుంజన ఏరులో సాగుతుంటే నేలంతా పరుచుకున్న ఎర్రని బండలో లోతైన నీటి గుండాలు. ఈ గుండాల్లో ఈదులాడవచ్చు. ఆ ఏటిలో గుడారాలు వేసుకుని రాత్రి బసచేయవచ్చు. అసలు గుంజన జలపాతాన్ని చూడాలిగా! ఈ ఏరులో తూర్పునకు నడుస్తుంటే, ఎన్ని ఎత్తుపల్లాలు! ఎన్ని బండరాళ్ళు! వాటికి ఎన్ని రూపాలు! ఎన్ని నీటి గుండాలు! ఎడమ నుంచి కొండెక్కుతాం. ఆ కొండ దాదాపు ఏటవాలుగా ఉంటుంది. దొంగల బండకు ఈవలే ఎడమ వైపు లోయలోకి దిగాలి.

ఏటవాలుగా ఉన్న లోయలో చెట్ల కొమ్మలు పట్టుకుని దిగాలి. పట్టులేకపోతే జారిపోతాం. ఒకరి వెనుక ఒకరు దిగాలి. ఒక్కొక్క సారి రాళ్ళు పట్టుకుని దిగాలి. కొన్ని చోట్ల కూర్చుని దేక్కుంటూ పోవాలి. పాక్కుంటూ పోవాలి. దారికి కొండ రాయి అడ్డంగా వస్తుంది. ఆ రాయి కింద పడుకుని జారుకుంటూ వెళ్ళాలి. తలెత్తితే రాయి తగులుతుంది. ప్రతి చోట పట్టుకోడానికి చెట్లుండవు, రాళ్ళుండవు. పైనున్న చెట్టుకు తాడు కట్టే కిందకు వదిలి, దాన్ని పట్టుకుని దిగాలి. అలా రెండు మూడు తాళ్ళు కట్టుకోవాలి.

దూరంగా వినిపిస్తున్న గుంజన జలపాతపు హెూరు. సాహసికులను రమ్మని పిలుస్తోంది. అదిగో చెట్ల మాటు నుంచి కనిపిస్తున్న జలపాతం. కిందకు దిగుతున్న కొద్దీ ఆ హెూరు మరింతగా సోకుతోంది. అదిగో అదే గుంజన జలపాతం. దాని దరి చేరాలంటే మరో పెద్ద బండరాయి దిగాలి. బెత్తెడంత పట్టు దొరికే కొండ అంచులు. ఆ అంచుల్లో కాళ్ళు పెట్టుకుంటూ వెనక్కి తిరిగి జాగ్రత్తగా దిగాలి.

ఇదిగో ఇదే గుంజన. హోరెత్తుతోంది. వేసవిలోనూ దాని జోరు తగ్గలేదు. రెండు కొండల నడుమ లోతైన నీటి గుండంలోకి జాలువారుతోంది. కొండంతా బండ రాయే. నేలంతా బండ రాయే. ఎత్తైన రాతి కొండ నుంచి కింద నున్న లోతైన నీటి గుండంలోకి దుముకుతోంది. నీటి ముత్యాలను విరజిమ్ముతోంది. దానికి అలుపు సొలుపు లేదు. దివారాత్రులు దుముకుతూనే ఉంటుంది. పైనుంచి విహరించే పక్షులను పలకరిస్తుంది. చురుక్కుమనే సూర్యుడి కిరణాలు తాకి చెమక్కుమంటుంది. రాత్రి వచ్చే చందమామతో కబుర్లాడుతుంది. నక్షత్రాలతో నాట్యమాడుతుంది. మేఘాలతో మాటా మంతి జరుపుతుంది. రుతువులతో సంబంధం లేకుండా దుముకుతూనే ఉంటుంది. పచ్చని అడవి తల్లి మెడలో వెలకట్టలేని హారం. దుముకుతున్న గుంజనను చూస్తుంటే చాలు, దానిలోకి దూకేయాలని పిస్తుంది.

గుంజన వేసవిలోనే ఇలా ఉంటే, ఇక వర్షాకాలంలో ఎలా ఉంటుంది! గుంజన నీటి గుండం పొంగి పొర్లి ముందుకు సాగుతుంది. ఏటవాలుగా ఉన్న బండ పై నుంచి కిందకు జాలువారుతుంటుంది. దాని వెంట వెళ్ళడానికి సాహసం చేయాలి. నిలబడి కిందకు దిగితే ముందుకు ఒరిగిపోతాం. కూర్చుని నిదానంగా జారుతూ దాని మెలికల వెంట సాగిపోతే, అది ఎంత గొప్ప అనుభూతి! కిందకు దిగాక వెనక్కి తిరిగి చూస్తే, రెండు కొండల నడుమ ఎన్ని మెలికలు తిరిగిందీ! ఏమి హెుయలు పోతోందీ గుంజన!

జాగ్రత్తగా దిగితే, కింద కూడా పెద్ద నీటి గుండం. నీటి గుండానికి అనుకుని అర్ధ చంద్రాకారంలో ఉన్న రాతి కొండ అకాశాన్నితాకాలని చూస్తోంది. నిలుచున్న రాయి పైనుంచి అనీటి గుండంలోకి దూకామా ఏమా ఆనందం! ఏమా అనుభూతి! నీటి గుండంలోంచి తలెత్తి ఆకాశాన్ని చూస్తే , ఓహ్..చుట్టుముట్టిన కొండ. మధ్యలో నీటి గుండం. కొండ అంచున వృక్షాలు గడ్డిపోచల్లా కనిపిస్తున్నాయి. ఈ నీటి గుండం నుంచి పొంగిపొర్లి ముందుకు సాగుతుంది. మరో మూడు నీటి గుండాలను నింపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఇటు నుంచి ఆ నీటి గుండాల్లోకి సాగలేం. ఆ తరువాత నాగేటి చెరువులోకి సంగమిస్తుంది.

ఎంతసేపుంటాం! కాలం తరుముకొస్తుంది. పాక్కుంటూ వచ్చిన బండపైనే, వంగి వంగి ఎక్కాలి. గుంజనను ఎంత సేపు చూసినా తనివి తీరదు. మనల్ని వదల్నంటుంది. వెనుతిరగక తప్పదు. మళ్ళీ వచ్చిన దారినే బండ ఎక్కాలి. దిగడమైతే దిగాం కానీ, ఆ బండను ఎక్కడం ఎంత కష్టం! మరొకరు సాయపడాలి. చివరికి వచ్చే వారు సాయం లేకుండా పైకి రాగలగాలి. మళ్ళీ తాళ్లు పట్టుకుని పైకి ఎక్కుతుంటే అదే అలుపు. పట్టు దొరకదు. చెట్టు కొమ్మ పట్టుకుంటే, ఒక్కొక్కసారి చేతికి ఊడొస్తుంది. రాయి పట్టుకున్నా అంతే. ఒక్కరొక్కరే దిగాలి. పళ్ళబిగువున అడుగులు వేయాలి. పక్కన ముళ్ళపొదలు. దిగడం ఎంత శ్రమో, ఎక్కడం రెట్టింపు శ్రమ.

హమ్మయ్య పైకి వచ్చేశాం అనుకుంటాం కానీ, ఇంకా ఉంటుంది. దారి తెన్నూ లేదు. అడివంతా బోద. ఆ బోద లోంచే నడక. వీస్తున్న కొండ గాలి చెమట పట్టిన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇంత లోతైన లోయలోకి ఎలా దిగామా అనిపిస్తుంది. గుంజనను చూడాలనే కాంక్షతోనే దిగాం. ఆ అనుభూతులను మూటగట్టుకుని పైకి వచ్చేశాం. దొంగల బండకు చేరతాం. వచ్చిన దారినే వాహనాల్లో వెనుదిరగాలి. ఈ వారానికి ఈ సాహసం చాలు. అద్భుతమైన అనుభూతులను మిగిల్చిన గుంజనకు వందనాలు.

-రాఘవశర్మ

సీనియర్ జర్నలిస్టు

94932 26180

Advertisement

Next Story

Most Viewed