గుండెను తడిపేసే గుల్జార్ సినిమాలు!

by Ravi |   ( Updated:2023-08-26 00:01:04.0  )
గుండెను తడిపేసే గుల్జార్ సినిమాలు!
X

మనసులో తడి ఉన్న కవి, aesthetic senseతో సినిమాలు తీస్తే ఒక పరిచయ్, ఒక కోషిష్, ఆంధీ, ఖుష్బూ, మౌసమ్, కినారా, ఇజాజత్, లేకిన్, హు తు తు లాంటి కళాఖండాలు పుట్టుకొస్తాయి. ఈ పేర్లు వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను గుల్జార్ డైరెక్ట్ చేసిన సినిమాల గురించే మాట్లాడుతున్నానని! అవును గుల్జార్ ఎంత గొప్ప కవో అంత గొప్ప డైరెక్టర్ కూడా. ఆయన కవితల్లో మాదిరే సినిమాల్లోనూ melancholy తెలిసీ తెలియనట్లుగా మెలిపెడుతుంటుంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కవిత్వం తొణికిసలాడుతుంది. గుల్జార్ సినిమాలన్నింటిలోకి నాకు మౌసమ్ చాలా పోయెటిక్‌గా అనిపిస్తుంది. సినిమా చూస్తుంటే ఏదో బాధ గుండెను పిండేస్తుంది. ఆ మాటకొస్తే ఆయన ప్రతి సినిమా ఇంచుమించు అలానే ఉంటుంది. అయితే ‘పరిచయ్’ మాత్రం హాయిగా అనిపిస్తుంది. పిల్లల అల్లరి, ఆ పిల్లల్లో పిల్లలా కలిసిపోయి చిలిపి పనులు చేసే జయ భాదురి, వీళ్ళను ట్రాక్‌లోకి తేవడానికి జితేంద్ర పడే తిప్పలు అన్నీ తమాషాగా అనిపిస్తాయి. గుల్జార్ కవిత్వమూ అంతే కదా! విడిగా ఎంత బరువైన కవిత్వం రాస్తారో పిల్లల దగ్గరకొచ్చేసరికి అంత అలతి అలతి పదాలతో సుతిమెత్తటి పాటలు అల్లుతారు. జంగిల్ బుక్ టైటిల్ సాంగ్ లో ‘అరె చెడ్డీ పెహన్ కే ఫూల్ ఖిలా హై’ అంటూ మోగ్లీని చెడ్డీ వేసుకున్న పువ్వుతో పోల్చడం మనం ఎప్పటికైనా మర్చిపోగలమా?

కథేంటంటే..

గుల్జార్ తన సినిమాల్లో జీవితపు లోతులను అత్యద్భుతంగా ఆవిష్కరించడమే కాదు.. వాటికి కమర్షియల్ హంగులద్ది భారీ సక్సెస్ చేసుకోగల సత్తా ఉన్న డైరెక్టర్. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాయే ‘ఆంధీ’. సున్నితంగా కనిపిస్తాడే కానీ ఆయన మహా గట్టివాడు! ఈ సినిమా వ్యవహారంలో ఆయన ఎదుర్కున్నన్ని ఇబ్బందులు మరి దేనికీ ఫేస్ చేసి ఉండడు. అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాడే తప్ప వెనకడుగు వేయలేదు. కాబట్టే ‘ఆంధీ’ భారత సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయింది. కల్ట్ క్లాసిక్ స్టేటస్ సాధించింది. ‘ఆంధీ’ పేరుకు తగ్గట్లే అప్పట్లో పెద్ద తుఫానే సృష్టించింది. ఇది బాలీవుడ్‌లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ దుమారం రేపింది. 1975లో వచ్చిన ఈ సినిమా అన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం ఇందులోని ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉండడమే!

బ్రీఫ్ గా కథ చూస్తే ఆర్తీ దేవి (సుచిత్రా సేన్) ఒక పొలిటీషియన్ కూతురు. ఓ రోజు తప్పతాగి ఓ హోటల్‌కి వెళ్తే అక్కడ మేనేజర్‌గా పని చేస్తున్న జేకే (సంజీవ్ కుమార్) ఆమెను రక్షిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్ళి కూడా చేసుకుంటారు. కానీ పొలిటీషియన్ కూతురైన ఆర్తీ ఒక మామూలు మనిషితో కలిసి బతకలేకపోతుంది. కొన్నాళ్ళకు ఇద్దరూ విడిపోతారు. కట్ చేస్తే ఆర్తి గొప్ప రాజకీయ నాయకురాలిగా ఎదుగుతుంది. జేకే మాత్రం ఉన్న చోటే ఉంటాడు. అనుకోకుండా ఆ ఇద్దరూ కలుస్తారు. వెనకటి స్మృతులన్నీ ఒక్కొక్కటిగా పలకరిస్తాయి. చివరికి వాళ్ళు మళ్ళీ కలుస్తారా? లేక ఎవరి దారిన వాళ్ళు వెళ్తారా? అనేదే మిగతా కథ.

రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు...

అయితే ఈ సినిమాలో సుచిత్రా సేన్ క్యారెక్టరైజేషన్ ఇందిరా గాంధీని పోలి ఉంటే సంజీవ్ కుమార్ రోల్ ఫిరోజ్ గాంధీకి దగ్గరగా ఉందని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. రిలీజైన కొన్ని నెల్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సినిమాని బ్యాన్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. చివరికి ఎమర్జెన్సీ ఎత్తేసిన కొన్నాళ్ళకు అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఈ సినిమాని మళ్ళీ రిలీజ్ చేసింది. ఇంత కాంట్రవర్సీ రేగినా గుల్జార్ మాత్రం ఇందిరా గాంధీకి, ఈ సినిమాకి సంబంధమే లేదని వాదించారు. కానీ ఇందిరా గాంధీ ఓడిపోయాక ఇది ఆవిణ్ణి దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమానే అని ఒప్పుకున్నారు. ఒక కెరీర్ ఓరియెంటెడ్ లేడీ పడ్డ సంఘర్షణను ఆరోజుల్లోనే చాలా చక్కగా చూపించారు గుల్జార్. తానెక్కడా ఆమెను తప్పుపట్టలేదు. పరిస్థితులను యథాతథంగా మన ముందుంచారు. చివరలో హ్యాట్సాఫ్ అనదగ్గ పరిష్కారాన్నే సూచించారు. స్త్రీవాదాన్ని సపోర్ట్ చేస్తూనే రాజకీయాలపైనా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్‌ని గుల్జార్ తన సినిమాల్లో చాలా ఎఫెక్టివ్‌గా వాడతారు. ఇందులోనూ అదే తరహా నెరేటివ్ నడుస్తుంది. సినిమాలో కొన్ని డైలాగ్స్ కదిలిస్తాయి. అలా అని అవి లెంగ్తీగా ఉండవు. గుల్జార్ కవిత్వంలో ఉన్నట్టు లోతుగా ఉంటాయి. ఓసారి రాఖీ ‘మీరు కవి కాకపోయి ఉంటే చాలా మామూలు మనిషై ఉండేవాళ్ళు’ అని గుల్జార్‌తో అన్నారట. ఈ విషయం గుల్జార్ కూతురు మేఘనా గుల్జార్ ఓ పుస్తకంలో రాసుకుంది. ఇదే మాటను కాస్త మార్చి సినిమాలో సుచిత్రా సేన్ సంజీవ్ కుమార్‌తో అన్నట్లుగా వాడారు. ఇద్దరూ విడిపోయి కలిసినప్పుడు సంజీవ్ కుమార్ ‘అమావాస్య 15 రోజులే ఉంటుంది. కానీ ఈసారి చాలా కాలమే ఉండిపోయింది’ అంటాడు. వెంటనే సుచిత్ర ‘తొమ్మిదేళ్ళు కదా!’ అని అడుగుతుంది. ఇద్దరూ తొమ్మిదేళ్ళ పాటు దూరంగా ఉంటారు మరి!

మాస్టర్ పీసెస్ సినిమాకి ఉదాహరణ!

ఈ సినిమా అంతా ఒక ఎత్తయితే పాటలు మరో ఎత్తు. ఆర్డీ బర్మన్ సంగీతం, గుల్జార్ సాహిత్యం, లతా మంగేష్కర్, కిశోర్ కుమార్ గాత్రం వెరసి మూడు ఆణిముత్యాలు మెరుస్తాయీ సినిమాలో! మూడు పాటలనూ జమ్మూ కాశ్మీర్‌లోనే షూట్ చేశారు. ఇందులో ఫేవరెట్ సాంగ్ ‘Tere bina zindagi se’ అనే. బాలీవుడ్ టాప్10 ఎవర్ గ్రీన్ సాంగ్స్‌లో ఎప్పటికీ నిలిచిపోయిన పాట ఇది. ఈ పాటలో సాహిత్యం, సిచ్యుయేషన్, లొకేషన్ aestheticsకి మంచి ఉదాహరణ. ‘తుమ్ ఆగయే హో’ పాట శ్రీనగర్ లోని పరీ మహల్ గార్డెన్స్‌లో చిత్రీకరించారు. ఇక మూడో పాట ‘Is mode se jaate hain!’ లిరిక్స్ పరంగా చాలా గొప్పగా అనిపించే పాట ఇది. అందరికీ జీవితం ఒకటే. కానీ అది నడిచే దారులు- అంటే అది ఎదుర్కొనే కష్టనష్టాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని ఈ పాట సారాంశం. దీన్ని డ్యూయెట్‌గా వాడటం ఆయనకే చెల్లింది. ఈ పాటను పహల్గామ్ లోని ఎత్తైన పచ్చిక మైదానాల్లో షూట్ చేశారు. అక్కడి నుంచి చూస్తుంటే మిగతా ప్రపంచాన్ని చేరుకోవడానికి చాలా దారులే కనిపిస్తుంటాయి. గుల్జార్ కవిత్వం చదివితే మనసెంత భావోద్వేగంతో నిండిపోతుందో ఆయన సినిమాలు చూసినా అంతే! అలాంటి మాస్టర్ పీసెస్‌కి మంచి ఉదాహరణే ‘ఆంధీ’!

సినిమా కోసం క్లిక్ చేయండి

శాంతి ఇషాన్

సీనియర్ జర్నలిస్ట్, రైటర్

[email protected]

Advertisement

Next Story

Most Viewed