అందని పుస్తకాలు.. ఆగిన చదువు!

by Ravi |   ( Updated:2023-07-06 23:16:04.0  )
అందని పుస్తకాలు.. ఆగిన చదువు!
X

ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలను సరఫరా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇది దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్న ప్రక్రియ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు మొదలయ్యేనాటికే జిల్లా కేంద్రాలతో పాటు, మండల కేంద్రాలకు చేరుకునేవి పాఠశాలలు మొదలైన ఒకటి రెండు రోజుల్లో ఆ పుస్తకాలను ప్రధానోపాధ్యాయులు సేకరించుకొని పాఠాలను మొదలుపెట్టే పద్ధతి కొనసాగేది. కానీ ఇటీవలి కాలంలో జిల్లా కేంద్రం నుండి పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు పుస్తకాలను తీసుకుని రావలసినటువంటి పద్ధతులను జిల్లా శాఖ కొనసాగించడంతో ఆ ఆర్థిక భారం ప్రధానోపాధ్యాయులపై పడుతుంది. పైగా గత సంవత్సరం ప్రధానోపాధ్యాయులు పుస్తకాలు చేరవేయడానికి చేసిన ఖర్చును ఇప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేదనే ఆరోపణ. అందుకే జిల్లా కేంద్రంలోని పుస్తకాలు పంపిణీ కాకుండా నిల్వ ఉండడానికి కారణం అవుతున్నట్లు తెలుస్తున్నది. విద్యా ఒక సేవా దృక్పథంతో కూడిన ప్రభుత్వ సామాజిక బాధ్యత. ఇది వ్యాపారం కాదు. కానీ ప్రతి అంశాన్ని కూడా వ్యాపార ధోరణిలో చూస్తున్నటువంటి ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వలన విద్యా, వైద్యం వంటి అన్ని కీలకమైన అంశాలలో విఫలం కాక తప్పడం లేదు.

పుస్తకాల ఆలస్యం వెనక కారణం?

రాష్ట్రంలో మొత్తంలో సుమారు 62 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే, ప్రభుత్వ పాఠశాలల్లో 28,77,675 మంది విద్యార్థులు మాత్రమే విద్యను అభ్యసిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ విద్యార్థులకు సంబంధించిన 1,57,48,270 పుస్తకాలు అందించవలసి ఉండగా ఇప్పటివరకు ఒక కోటి 35 లక్షల 85 వేల 185 పుస్తకాలు ముద్రణ పూర్తయి జిల్లా కేంద్రాలకు చేరుకున్నట్లు తెలుస్తున్నది. ఆ పుస్తకాలు అత్యవసరంగా పాఠశాలకు చేరాల్సి ఉండగా ఇంకను చేర్చలేదు. పైగా ఇంకా 14 శాతం పుస్తకాలను ముద్రించలేదు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఆలస్యం అవుతోంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు మాత్రం తమ సిలబస్ మేరకు పాఠాలు ఎప్పుడో ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు ఇంకా ప్రారంభించకపోవడంపై, ఉపాధ్యాయులను పిల్లల తల్లిదండ్రులు నిలదీస్తే, పుస్తకాలు రాలేదు అని చెప్పడం మినహా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ వైఫల్యానికి కారణం ప్రభుత్వం కాదా? ఇదీ ప్రతి సంవత్సరం కొనసాగే ప్రక్రియ కనుక వేసవి సెలవుల్లోనే పాఠశాలలకు చేరేలా చూసినప్పుడు మాత్రమే ఇలాంటి అవరోధాలను అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితులు కొన్ని తారసపడినప్పటికీ అనేక సందర్భాల్లో సెలవుల్లోనే మండల కేంద్రాలకు చేరిన సందర్భాలు అనుభవంలో ఉన్నవి. పుస్తకాల పంపిణీలో ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకి చిత్తశుద్ధి ఉండి తమ పనులు సకాలంలో పూర్తి చేసినప్పుడు ఈ విమర్శలు వచ్చే ఆస్కారం ఉండదు కదా!

పుస్తకాలను వృధా చేయకుండా..

కొన్ని పాఠశాలలకు పుస్తకాలు కాస్తా ఆలస్యంగా చేరినా, ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు రానివి 15వేల పాఠశాలలు ఉన్నట్టు తెలుస్తుంది. జూలై నెల ప్రారంభమై వారం రోజులు గడుస్తున్న పాఠాలు మొదలు కాకపోవడం పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26 వేల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రతి ఏటా పుస్తకాలను ఉచితంగా అందించడం అనే అంశం పైన కూడా పునఃశ్చరణ చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఆయా పాఠశాలలకు పంపిణీ చేసినటువంటి పుస్తకాలను కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి ముద్రించడం ద్వారా విద్యార్థుల అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బందితో చర్చించడం ద్వారా వృధా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో తొలి దశలో ప్రభుత్వము పంపిణీ చేసినటువంటి పుస్తకాలను భద్రంగా దాచి రెండవ బ్యాచ్ వాళ్లకు ఇచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఆ రకంగా పాఠశాల స్థాయిలో పుస్తకాలను భద్రపరచి రాబోయే సంవత్సరానికి ఇవ్వడం ద్వారా కూడా ప్రభుత్వం పైన వృధా భారాన్ని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా పుస్తకాల పంపిణీ అనేది సకాలంలో పాఠశాలలకు చేరవేయవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పైనే ఉంటుంది. కానీ బాధ్యతను విస్మరించి ప్రధానోపాధ్యాయుల‌పైన ఆలస్యం నెట్టడం భావ్యం కాదు. అది పూర్తిగా బాధ్యత రాహిత్యమే అవుతుంది.

వడ్డేపల్లి మల్లేశం

90142 06412

Advertisement

Next Story

Most Viewed