ఉద్యోగులను రోజు కూలీలుగా మార్చి..

by Ravi |   ( Updated:2024-02-25 01:15:18.0  )
ఉద్యోగులను రోజు కూలీలుగా మార్చి..
X

ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల సాధన కోసం ప్రాతినిధ్యాలు చేయడం, చర్చలు జరపడం, సానుకూల ఫలితాలు రాబట్టడం గతం. హక్కుల కోసం పోరాడడం, ప్రభుత్వాలు ఎంతో కొంత దిగిరావడం సగటు వేతన జీవులకు కనీస సంతృప్తి దక్కేది కూడా గతమే! అది సంఘాల నేతల కార్యశీలతకు అద్దం పట్టేది. అటు ప్రభుత్వం, ఇటు సంఘ నేతలు హుందాతనం పాటించేవారు.

గతంలో ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల పాటించవలసిన సహజ రాజధర్మానికి కట్టుబడేవి. ప్రభుత్వ నిర్వాహకులు ముందుచూపుతో, పట్టువిడుపులతో వ్యవహరించేవారు. ఉద్యోగులను రోజువారీ కూలీలుగా మార్చిన ప్రస్తుత ఏపీ పాలకులకు గత ఏడు దశాబ్దాల పాలకులకు ఎంతో వ్యత్యాసం వుంది. పోల్చుకోవడం కూడా సమంజసం కాదు కూడా!

చిరునవ్వు లేని ఉద్యోగ నేతలు

ఉద్యోగుల డిమాండ్లను సాధ్యమైనంత వరకు వ్యవస్థీకృత లోపాలుగానూ, మానవీయ కోణంలోనూ చూడగలిగితే ప్రతిష్టంభనకు ఎక్కడా తావుండదు. సమస్యలను తమ ముందుంచిన ప్రతిసారీ మొండిచేయి చూపడం, గట్టిగా స్పందించిన సందర్భాల్లో ప్రతిష్టకు పోయి అణిచివేతకు మార్గాలు వెతకడం ప్రస్తుత ఏపీ పాలకుల విధానం కావడంతో చర్చలకు అర్థం మారిపోయింది. ప్రభుత్వాన్ని మెప్పించడం ద్వారా కొంత, బెదిరించడం ద్వారా మరికొంత సంఘాల నాయకులు అప్పట్లో తమ ఆధిపత్యానికి భంగం కలగకుండా నర్మగర్భంగా వుండేవారు. అందువల్లే సంఘాల పట్ల తమ సభ్యులకు విశ్వాసం ఎప్పుడూ సన్నగిల్లేది కాదు. ఎంతో కాలంగా వస్తున్న ఒరవడి.

ఒక సమస్యను తీర్చలేమని చెప్పడానికి ప్రభుత్వానికి సహేతుక కారణాలుండాలి. అవి రాజ్యాంగ పరిధిలో ఉండాలి. చర్చలకు వెళ్లి తిరిగొచ్చే నాయకుల ముఖాల్లో చిరునవ్వు ఉండాలి, సగర్వంగా తలెత్తుకొని జిల్లాలు తిరిగే పరిస్థితి ఉండాలి. కానీ అపరాధ భావనతో తమ వారి ముందు తలదించుకునే పరిస్థితి ఉండకూడదు. ఒకప్పుడు సంఘ అగ్రనేతలపై ఒక్క మాట పడేది కాదు. ఒక్క విమర్శ చేసే అవకాశం ఉండేది కాదు. కాలం తెచ్చిన మార్పుల్లో వారు అభద్రతాభావానికి గురికావలసి వచ్చింది. తమను ఈసడించుకున్న ప్రభుత్వానికే రక్షణ కోసం సాగిల పడాల్సి వస్తున్నది. ఇదొక ఆత్మహత్యా సదృశం.

సంఘాల నేతల అసమర్థత

కానీ ఇపుడు ఆ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇపుడు ఉద్యమం అంటే 'మనుగడ కోసం పోరాటం' అయింది. ప్రభుత్వ దుబారా ఆర్థిక విధానాలు రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణకు ఉరితాడు బిగించాయి. కొరగాని హామీలు, జీడీపీని పెంచలేని నిరర్ధక పందేరాలు (సంక్షేమ పథకాలు), సంపదను సృష్టించలేని దిగజారుడు విధానాలు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టింది. ప్రస్తుతం 'రిజర్వు బ్యాంకు - మంగళవారం' ఫార్ములాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెట్టుకొస్తోంది. దీంతో.. ఈ ప్రభుత్వానికి, సంఘ నాయకులకు మధ్య ఉండాల్సిన పలచని గీత చెరిగిపోయింది. అదే స్థాయిలో ఉద్యోగుల కలలు చెదిరిపోయాయి. ఈ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఏమీ చేయదనే సత్యం ఎన్నో అనుభవాల ద్వారా నిరూపితమైంది. దీనికి కారణం సంఘాల నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడమే! ఫలితంగా ప్రభుత్వం మొండిగా తన స్టాండ్ మీద నిలబడడం లేదు. గత ఐదేళ్లుగా నిత్యం టచ్‌లో వున్న సంఘాల నేతల శైలిని ఎక్స్ రే చేసిన ప్రభుత్వం తదనుగుణంగా అంతే స్థాయిలో తన విధానాలను అమలు చేయడంలో అనిశ్చితిని కొనసాగించింది. దరిమిలా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను ఆర్థికంగా చిదిమేసింది.

చర్చలను బహిష్కరించి ఉంటే...!

ప్రభుత్వ వైఖరి బహిర్గతమయ్యాక మూకుమ్మడిగా బహిష్కరించి వుంటే హుందాగా ఉండేది. నాయకుల వైఖరిని ఉద్యోగులు హర్షించేవారు. సంఘాల పట్ల సడలుతున్న నమ్మకం పునఃస్థాపితమై మలిదశ ఉద్యమానికి వాస్తవ బలం చేకూరి ఉండేది. ప్రభుత్వానికి ఉద్యోగుల ఐక్యతపై సంకేతాలు వెళ్ళే అవకాశం ఉండేది. పోరాడడానికి, బలప్రదర్శనకు, ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు, గత ఐదేళ్లలో పోగొట్టుకున్న ఉద్యమ బలాన్ని పోగు చేసుకునేందుకు అందివచ్చిన అవకాశం పోయింది. తెగే దాకా దేన్నీ లాగకూడదు. అది వాస్తవం. కానీ ప్రభుత్వ - సంఘాల నాన్చుడు ధోరణి భవిష్యత్తు ఉద్యమాల భవిష్యత్తును అగమ్యగోచర స్థితికి నెట్టకూడదు. ఉద్యమ శంఖం పురించాలంటే సైన్యం సిద్ధంగా వుండాలి.

మేల్కొనకపోతే భారీ మూల్యం చెల్లించాలి

అపార సైన్య సంపత్తి, చెక్కు చెదరని ఐక్యత, చెరగని పోరాట పటిమ, ద్విగుణీకృత ఉత్సాహం, సుదీర్ఘ పోరాట చరిత్ర, ఎన్నో విజయాలు సాధించుకున్న అనుభవాల చరిత్రను మరుగున పడేసి రాటుదేలిన ప్రభుత్వంతో సున్నిత చర్చల్లోకి వెళ్తే ఫలితాలు మరోలా ఉండకపోవచ్చు. మైండ్ గేమ్‌తో సంఘాల పట్ల విశ్వసనీయతను దెబ్బతీయడంలో ప్రభుత్వం ఎట్టకేలకు సఫలకృతమైంది. ఆ మేరకు పరిణితి చెందాల్సిన అవసరం వుంది. గత పీఆర్సీ వల్ల కోలుకోలేని నష్టానికి గురైన ఉద్యోగ వర్గం తగిన స్థాయిలో పరిపక్వత చెందకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సివుంటుంది.

- మోహన్ దాస్,

ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు.

(ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 1938)

94908 09909

Advertisement

Next Story

Most Viewed