ప్రభుత్వ ఉద్యోగులు..దేశభక్తితో ఉండొద్దా?

by Ravi |   ( Updated:2024-07-28 01:01:05.0  )
ప్రభుత్వ ఉద్యోగులు..దేశభక్తితో ఉండొద్దా?
X

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించే దేశభక్తి కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ పాల్గొనకూడదని 1966లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన నిషేధాన్ని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం దేశంలో పెద్ద చర్చ నీయాంశంగా మారింది. ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చిర్రుబుర్రులాడింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగులలో విభజన ఏర్పడుతుందని వాపోతోంది.

వాస్తవంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక దేశభక్తి సంస్థ. ఆ సంస్థ సేవా తత్పరత, నిష్కళంక దేశభక్తి, సమర్పణ భావన అసమాన్యమైనవని ప్రపంచంలోని రాజకీయ విశ్లేషకులు అందరూ వ్యాఖ్యానిస్తుంటారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమా దాలు సంభవించినప్పుడు ఆ సంస్థ సేవా కార్యకలాపాలను దగ్గరుండి చూసిన వారికి మాత్రమే ఆ సంస్థ కార్య పద్ధతి, ఆ సంస్థ ధ్యేయం గోచరమవుతుంది. ఆ సంస్థను నిరంతరం దూషించే వారూ, ద్వేషించే వారూ ఆ సంస్థ లాగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే మరో జన్మ ఎత్తవలసిందే!

ఎటువంటి ప్రచారం లేకుండా..

దేశ భద్రత, సమగ్రతల విషయంలో, ఆచరణాత్మకమైన సామాజిక మార్పు విషయంలో ఆ సంస్థ ఆలోచనా పద్ధతి నిర్దిష్టమైనది. దేశంలోని నిమ్న వర్గ ప్రజల మనోవ్యధను, అవమానాలను ఆ సంస్థ కార్యకర్తలు సరైన కోణంలో అర్థం చేసుకుంటారు. నిమ్న వర్గ కుటుంబాల సభ్యులతో కలిసి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రత్యేక శైలి. వనవాసీలలో చైతన్యం నింపి, నిజమైన భారతీయతకు వారసులుగా నిలపడంలో ఆ సంస్థ పరివారంలోని వనవాసీ కళ్యాణ పరిషత్ చేసే కృషి అనన్య సామాన్యమైనది. ఈ పనిని అంతా ఎటువంటి ప్రచారం లేకుండా చేయడమే ఆ సంస్థ విశిష్టత.

సంఘ్ చేసిన నిస్వార్థ సేవలు..

1948లో కాశ్మీర్ విలీనీకరణ ఒప్పందంపై నాటి కాశ్మీర్ రాజు రాజా హరి సింగ్ చేత సంతకం పెట్టించడంలో ఆర్ఎస్ఎస్ రెండవ అధ్యక్షులు గురూజీ (గోల్వాల్కర్) పాత్ర అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని ఆ సంస్థ పెద్దలు ఏనాడూ బహిరంగపరచరు. 1965 పాకిస్తాన్ సైన్యం మనపై దాడి చేసి, శ్రీనగర్‌ను ఆక్రమించుకోవాలని చూసినప్పుడు, ఆ సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో మంచు గడ్డలు ఉండడం వల్ల మన యుద్ధ విమానాలు అక్కడ ల్యాండ్ కావడం కష్టమైంది. ఈ విషయం ఆర్ఎస్ఎస్ శ్రీనగర్ కార్యాలయానికి తెలిసిన వెంటనే 610 మంది స్వయం సేవకులు రాత్రి ఒంటిగంటకు పని మొదలుపెట్టి వేకువ జామున 5 గంటలకు శ్రీనగర్లో మన సైన్యం దిగే ఏర్పాటు చేశారు. 1962 చైనా దండయాత్ర సమయంలో ఢిల్లీ మహానగర ట్రాఫిక్ కంట్రోల్‌ను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చూసారనే విషయం దేశంలోని నేటి యువతకు తెలియదు.

ఆర్ఎస్ఎస్‌ను వ్యతిరేకించే జవహర్ లాల్ నెహ్రూ 1963 రిపబ్లిక్ డే ఉత్సవాల పరేడ్‌కు 3000 మంది స్వయం సేవకులను ఆహ్వానించడం ఆర్ఎస్ఎస్‌ను నిరంతరం ద్వేషించే కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్ గాంధీకి తెలియకపోవచ్చు. అలాగే కేరళ రాష్ట్రంలో వరదలు ముంచెత్తిన సమయంలో, హథ్రాస్ తొక్కిసలాటలో, పూరి జగన్నాథ రథయాత్రలో ఇబ్బందులు పడిన భక్తులకు సేవలందించడంలో ఆ సంస్థ కార్యకర్తల తెగువ నిరుపమానం. ఆ సంస్థను నిరంతరం దూషించే రాజకీయ పార్టీలు గానీ, సంస్థలు గానీ దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఆదుకున్న దాఖలాలు లేవు. ఆ సంస్థ ట్రైనింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఏ కార్యకర్తను అడిగినా ఆ సంస్థ కేవలం దేశాన్ని ప్రేమించమని చెబుతుందని, ఈ దేశ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడినప్పుడు నిస్వార్థంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయాలని, ఈ దేశానికి నష్టం కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని బోధిస్తుందనే సమాధానమే మనకు వస్తుంది.

నిషేధం ఎత్తివేసినప్పటికీ..

ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఆ సంస్థ కార్యకలాపాలలో పాల్గొనకూడదని నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం. ఆ సంస్థ దేశాన్ని ప్రేమించమని చెబుతుంది. వ్యక్తి నిజాయితీగా ఉండాలని బోధిస్తుంది. ఈ రెండు లక్షణాలు ప్రభుత్వ ఉద్యోగులకు అత్యవసరం. ఈ రోజు దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది లంచగొండులు, అవినీతిపరులు, బాధ్యతారహితులు ఉన్నారు. వారిలో కొందరైనా ఆర్‌ఎస్‌ఎస్ చేసే కార్యక్రమాల వల్ల మారుతారేమో.. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగుల విషయం లో ఈ నిషేధం ఎత్తివేసినంత మాత్రానా దేశభక్తి కార్యక్రమాలలో ప్రభుత్వ ఉద్యోగులందరూ పాల్గొంటారని గ్యారెంటీ ఏమీ లేదు. ఈ దేశం నాది, ఈ దేశ సంస్కృతికి నేను వారసుడిని అనే భావన అంతర్లీనంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఆ సంస్థ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ఎస్ఎస్ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం ఈ పని చేసిందని కాంగ్రెస్ నాయకులు చేసే వాదన పసలేనిది. దేశభక్తి అనే భావన కాంగ్రెస్ డీఎన్ఏలో లేదు. దేశభక్తి ఏ రూపంలో ఉన్నా కాంగ్రెస్ సహించలేదు. చరిత్ర చెప్పిన సత్యం ఇది.

-ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు.

94417 37877

Advertisement

Next Story

Most Viewed