సర్వీస్ రిజిస్టర్‌పై అవగాహన అవసరం!

by Ravi |   ( Updated:2024-10-29 01:00:28.0  )
సర్వీస్ రిజిస్టర్‌పై అవగాహన అవసరం!
X

ఉద్యోగి సర్వీసు కాలంలో నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగు విభిన్న అంశాల ప్రతిబింబమే సర్వీస్ రిజిస్టర్. అందులో ఉద్యోగులకు సంబంధించిన విభిన్న అంశాలు నమోదయి ఉంటాయి. వాటి ఆధారంగా ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత గాని లేక ఏ కారణం చేతనైనా అకాల మృత్యువాత పడిన సందర్భాలలో ఆ ఉద్యోగికి గాని అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకి గాని రావాల్సిన ఆర్థికపరమైన సౌలభ్యాలు అన్నీ పొందే అవకాశాలుంటాయి. సక్రమమైన పందాలో, సరియైన పద్ధతిలో విభిన్న అంశాలు సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు అయినప్పుడే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, అభ్యంతరాలు లేకుండా సకాలంలో సంబంధిత పెన్షన్ తదితర ఆర్థిక సౌలభ్యాలు అన్నీ పొందే అవకాశం ఉంటుంది. అలా కానిపక్షంలో పెన్షన్ తదితర ఆర్థిక సౌలభ్యాలు పొందు విషయంలో అభ్యంతరాలకు గురై విప రీతమైన జాప్యం జరిగే అవకాశం ఉంది.

సర్వీసు రిజిస్టర్ సంపూర్ణంగా, సహేతుకంగా నిర్వహించబడని సందర్భాలలో పదవి విరమణ చేసి ఏళ్ల తరబడి పింఛను తదితర ఆర్థిక సాలభ్యాలు రాక కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మనోవేదనకు గురై న ఉద్యోగులు కోకొల్లలు. అందుకే సర్వీసు రిజిస్టర్ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ రిజిస్టర్‌లో ఏ అంశాలను పొందుపరచాలి తదితర అంశాల పట్ల డిడిఓలకు ఉద్యోగులకు కనీస అవగాహన అవసరం.

నియామకమైనప్పుడు నమోదు చేయడం..

ప్రభుత్వ పరిధిలో కానీ, స్థానిక సంస్థలలో గానీ ఉద్యోగంలో నియమించబడిన ప్రతి వ్యక్తి విషయంలో సర్వీస్ రిజిస్టర్ నిర్వహించాలి. గెజిటెడ్ నాన్ గెజిటేడ్ అధికారుల విషయంలో కూడా సర్వీస్ రిజిస్టర్ నిర్వహించాలని ప్రభుత్వం జీవో437 తేదీ: 13.10.1976 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఫండమెంటల్ రూల్ -10, జీవో 3 తేదీ:8.1.1969 ననుసరించి ఒక వ్యక్తి మొదటిసారి ఉద్యోగంలో నియామకమైనప్పుడు డాక్టర్‌చే జారీచేయబడిన ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కార్యాలయం రికార్డులలో భద్రపరచడమే కాకుండా అట్టి వివరాలను ఆ ఉద్యోగి సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఫండమెంటల్ రూల్స్ 74కు అనుబంధం -2లో నిర్దేశించిన ఫారం -10లో తెలియజేసిన పద్ధతిలో సర్వీస్ రిజిస్టర్ నిర్వహించవలసి ఉంటుంది. జీవో 200 ప్రకారం, డిసెంబర్ 10,1999 తేదీన గానీ అటు తర్వాత గాని ఉద్యోగంలో చేరిన వ్యక్తులు సవరించబడిన ఫారంలో సర్వీస్ రిజిస్టర్ నిర్వహించవలసి ఉన్నది. ఫండమెంటల్ రూల్స్ 74లోని సబ్ రూల్ -2 ప్రకారం ఒక కార్యాలయంలో పనిచేయు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రిజిస్టర్లు ఆ కార్యాలయపు అధికారి ఆధీనంలో ఉండాలి. మొదటిపేజీ నందు ఉద్యోగి పూర్తి పేరు, తండ్రి పేరు, నివాస స్థలం, జాతీయత, పాస్‌పోర్ట్ ఫోటో అంటించి సంబంధిత అధికారిచే అటేస్టేషన్ చేయించాలి. జీవో165 F&P తేది:21-4-1984 ప్రకారం ఒకసారి సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేసిన పుట్టిన తేదీ మార్చుటకు వీలులేదు.

నమోదు చేయు పద్ధతి..

జీవో.80 తేది:19-3-2008 ననుసరించి మొదటపేజీ నందు ఉద్యోగి ట్రెజరీ ID నెంబర్ నమోదు చేయాలి. ఉద్యోగి వైవాహిక వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదుచేయాలి. సర్వీసు రిజిస్టరు 2, 3వ పేజీలలో ఉద్యోగి వివరాలతో పాటు ఎత్తు, విద్యార్హతలు, సర్వీసులో చేరిన తర్వాత సంపాదించిన విద్యార్హతలు నమోదు చేయాలి. పదోన్నతి, ప్రమోషన్, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీం, పే ఫిక్సేషన్ తదితర వివరాలు నమోదుచేయాలి. ప్రతి ఉద్యోగి తన హోమ్ టౌన్ (LTC కొరకు) డిక్లేరేషన్ ఇవ్వాలి. అలాంటి వివరాలను కార్యాలయాధిపతి సర్వీసు రిజిస్టర్‌లో నమోదుచేయాలి. సీసీఏ రూల్స్-1991, ప్రభుత్వ మెమో నం. 51073 తేది:19-12-2002 ప్రకారం ఉద్యోగి ఏ విధమైన శిక్షలకు గురైనా అట్టి పూర్తి వివరములను సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఉద్యోగి గుణగణాలు, శీలము గురించి సర్వీసు రిజిస్టర్‌లో నమోదు చేయకూడదు. ప్రతి ఉద్యోగి తన కుటుంబ సభ్యుల సంపూర్ణ వివరములు అనగా కుటుంబ సభ్యుల పేర్లు పుట్టిన తేదీ, బంధుత్వం, ఉద్యోగియా, నిరుద్యోగియా? అను విషయాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఉద్యోగి కేటాయించబడిన TSGLI, GPF, PRAN, గ్రూప్ ఇన్స్యూరెన్స్ వివరాలు, నామిని కాంట్రిబ్యూషన్ వివరా లు తప్పకుండా నమోదు చేయాలి. ప్రొబేషన్ వివరాలు, ఏ కారణం చేతనైన ప్రొబేషన్ పొడిగించినచో అట్టి వివరాలను కారణాలతో సహా నమోదు చేయాలి.

డూప్లికేట్ రిజిస్టర్‌కి అవకాశం..

ఉద్యోగి ఏ కారణం చేతనైనా సస్పెండ్ అయినప్పుడు అట్టి వివరములు అలాగే ఫండమెంటల్ రూల్-53 ప్రకారం సదరు ఉద్యోగి పొందిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ వివరాలు, తిరిగి ఉద్యోగంలో చేరిన వివరాలను నమోదు చేయాలి. పదోన్నతి పొందిన వివరాలు, ఒకవేళ ఉద్యోగి పదోన్నతి నిరాకరించిన అట్టి వివరాలు, రివర్షన్ వివరాలు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌ మెంట్ వివరాలు, పే ఫిక్సేషన్ వివరాలు, శాఖాపరమైన పరీక్షా ఉత్తీర్ణత వివరాలను సర్వీసు పుస్తకంలో నమోదు చేయాలి. జీవో 391 తేదీ 7.11.1977 ప్రకారం ఉద్యోగిని సర్వీసు నుండి తొలగించినపుడు అట్టి ఉద్యోగి సర్వీసు రిజిస్టరును ఐదు సంవత్సరాల వరకు గాని లేక ఉద్యోగి చనిపోయేంతవరకు ఏది ముందైతే అంతవరకు ఉద్యోగి పనిచేసిన కార్యాలయంలో భద్రపరచాలి. అటు తర్వాత దానిని విలుప్తం చేయవచ్చు. జీవో 152 తేదీ: 20.5.1969 ప్రకారం ప్రతి సంవత్సరం ఉద్యోగికి సంబంధించి సర్వీసు రిజిస్టరులో పొందుపరచిన అంశాలను పరిశీలించుటకు డిడిఓలు సదరు ఉద్యోగికి అవకాశం ఇవ్వాలి. జీవో 216 తేదీ:22.6.1964 ప్రకారం ముందు జాగ్రత్తగా డూప్లికేటు సర్వీసు రిజిస్టర్‌ను నిర్వహించుకొను అవకాశం ప్రభుత్వం పై ఉత్తర్వుల ద్వారా కల్పించింది. సర్వీసు రిజిస్టరు‌లోని అంశాలు పెన్సిల్‌తో నమోదు చేయరాదు.

ఈ రికార్డు కాలిపోతే..

జీవో.202 తేదీ: 11.6.1980 ప్రకారం ఉద్యోగ జీవి తంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న విషయం సర్వీస్ రిజిస్టర్. ఏ కారణం చేతనైన పోగొట్టుకున్నా, కనిపించకుండా పోయినా లేక అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోయినా అట్టి సర్వీసు రిజిస్టర్‌ను మరల ఎలా పునర్నిర్మాణం చేయాలో పై ఉత్తర్వులు స్పష్టంగా సూచిస్తున్నాయి. డూప్లి కేట్ సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేసిన విషయాలు ఎంతవరకు నిజం అను విషయాన్ని సంబంధిత రికార్డ్స్‌తోనూ, పే బిల్స్, వేతన స్థీరీకరణ పత్రములు, పదోన్నతికి సంబంధించిన సూచికలు, ఉద్యోగితో పాటు సహచర ఉద్యోగుల విషయంలో జారీ చేసిన సామూహిక ఉత్తర్వులు, శాఖాధిపతి జారీ చేసిన ఉత్తర్వులు తదితర అంశాలపై అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సర్వీస్ రిజిస్టర్‌ను పునర్నిర్మాణం చేయవచ్చును.

సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS,

9000674747

Advertisement

Next Story

Most Viewed