- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త ప్రభుత్వానికి.. సమయమీయండి!
పత్రికలు కావచ్చు, చానెళ్లు కావచ్చు, వ్యక్తిగత యూట్యూబర్లు కావచ్చు, ప్రజలకు కావాల్సింది ఏమిటి.. జరుగుతున్నది ఏమిటన్నది నిష్పక్షపాతంగా వెల్లడించాలి. కానీ మీడియా మాధ్యమాలు నేడు చేస్తున్నది ఏమిటి? మీడియా వాస్తవాలను చూపుతుందా? వారు చెప్పేవి వాస్తవ సమస్యలేనా? పాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నారా? అంటే లేదనే చెప్పొచ్చు!
అవాస్తవాలను, నిందలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో మీడియా కీలక భూమిక పోషిస్తుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి జిమ్మిక్కులను ఎదుటి పక్షాన్ని జనంలో పలచన చేయడానికి రాజకీయ పార్టీలు ఎంతగానో ఉపయోగించుకున్నా.. తెలంగాణ ఓటర్లు అవేమీ పట్టించుకోకుండా తమ విస్పష్ట తీర్పు ద్వారా మార్పును కోరుకుంటున్నామని కుండ బద్దలు కొట్టి మరీ కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు.. కేవలం రాజకీయ పార్టీల అసత్య ప్రచారాలకు సామాజిక మాధ్యమాలు వేదికగా మారాయనేది నిజం..
సుభిక్షంగా ఉంటే ఈ అర్జీలేంటి?
తెలంగాణ రాష్ట్రంలో మీడియా పరిస్థితి మరీ దారుణం.. అధికారానికి వచ్చి నెల రోజులు పూర్తి కాలేదు.. అప్పుడే కొత్త ప్రభుత్వంపై అసత్య ప్రచారం ప్రారంభం కావడం శోచనీయం.. మీడియా పరిస్థితి ఇలా ఉంటే, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మరీ దారుణంగా వ్యవహరిస్తోంది.. ఎన్నో ఆశలలో అధికారం అప్పగిస్తే.. బంగారు తెలంగాణ చేస్తున్నామన్న పేరుతో తెలంగాణలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారు. ఇది మనం అనే మాట కాదు.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ అన్న మాట. ఆయన సారథ్యంలోని కొత్త ప్రభుత్వం శాఖల వారీ సమీక్షలు జరిపి నిజాలను బయటకు తీస్తే, కేసీఆర్ గత పదేండ్లలో తెలంగాణ అభివృద్దిని పాతాళానికి తొక్కేశారని తేట తెల్లమవుతోంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్రకారం, రాష్ట్రంలో ఏ ఒక్క మంత్రిత్వ శాఖ కూడా సరైన మార్గంలో ప్రయాణం సాగించలేదని, ప్రజలకు మంచి చేసిన నిర్ణయాలను కనిపించడం లేదని, పాలకుల విలాసవంతమైన జీవనం కోసం వందల కోట్లు ఖర్చు చేసిన లెక్కలే తప్ప గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలోని ఏ ఒక్క వర్గం బాగుపడిన దాఖలాలు లేవనీ, గత ప్రభుత్వం అన్ని వర్గాలను మాయ చేస్తూ.. అవాస్తవాలతో ప్రజలను మభ్య పెట్టిందన్న వాస్తవం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది.
కేంద్రంతో కయ్యం.. తెలంగాణ ప్రజలకు దూరం.. రాష్ట్రంలోని ప్రతిపక్షాలను విచ్ఛిన్నం చేయడం.. పౌరహక్కులను కాపాడకపోవడం.. ముందస్తు శాంతి భద్రతల పేరుతో ప్రజల గొంతులు మూగపోయే విధంగా నిర్బంధించడం.. ప్రజాస్వామిక వాదులపై అక్రమ కేసులు పెట్టడం ఇలా చెప్పుకుంటూ పోతే.. కేసీఆర్ పాలనలోని అప్రజాస్వామిక చర్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి.. ఇది గత పాలకుల నియంత పాలనకు నిదర్శనం.. కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం పలు సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు వేల సంఖ్యలో నగరానికి చేరుకుని ప్రజా భవన్ ముందు క్యూ కడుతున్న దృశ్యం ఆవేదన కలిగిస్తోంది. రాష్ట్రం సుభిక్షంగా ఉందన్న గత కేసీఆర్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందనడానికి ప్రజల నుంచి కొత్త ప్రభుత్వానికి వెల్లువలా వస్తున్న అర్జీలే నిదర్శనం. గత బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం.. విధ్వంసక పాలన కారణమన్న వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా కొత్తగా కొలువైన ప్రభుత్వంపై అప్పుడే బురద జల్లేందుకు మీడియా సహా ప్రధాన ప్రతిపక్షం వెనుకాడడం లేదు..
బురదజల్లడమే ఎజెండాగా..
కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. ప్రజలను కలవడానికి కూడా ఇష్ట పడలేదు. సమస్యలను పాతరేసే ప్రయత్నం చేశారు. గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేలా ప్రధాన ప్రతిపక్షం గత వారం పది రోజులుగా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే సత్తా ఈ ప్రభుత్వానికి లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ప్రారంభించింది. ప్రజల తీర్పును గౌరవించే కనీస సంస్కారం కరువైంది.. అధికారం నుంచి ఎందుకు ప్రజలు తప్పించారో వాస్తవాలను జీర్ణించుకునే శక్తి గత పాలకులకు కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రజల మన్నన మళ్లీ ఎలా పొందాలన్న కనీస ఆలోచన లేకపోగా, అధికారం దక్కించుకోవాలన్నట్లుగా, కొత్త ప్రభుత్వంపై బురద జల్లడమే ఎజెండాగా వ్యవహరించడం అప్రజాస్వామికం. ఇందుకు మీడియా కూడా వంత పాడేలా వ్యవహరించడం మరింత దారుణం..
దాదాపు పదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచిపోతున్నా.. ప్రజల ముందుకు రాకపోవడం.. తెలంగాణ ప్రజలంటే ఎంత చులకనో తెలుపుతోంది.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సమీక్షలు నిర్వహించి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వివరించేలా శ్వేతపత్రం విడుదల చేసింది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, ఐనా సరే ఎలాగైనా పరిపాలనను గాడిలో పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు విరామం లేకుండా కృషి చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన ఆరు హామీల్లో రెండు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. మిగిలిన హామీల అమలుకు ప్రజా పాలన కార్యక్రమం ఊరూరా నిర్వహిస్తూ అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే, ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకుండానే ఏదో జరిగిపోయినట్లుగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం ప్రారంభించి ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రధాన ప్రతిపక్షం పకడ్బందీ ప్రచారానికి, మీడియా వంత పాడడం శోచనీయం.. ఇది వారి దివాళాకోరు తనానికి నిదర్శనం..
హామీల అమలు.. పాలనపై పట్టు కోసం కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. అప్పటి వరకు వ్యతిరేక ప్రచారం ఎంత సాగించినా ప్రజలు పట్టించుకోరన్న వాస్తవాన్ని గ్రహించాలి. అలా కాకుండా వ్యతిరేక ప్రచారం చేస్తే .. మీడియా సహా వారే ప్రజల్లో పలుచన కావడం ఖాయం..
-కొలను వెంకటేశ్వర రెడ్డి
రిటైర్డ్ ఎస్పీ, జైళ్ల శాఖ
80960 95555