మనదేశ విదేశాంగ విధానంపై స్పష్టత ఇవ్వాలి!

by Ravi |   ( Updated:2023-11-05 00:45:25.0  )
మనదేశ విదేశాంగ విధానంపై స్పష్టత ఇవ్వాలి!
X

పాలస్తీనాపై ఇజ్రాయిల్ దురాక్రమణ దాడులను వెంటనే నిలిపివేసి సైన్యాన్ని యదాస్థానానికి మళ్లించాలని ప్రపంచ దేశాల పౌరులందరూ ప్లకార్డులతో, బ్యానర్లతో, నినాదాలతో ర్యాలీలు చేస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఆపాలని అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే పాలస్తీనాలో మృతుల సంఖ్య 8000 పైచిలుకు చేరింది. లక్షలాది మంది క్షతగాత్రులయ్యారు. స్త్రీలు, వృద్ధులు, పసిబిడ్డలు సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. నిరాయుధులైన అమాయక ప్రజలపై, ప్రజల నివాస గృహాలపై, ఆసుపత్రులపై, స్కూళ్ళపై బాంబు దాడులు, మిసైళ్ళను రాత్రింబవళ్ళు ఎడతెరపి లేకుండా ప్రయోగిస్తున్నారు. మానవత్వం, కనికరం లేకుండా ముక్కుపచ్చలారని పసిపిల్లలపై ఈ అమానుష ప్రతీకార దాడులు చేయటం ఏంటి? యుద్ధానికి కూడా ఒకనీతి, కట్టుబాటు, నియంత్రణలు లేవా? అంతర్జాతీయ యుద్ధ నియమాలు లేవా? యుద్ధ బాధితుల పునరావాసానికి అవకాశం లేదా? రెడ్ క్రాస్ సహాయం, యూ.యన్.ఓ. వైద్య సహకారం ఏ మాత్రం చాలడం లేదు. ప్రజలకు తాగటానికి నీరు, దుస్తులు, ఆహారం, పిల్లలకు పాలు, మందులు, కరెంట్, ఇంటర్ నెట్ మొదలైనవి కనీసంగా లభ్యం కావడం లేదు, సాధారణ పౌరులకు దాడుల నుండి రక్షణ లభించడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా నిరసనలు..

చారిత్రకంగా గాజా చాలా ఇరుకైన ప్రాంతం. అతి తక్కువ విస్తీర్ణం గల భూభాగం. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత గల ప్రదేశం. సుమారు 23 లక్షల మంది సాధారణ పౌరులు గాజా ఓపెన్ జైలులో నిర్భంధించబడి ఉన్నారు. అసహనంతో యువత హమాస్ రూపంలో తలెత్తింది. ఇదివరకు చేసుకున్న అనేక ద్వైపాక్షిక, అంతర్జాతీయ ఒప్పందాలను ఇజ్రాయెల్ ఏకపక్షంగా ఉల్లంఘించి తన సైనిక మదంతో రోజురోజుకు ఇజ్రాయిల్ సరిహద్దులు దాటి పాలస్తీనా భూభాలను ఆక్రమించుకుంటూ పాలస్తీనా ప్రజలను రెండు వైపులా (గాజా, వెస్ట్ బ్యాంక్‌లను) ఒకమూలకు నెట్టివేసింది. హమాస్ యువకులు ఉగ్రవాదులు అని ముద్ర వేసింది. 'హమాస్' ప్రజలు నిజానికి ఉగ్రవాదులు కారు. వారు పాలస్తీనా దేశ భక్తులు. ఇజ్రాయెల్ సామ్రాజ్య విస్తరణ కాంక్షను, నిర్బంధాలను సహనంతో దశాబ్దాలుగా భరిస్తున్నారు.

వెస్ట్రన్ మీడియా 'హమాస్' యువకులను, యాసర్ అరాఫత్‌ను ఉగ్రవాదులుగా చిత్రించింది. ప్రపంచంపై వెస్ట్రన్ మీడియా ప్రభావం చెప్పనలవి కాదు. అదొక మీడియా మాఫియా. పదేపదే అసత్యాలను ప్రసారం చేస్తూ, కఠిన నిజాలను మరుగు చేస్తుంది. నిజమైన చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తోంది. ఈ దుర్మార్గపు చర్యలను మానవతా వాదులు,ప్రజాస్వామిక వాదులు తప్పక ఖండించాలి. ఈ దాడుల్లో వేలాది మంది తమ ప్రాణాలు కోల్పోవడం ప్రపంచాన్ని కలచివేస్తుంది. దీంతో పాలస్తీనాకు యావత్ ప్రపంచం అండగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయిల్ ఉత్పత్తులను 'బాయ్‌కాట్' చేయాలని ప్లకార్డులతో ప్రదర్శన చేస్తున్నారు. పాలిస్తీనా పిల్లల హత్యలకు వనరులను సమకూర్చవద్దని నినాదాలు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రపంచ దేశాల అధినేతలు సైతం పాలస్తీనాను విముక్తి చేయాలని కోరుతున్నారు.

శాంతి కాముక దేశంగా ఉండి..

మనదేశం ప్రజాస్వామిక దేశంగా చెప్పుకుంటున్నా...అలీన దేశాలకు నాయకత్వం వహించిన దేశంగా పేరుపొందినా...శాంతి కాముక దేశంగా ప్రసిద్ధి గాంచినా...నెహ్రూ కాలం నుండి వాజ్ పాయ్ వరకు పాలస్తీనా విమోచనకు, వారి స్వాత్రంత్య పోరాటానికి మన దేశం మద్దతు పలికింది. అయితే ఇటీవల ఇజ్రాయిల్- హమాస్ యుద్ధాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని పిలుపునిస్తూ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ గత నెల 28వ తేదీన ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. వ్యతిరేకంగా 14 దేశాలు మాత్రమే ఓటు వేశాయి. మన దేశంతో సహా 45 దేశాలు మాత్రం ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఇజ్రాయిల్ సైనిక దురాక్రమణ చర్యలను మొదటి నుండి మన దేశం ఖండించింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్, అమెరికా, యూరప్ దేశాలతో వర్తక, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా తన విదేశాంగ విధానాన్ని సంపూర్ణంగా మార్చివేసిందా? మన దేశ పూర్వ ఆశయాలకు, లక్షాలకు, ఆదర్శాలకు తిలోదకాలు ఇచ్చిందా? అమెరికా, యూరప్ దేశాల నాటో కూటమి పంచన చేరిందా?

అయితే, ఐక్యరాజ్యసమితిలో భారత వైఖరిని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, మానవతావాదులు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఎందుకంటే నాటోలోని సభ్యదేశాలు కొన్ని, జీ-20 దేశాలలో కొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న విచక్షణా రహిత దాడులను ఖండించాయి. కానీ భారతదేశం యుద్ధానికి వ్యతిరేకం అంటూనే ఈ ఓటింగ్‌కు గైర్హజరవ్వడం ఏంటి? ఈ విషయంలో మన దేశ విదేశాంగ విధానంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసి భారత ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

డా. కోలాహలం రామ్‌కిశోర్

98493 28496

Advertisement

Next Story