- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్దర్ సాహిత్య ప్రస్థానం..
గద్దర్ పాట వేసే ప్రభావం చెప్పడానికి వేలాది, లక్షలాది మంది విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు విప్లవంలోకి ప్రవహించటమే సాక్ష్యం. ఆయన పాటతో స్ఫూర్తి పొందని ఉద్యమకారులు ఉండకపోవచ్చు. కొంత కాలంగా గద్దర్, గూడ అంజయ్య, మాష్టార్జీ, శివసాగర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, జయరాజు, మిట్టపల్లి సురేందర్, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ తదితరుల పాటలను, సాహిత్యాన్ని పత్రికలు ప్రచురిస్తూ విశ్లేషిస్తున్నాయి. అందుకు జననాట్యమండలి, విరసం చేసిన కృషి, వేసిన ప్రభావం, సాగించిన ప్రస్థానం ప్రధాన కారణం. తత్ఫలితంగా నేటి యువతరం పాట కవులకు దారి పడింది. అందుకు ఐదు దశాబ్దాల కృషి పునాదిగా పనిచేసింది. అయినప్పటికీ దళిత వచన కవిత్వం అచ్చు వేసిన కొందరు చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట అనే పేరుతో ఒక్క పాట కూడా లేకుండా కేవలం వచన కవిత్వంతో పుస్తకాలు వెలువరించి పాట ప్రాధాన్యతను గుర్తించినప్పటికీ, పాట ప్రతిష్ఠను దోచుకొని పాటను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడే ఇలా ఉంటే, 1970ల నాటి పరిస్థితి చెప్పనక్కరలేదు.
పాట విత్తనంగా చేసి..
గద్దర్ సాహిత్యాన్ని పత్రికలు పెద్దగా ప్రోత్సహించలేదు. విప్లవ సాహిత్య పత్రికలు కూడా నిరాదరణకు గురి చేశాయి. గద్దర్ గురించి 1972-73ల్లో వెలువడిన పిలుపు పత్రికలో కొండపల్లి సీతారామయ్య వ్యాసం రాసి ఆపుర రిక్షోడో... అనే పాటను ప్రచురించారు. కొండపల్లి సీతారామయ్య ఆ వ్యాసంలో నక్సలైట్ ఉద్యమ భావజాలాన్ని పాట అనే విత్తనంగా చేసి ప్రజలు అనే పొలంలో నాటిన విప్లవ సాంస్కృతిక కార్యకర్త గద్దర్ అని ప్రశంసించారు. ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూతో కలిసి చాయ్ తాగేవాడని ప్రసిద్ధిపొందిన జర్నలిస్టు జి.కృష్ణ ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికల్లో గద్దర్ గురించి వ్యాసం రాశారు. దినపత్రికలో వచ్చిన మొదటి వ్యాసం ఇదే.
విప్లవ అవగాహన కార్యక్రమాల పరిణామాలను అనుసరించి గద్దర్ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సాగాయి. పాటలు, కళారూపాలు ఆయా సామాజిక ఉద్యమాల పరిణామాలననుసరించి రూపుదిద్దుకున్నాయి. అందువలన వాటిని దశల వారీగా, వస్తువు వారిగా సమస్యల వారీగా బాణీల వారీగా, ఆయా కార్యక్షేత్రాల వారీగా, ప్రాచుర్యం వారీగా, శిల్ప ప్రాధాన్యత వారిగా ఇలా అనేక రకాలుగా వర్గీకరించవచ్చు. దానికి ముందు సామాజిక పరిణామాల, విప్లవ పరిణామాల దశలను అనుసరించి ఇలా వర్గీకరించడం అవసరం.
దళితవాదం నుంచి మార్స్కిజం
గద్దర్ ప్రారంభ దశలో అంబేద్కరిజం తాలూకు దళిత దృక్పథంతో ఉండడం సహజం. విప్లవోద్యమంలో దళితుల గురించి రాసినప్పుడు దళిత దృక్పథంతోనే జీవితాన్ని చిత్రించాడు. పరిష్కారాలకు విప్లవం అవసరమని సూచించాడు. అయితే కులాన్ని సూచించే పదాలు తొలగించాలని ఆనాటి దృక్పథంతో ఉద్యమకారులు కోరారు. అలా క్రమక్రమంగా గద్దర్ లోని అంబేద్కరిజం, దళిత వాదం, దళిత దృక్పధం సెన్సార్ చేయబడుతూ మార్స్కిజంలోకి పరివర్తన చెందించడం జరిగింది. ఉదాహరణకి...
‘’యాలరో ఈ మాదిగ బతుకు, ఎంత మొత్తుకున్నా దొరకదిరా మెతుకు.... అనే పాట రాసినప్పుడు ఎం.ఎల్ గ్రూపులలో చాలామంది నా మీద పెద్దెత్తున అటాక్ చేశారు- పేదోలు, కూలోల్లనాల్నేగానీ. కులాల మీద రాస్తవా అని. ఆబ్జెక్టివ్ రియాలిటీగదా కులమంటే అని జవాబు చెప్పాను'' అని అన్నారు గద్దర్, ఇలా వర్గ దృక్పథానికి మారుతున్న కాలంలో కులం పేరు వదిలేసి వృత్తిని, వర్గాన్ని సంబోధిస్తూ పాటలు రాశాడు. గద్దర్ ఉదాహరణకి... పోదామురో జనసేవలోన గలిసి / ఓయన్న జీతగాడ మాయన్న జీతగాడ / పూట గంజి లేనివాడ కదిలిరారో కూలిదండులో గలువ..
1971లో రాసిన ఈ పాట నాటికి జనసేన లేదు. సైన్యంలేదు. అయినా కొండపల్లి సీతారామయ్య ఈ పాట పాడాల్సిందేనని కోరారు. అలా జనసైన్యం యొక్క ఆవశ్యకతను ముందు పాట ద్వారా ప్రజల మనసుల్లోకి ఎక్కించారు. రెక్కబొక్క నొయ్యకుండ సుక్కసెమట వడవకుండ / బొర్రబాగ పెంచినవ్ దొరోడో నీ పెయ్యంతా మంత్రిస్తం దొరోడో/ ఏం బతుకులు మనయిరో అన్నల్లారా చెల్లెళ్లారా/ నిలపరా బండోడా బండెంట నేనొస్త, ఆపుర రిక్షోడో రిక్షెంట నేనొస్త...
పాట వెంబడి ఉద్యమం..
1972లో ప్రగతిశీల విద్యార్థి సంఘం ఏర్పడింది. ఆ విద్యార్థి సంఘం తర్వాత 1974 అక్టోబరులో పీడీఎస్‌యూగా, దాన్నుంచి చీలిపోయి 1975 ఫిబ్రవరిలో ఆర్ఎస్‌యూ గా ఏర్పడ్డాయి. ప్రజల్లోకి చేరడం కోసం ఆర్ఎస్‌యూ విద్యార్థులు గ్రామాలకు తరలండి నినాదంతో ముందుకు సాగారు. అందుకు పాట ఒక ఆయుధమైంది. ఈ క్యాంపేన్‌లో పార్టీ స్వరూప స్వభావాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. విశాల దృక్పథం అలవడింది. గద్దర్, జననాట్యమండలి పాటలే ప్రజల్లోకి వెళ్లడానికి మార్గం వేశాయి. ప్రతి విద్యార్థి దళంలో పాటలు పాడే వాళ్లు తప్పని సరిగా ఉండేవారు. సికింద్రాబాద్ వెంకటాపురంలోని గద్దర్ ఇంట్లో నిరంతరం విద్యార్థులకు, యువకులకు జననాట్యమండలి శిక్షణా తరగతులు సాగుతుండేవి. వేలాది మంది ఈ శిక్షణ పొంది కాలక్రమంలో విప్లవకారులుగా పరిణితి చెందారు. నక్సల్బరీ బిడ్డలం ఒగ్గుకథా, యాలరో ఈ మాదిగ బతుకు, సుక్క బొట్టు పెట్టుకొని చంద్రన్న- నేను సూరుకింద నిలబడితే చంద్రన్న, రిక్షాదొక్కే రహీమన్న రాళ్లు కొట్టే రామన్న, హమాలీ కొమురన్న డ్రైవర్ మల్లన్న, వచ్చెరో కరువొచ్చెరో వంటి పాటలు ఆ కాలంలో ప్రాచుర్యం పొందాయి.
పాట ముందు నడిచింది - పాట వెంట ఉద్యమం నడిచింది. అదే సమయంలో విప్లవ రచయితలు, సాహిత్య వేత్తలు పాటను, సాంస్కృతిక కళాకారులను, వారి కృషిని చాలా కాలం చిన్నచూపు చూశారు. వీరిని రెండవ శ్రేణి పౌరుల్లా, రచయితల్లా భావించారు. అందులో కులం పాత్ర తక్కువేమీ కాదు. పాటల రచయితలు, కళాకారులు ప్రధానంగా దళిత బహుజన కులాల నుండి వచ్చినవారు. విప్లవ రచయితల్లో అగ్రకులాల వారి ఆధిపత్యమే కొనసాగింది. అయినప్పటికీ పాట ప్రజల నాలుకలమీదుగా లక్షలాది ప్రజలకు చేరువవుతూ ప్రజలను ఉద్యమంలోకి సమీకరిస్తూ వచ్చింది. విద్యార్థులు గ్రామాలకు తరలండి అనే కార్యక్రమంతో తమకు పరిచయం లేని పల్లెల్లో ప్రచారం చేయడానికి పాటే ప్రధాన సాధనంగా ఉపయోగపడింది. అలా పాట ముందు నడిచింది, పాట వెంట ఉద్యమం నడిచింది. ఆ తరువాత ఉద్యమ నిర్మాణం సాగింది. ఇలా పాట పంట పొలాలను పండించింది. విప్లవం దాన్ని రాసులుగా ఎత్తి నిర్మాణంలోకి సమీకరించింది. ఉద్యమ చైతన్యం విస్తరించిన దాన్లో పది శాతమైనా ఉద్యమం నిర్మాణంలోకి సమీకరించలేనంతగా ఉద్యమ ప్రచారం, ప్రభావం వ్యాప్తి చెందింది.
విప్లవోద్యమ నిర్మాణం కోసం
అటు తర్వాత గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి. తర్వాత గ్రామ రక్షక దళాల నిర్మాణం కోసం ప్రయత్నం సాగింది. నిర్బంధం పెరిగే క్రమంలో 1970-80 నుండి ప్రతి ఏటా మూడింట ఒక వంతు కార్యకర్తలు యితర ప్రాంతాల్లో లోతట్టు గిరిజన ప్రాంతాల్లో ఉద్యమాన్ని విస్తృతీకరించే కార్యక్రమంపై ప్రస్థానం సాగించారు. అలా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ రైతాంగ పోరాటాలు అని పిలువబడ్డ పోరాటాలు దండకారణ్య పోరాట ప్రాంతంగా, గెరిల్లా జోన్ లక్ష్యంగా, సాయుధ దళాల నిర్మాణంగా దృక్పథం, ఆచరణ విస్తృతీకరణ పొందాయి. ఆ క్రమంలో రాసిన పాటలు...
తుపాకులకు ఎదురు నిలవరా అన్నయ్యా తూటాల మాలతొడగరా/ కల్లు ముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే/ నిజం తెలుసుకోవరో కూలన్న నీవు నడుంకట్టి నడువరో మాయన్న/ రక్తంతో నడుపుతాను రిక్షాను నారక్తమే నా రిక్షకు పెట్రోలు, పిల్లో నేనెల్లిపోత కన్నీరు పెట్టబోకూ/ మాయన్న జీతగాడా దుక్కి దున్ని (ఇది 30 పాటల గుత్తి)
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత విప్లవోద్యమం వివిధ శ్రేణుల ప్రజలను పట్టించుకోని ప్రజాసంఘాలను నిర్మాణం చేయాలని.. భావించింది. రాడికల్ విద్యార్థి, యువజన సంఘాలను, రైతు కూలీ సంఘాలను, సింగరేణి కార్మిక సంఘాలను, బీడీ కార్మిక సంఘాలను విస్తృతంగా నిర్మించాలని విద్యార్థులు, యువకులు గ్రామీణ ప్రాంతాలకు తరలాలనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. కళారూపాల్లో జననాట్యమండలి గద్దర్ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. విద్యార్థులకు, యువకులకు పాటల శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ఆ విద్యార్థుల గురించి వారి త్యాగాల గురించి వివరిస్తూ అనేక పాటలను రాశారు. వాటి నుంచి కొన్నింటిని. ఇలా పేర్కొనవచ్చు. వీరులారా సూరులారా విప్లవాల లాల్ సలామ్, అమరులైన ధీరులారా అందుకోండి లాల్ సలామ్/ ఓరుగల్లు జిల్లా పిల్లలోయమ్మా వీరులోయమ్మా
గద్దర్ స్పర్శించని సమస్యే లేదు!
ఇలా ప్రతి దశలో విప్లవ వ్యూహం ఎత్తుగడలు అవసరాలు ప్రజల సమస్యలు తీసుకొని వందలాది పాటలు ఎప్పటికప్పుడు రాసి పాడి ప్రదర్శించారు గద్దర్. ఇలా విప్లవోద్యమాన్ని అనుసరించి, విప్లవిస్తున్న ప్రజల అవసరాలను అనుసరించి, గద్దర్ పాటలు, ప్రదర్శనలు అనేక మలుపులు తీసుకున్నాయి. విప్లవోద్యమంలోని మలుపులే గద్దర్ పాటల్లోని వస్తువు, శైలీ శిల్పంలోని మలుపులను నిర్దేశించాయి. 1985-1989 రహస్య జీవిత కాలంలో అనేక సమీక్షల తర్వాత గద్దర్ పాటలు కోట్లాది ప్రజల అనేక సమస్యలను తీసుకొని వాటిని విశ్లేషిస్తూ రాస్తూ వచ్చారు. అలా గద్దర్ స్పర్శించని సమస్యే లేదు. జీవితంలోని సమస్త పార్శ్వాలను ఏదో ఒక రూపంలో తన సాహిత్యంలో, ప్రదర్శనలో, ప్రసంగాల్లో సంశ్లేషిస్తూ పరిష్కారంగా ఉద్యమించాలని చైతన్యాన్ని రగిలించిన వారు గద్దర్. గద్దర్ కలిసి పనిచేసినవారిలో నేనోకరిని. నాలుగు దశాబ్దాలు కలిసి పనిచేయడానికి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, భావాతీతంగా స్నేహం, సహృదయత కొనసాగడమే ప్రధాన కారణం. విప్లవ కవి, బహుజన కవి, ప్రజా కవి, మహాకవి, వాగ్గేయకారుడు... గద్దర్‌కు జోహార్లు.
- బి. ఎన్. రాములు
బీసీ కమిషన్ మాజీ చైర్మన్
83319 66987