- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాధితుల ఆత్మబంధువులు
తెలంగాణ తాడిత పీడిత ప్రజల ప్రియ నేస్తాలు ప్రొ.కేశవరావు జాదవ్, ప్రజాయుద్ధ నౌక గద్దర్. ఇద్దరూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ముద్దుబిడ్డలే. కళాశాల కాలంలో గురు శిష్యులుగా మొదలైన బంధం చివరి వరకు కొనసాగింది. గద్దర్ విద్యార్థిగా, ఆయనకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్‌గా కేశవ్‌రావు జాదవ్ ఉస్మానియాపై తిరుగులేని ముద్ర వేశారు. విద్యార్థులకు అకడమిక్ పాఠాలే కాదు బతుకు పోరు పాఠాలు చెప్పిన ఉద్యమ ఉపాధ్యాయుడు జాదవ్ సారు.
ఆర్ట్ లవర్ సంస్థ ప్రభావంతో తన పాఠాలకు పదును పట్టిన గద్దర్ కార్య స్థలం మాత్రం ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలే. జననాట్యమండలి నేతగా మొదలై విప్లవోద్యమానికి వెన్ను దన్నుగా నిలిచారు. ఒక ప్రజా వాగ్గేయకారునికి ఇంత మాస్ ఇమేజ్ రావడం మామూలు విషయం కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న ఏకైక విప్లవ వాగ్గేయకారుడు భారత్ నుండి గద్దర్ మాత్రమే అనే అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. అమ్మా తెలంగాణమా అంటూ మలిదశ ఉద్యమానికి ముగ్గు పోసింది గద్దర్ మాత్రమే. గద్దర్‌పై సమైక్య పాలకులు తూటాలు దించినా తెలంగాణ జండా దించలేదు. 70 ఏండ్ల వయసులోనూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడుగా, 'పొడుస్తున్న పొద్దు మీద' పాటతో ట్విట్టర్ తరం యువతను కూడా ఉర్రూతలూగించారు. ఇరువురు గురుశిష్యులూ తమ జీవితాలను పేదల కోసం అంకితం ఇచ్చారు.
తెలంగాణ ఆత్మ జాదవ్
ఉన్నత జీవితాలు అనుభవించడానికి కావలసిన జ్ఞానం ఉన్నప్పటికీ వీరిద్దరూ పేదల పక్షాన నిలబడ్డారు. ప్రభుత్వాల అప్రజాస్వామిక విధానాలపై గొంతు ఎత్తి పోరాడారు, తాము చెపుతున్న దానికి ఆచరణలో కట్టుబడి పని చేశారు. తెలంగాణ ఉద్యమ ఆత్మగా బతికిన జాదవ్ సాబ్ గురించి రాయడం అంటే తెలంగాణ తన గురించి తాను రాసుకోవడమే అవుతుంది. ఒక్క సామాన్య మనిషి ఇన్ని పనులు చేయగలరా? అన్న ప్రశ్నకు నిలువెత్తు రూపమే కేశవ రావు జాదవ్. ఉపాధ్యాయుడు, రచయిత, ఉద్యమకారుడు, జర్నలిస్ట్, సామాజిక సేవకుడు, సోషలిస్టు నేత పత్రికా సంపాదకుడు... ఇన్ని పార్శ్వాల జీవితం ఆయన సొంతం పాలమూరు జిల్లాలో కరువు వస్తే చలించి పోయాడు. యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా తనకు వచ్చిన వేతనం అంతా కరువు జిల్లాలో అంబలి కేంద్రాలకు ధారాదత్తం చేసిన మానవతావాది జాదవ్. గైర్ ముల్కి ఉద్యమం నుండి 1969 ఉద్యమాన్ని వేడి ఎక్కించి దాన్ని చల్లారకుండా కాపాడారు.
ఐక్య వేదిక అధ్యక్షుడిగా
మలిదశ తెలంగాణ ఉద్యమానికి పాఠాలు చెప్పిన మేధావి జాదవ్ మాత్రమే. రాజకీయాల సుడిగుండంలో చాలామంది మేధావులు కొట్టుకు పోతున్నా, తాను మాత్రం పీడిత ప్రజల పక్షాన నిలబడిన ప్రియతమ నేతగా ప్రజలు ఆయనను ప్రేమించారు. రామ్ మనోహర్ లోహియా రాజకీయాల ప్రభావం ఉన్న జాదవ్ సాబ్‌కి దేశంలో అనేకమంది జాతీయనేతలతో సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ సోషలిస్ట్ నేత జార్జ్ ఫెర్నాండెజ్ అత్యంత సన్నిహితులు. ములాయం, నితీష్ కుమార్, లలూ ప్రసాద్ లాంటి జాతీయ నేతలతో సోషలిస్ట్ ఉద్యమంలో కలసి పనిచేశారు. పౌర హక్కుల సంఘం (పీయూసీఎల్) నేతగా బాధితుల పక్షాన రాజ్యంతో కలబడ్డాడు, కేసులకు గురి అయ్యాడు, నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. తెలంగాణ ఐక్య వేదిక అధ్యక్షుడిగా తెలంగాణా అంతటా కలతిరిగి ఉద్యమానికి పురుడు పోశారు. సమాఖ్య పాలనలో తెలంగాణా అంటేనే నల్లదండు, నయీమ్ ముఠాల మారణకాండతో అట్టుడుకుతున్న తెలంగాణలో భయపడకుండా ప్రశ్నించాడు.
పాలకులతో కలబడిన మొండి గోడలు
నిక్కచ్చితత్వం, ప్రశ్నించే తత్వం, ఆచరణతో కూడిన నిజాయితీ జీవితం జాదవ్ సాబ్‌ను మచ్చలేని మనిషిగా నిలబెట్టింది. పెద్ద పెద్ద మేధావులు, ఉద్యమకారులు చివరికి విప్లవ జీవితంలో ఉన్నవారు సైతం జాదవ్ సాబ్ ముందర చేతులు కట్టుకోవాల్సిందే. అంతటి నిప్పు లాంటి జీవితం జాదవ్ సారుది. ఈ ఇరువురు నేతలు జనవరి మాసంలోనే జన్మించారు. చావు మీది, పుట్టుక మీది, బతుకంతా దేశానిది అన్నట్టుగా బాధితులు, పీడితుల పక్షాన నిలబడి పాలకులతో కలబడిన తెలంగాణ మొండి గోడలు వీరు.
(నేడు సాయంత్రం 5 గంటలకు నాంపల్లిలోని తెలుగు విశ్వ విద్యాలయంలో గద్దర్, కేశవరావు జాదవ్‌ల జయంతిని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుపుతున్న సందర్భంగా)
- దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
98480 57274