రైతు నుంచి రజాకార్ దాకా… తెలుగు సినిమా పయనం ఎటువైపు?

by Ravi |   ( Updated:2023-09-30 01:01:14.0  )
రైతు నుంచి రజాకార్ దాకా… తెలుగు సినిమా పయనం ఎటువైపు?
X

రైతాంగ తిరుగుబాటు గురించి వామపక్ష దృక్పథంతో సినిమాలు తీయడంలో తెలుగు చిత్రసీమ భారతదేశంలోని అన్ని భాషల్లోని చిత్ర పరిశ్రమల కంటే కాస్త ముందు ఉందని చెప్పటం అతిశయోక్తి కాదు. 1974లో విప్లవకరమైన వామపక్ష రాజకీయాలపై తెలుగులో వచ్చిన తొలి చిత్రం 'భూమికోసం' మొదలుకుని మాభూమి, వీర తెలంగాణ, రాజన్న, ఇటీవలే ఓటీటీలో వచ్చిన అన్ హెర్డ్ వరకు పలు సినిమాలు భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా తిరుగుబాటును భిన్న కోణాల్లో చూపిస్తూ వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం గురించి 'రజాకార్ సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్' అనే పేరిట తాజాగా చూపనున్న కొత్త కోణం ట్రైలర్ చూసిన అందరినీ షాక్ తెప్పించింది. మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా నాటి తెలంగాణలో హిందువులపై ముస్లిం రజాకార్లు చేసిన అత్యాచారాలపై కేంద్రీకరించి తీస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా తీవ్ర చర్చలకు దారితీసింది.

తేనెతుట్టెను కదిపిన ట్రైలర్..

భారత యూనియన్‌లో 1948లో విలీనం కాకముందు నిజాం పాలనలోని హైదరాబాద్‌లో జరిగిన ఘటనలపై తాజాగా తీస్తున్న చిత్రం 'రజాకార్' ఈ సినిమా నిర్మాతలు ఇటీవలే విడుదల చేసిన టీజర్ తీవ్రమైన రాజకీయ సమరానికి నాంది పలికింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ రేపిన కలకలం ఏ స్థాయిలో ఉందంటే తెలంగాణ రాజకీయ నేతలు ఒకరకంగా మీడియాలో యుద్ధానికి దిగిపోయారు. 'కశ్మీర్ ఫైల్స్' లాగే వాస్తవ గాధలపై ఆధారపడి ఆనాడు రజాకార్లు హిందువులపై పాల్పడిన క్రూర నేరాలు, అత్యాచారాలను కళ్లకు కట్టినట్లు చూపుతున్నామని, ఆ సమయంలో హిందువులకు వ్యతిరేకంగా ఇస్లామ్‌ను పెద్ద ఎత్తున వ్యాప్తి చేసి హైదరాబాద్‌లో తుర్కిస్తాన్ ఏర్పాటుకు రజాకార్లు చేసిన తీవ్ర ప్రయత్నాన్ని 'రజాకార్' సినిమాగా చూపిస్తున్నామని చెప్పడం సంచలనానికి దారి తీసింది. అయితే దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాత్రం 'బీజేపీలోని దివాలా తీసిన కొందరు జోకర్లు తెలంగాణలో తమ రాజకీయ ప్రచారం కోసం మతపరమైన హింసను, ప్రజలను చీల్చే ఉద్దేశంతో ఈ సినిమాను ప్రోత్సహిస్తున్నార'ని విరుచుకుపడ్డారు. ఈ అంశాన్ని సెన్సార్ బోర్డు దృష్టికి తీసుకెళతామని, రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశిస్తామన్నారు. మరోవైవున హిందువులపై ఆనాడు రజాకార్లు సాగించిన దమనకాండ గురించి ప్రజలకు బోధించాలని చూస్తున్న రజాకార్ సినిమా విడుదలకు అడ్డుపడటం మాని ఆ సినిమాను ప్రజలకు చూపించి, వారి నిర్ణయానికే వదిలేద్దామని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ వంటి నేతలు కౌంటర్ ఇచ్చారు.

ఈ సినిమాలు వైరుధ్యాలను సృష్టించలేదు!

1970ల చివర్లో తీసిన మా భూమి నుంచి వీర తెలంగాణ, రాజన్న, ఇటీవలే ఓటీటీలో వచ్చిన అన్ హెర్డ్ వరకు తెలంగాణ సాయుధపోరాటంపై విభిన్న కోణాలను తమ శైలిలో చూపించాయి కానీ నిజాం రాజ్యంలో హిందూ ముస్లింల మధ్య వివక్షను చూపే సాహసానికి దిగలేదు. మొదటి నుంచి తెలుగులో వచ్చిన తిరుగుబాటు ఆధారిత సినిమాలు తెలంగాణ సాయుధ తిరుగుబాటుకు దృశ్యరూపమిస్తూనే హిందూ, ముస్లిం ప్రజల మధ్య సామరస్యతకు ప్రాధాన్యమిస్తూ వచ్చాయి. తీసే విధానంలో భిన్న కోణాలు ఉన్నప్పటికీ రెండు మతాల మధ్య చీలికలకు, విభేదాలకు, ఘర్షణలకు తావిచ్చేలా పై సినిమాలు వ్యవహరించలేదు. హైదరాబాద్‌లో సైనిక చర్య విమోచనా, విముక్తా, విద్రోహదినమా, విలీనమా అనే అంశంపై విభేదాలు గత నాలుగైదు దశాబ్దాలుగా తెలంగాణలో చెలరేగుతూనే వచ్చాయి. కానీ నిజాం పాలనలో దేశ్‌ముఖ్‌లు, దొరల పీడనకు వ్యతిరేకంగా ఇరుమతాల ప్రజల తిరుగుబాటును ప్రధానంగా తెలుగు సినిమాలు చూపించాయి. దేశ్‌ముఖ్‌ల పీడనకు వ్యతిరేకంగా ఆనాడు సాగిన సాముహిక తిరుగుబాటును ఒక వ్యక్తి వీరోచిత గాధగా చూపించిన 'రాజన్న' సినిమా పూర్తిగా కల్పిత గాధే అని చెప్పాలి. ఆనాడు ప్రజా సంఘాలు, భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన బహుముఖ పాత్రను ఈ సినిమా ఉద్దేశపూర్వకంగా తొలగించి ఏక వ్యక్తి హీరోయిజాన్ని ప్రదర్శించి సినిమా కళను నవ్వులపాలు చేసింది. అయినప్పటికీ ఇది హిందూ, ముస్లిం ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టించే సాహసానికి పూనుకోలేదు.

కానీ తెలంగాణ సాయుధ పోరాటంపై ఆ తర్వాత వచ్చిన, వస్తున్న సినిమాలు హైదరాబాద్ ఏకీకరణపై అంతవరకు సాగిన ప్రధాన స్రవంతి కథనాన్ని సవాలు చేస్తున్నాయి. ఇది తొండ ముదిరి ఊసరవెల్లిగా మారిన చందంగా ప్రస్తుతం దేశమంతటా ప్రబలిన విభజన రాజకీయాలను మరింతగా ప్రేరేపించే వైపుగా సాగడం గమనార్హం. 'హిందువులపై నాడు నిజాంతో పాటు నేడు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటి ‘రజాకార్ల’తో కలిసి పనిచేస్తూ, రాజ్యాధికారం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారి ఆకాంక్షలకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ద్రోహం చేశార'ని ఇటీవల అమిత్ షా ఆరోపించడం కూడా దీంట్లో భాగమే. అయితే చరిత్రను తిరగ రాయడం, పురాణాలను ప్రచారం చేయడం, అపోహలను నిరంతరం ప్రచారంలో ఉంచడం ద్వారా భయంకరమైన భయాలను రేకెత్తించడం వంటి భారీ ప్రాజెక్ట్‌లో రజాకార్ వంటి చలనచిత్రాలు భాగమని విమర్శకుల వ్యాఖ్య. ఈ నేపథ్యంలో రైతాంగ తిరుగుబాటు గురించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఇంతవరకు వచ్చిన తెలుగు సినిమాల పూర్వాపరాలను చర్చించుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది.

తొలి రాజకీయ సినిమా 'భూమికోసం'

ఇప్పటికీ తెలుగు ప్రగతిశీల సినిమాలను సీరియస్‌గా వీక్షించే వారు గుర్తుపెట్టుకుంటున్న తొలి వామపక్ష రాజకీయ సినిమా 'భూమికోసం'. 1974లో కేబి తిలక్ దర్శకత్వంలో వచ్చిన 'భూమికోసం' విప్లవ వామపక్ష రాజకీయాలపై తెలుగులో వచ్చిన తొలి చిత్రాలలో ఒకటి. ఈ సినిమా కథ జమీందారీ దౌర్జన్యం నుంచి విముక్తి పొందాలని ప్రయత్నించిన ప్రజల కథ. జమీందారు కుమారులలో ఒకరు తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తారు. 1972లో 'ఎన్‌కౌంటర్' అయిన కేబీ తిలక్ సోదరుడు రామనరసింహారావు జ్ఞాపకార్థం ఈ చిత్రాన్ని అంకితం చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ విప్లవ కవి అయిన శ్రీరంగం శ్రీనివాసరావు స్క్రిప్ట్, పాటలు రాయగా, నాటి పీపుల్స్ వార్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కె.జి.సత్యమూర్తి (శివసాగర్) రాసిన చెల్లీ చంద్రమ్మ గేయం కూడా పొందుపరచడం విశేషం. ప్రముఖ హిందీ నటులు అశోక్ కుమార్, గుమ్మడి వెంకటేశ్వరరావు, కొంగర జగ్గయ్య, జమున, ప్రభాకర్ రెడ్డి చలం, ప్రభ నటించిన ఈ సినిమాలో జయప్రదను తొలిసారి పరిచయం చేశారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. భూపతి వంశానికి చెందిన జమిందారు (హిందీ నటులు అశోక్ కుమార్)కు జగ్గయ్య, జమున పిల్లలు. తండ్రి పెత్తందారీ భావాలతో విభేదించిన కుమారుడు జగ్గయ్య ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. జమున వివాహం మానుకుని తండ్రితో ఉండి పోతుంది. అశోక్ కుమార్ మరణం తరువాత జగ్గయ్య తన కూతురు (ప్రభ) తో తిరిగి చెల్లి దగ్గరకు వస్తాడు. సాహిత్యానికి అగ్రతాంబూలం ఇచ్చిన ఈ సినిమాలో 'ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా', 'భూమికోసం భుక్తి కోసం.. సాగే రైతుల పోరాటం, అనంత జీవన సంగ్రామం' అనే శ్రీశ్రీ రాసిన పాటలు ఉర్రూతలూగించాయి. ఇక శివసాగర్ రాసిన చెల్లీ చంద్రమ్మ గేయం అప్పటికే జనాల్లో బహుళ ప్రాచుర్యం పొందడంతో సినిమాలో కూడా కథకు బాగా కనెక్ట్ అయింది. చెల్లీ చంద్రమ్మ పాత్రలో జయప్రద గ్రామీణ యువతిగా చక్కగా ఇమిడిపోవడం మరీ విశేషం.

ప్రముఖ అభ్యుదయ చిత్ర దర్శకుడు కేబీ తిలక్ కళాత్మకంగా తీసిన 'భూమికోసం' సినిమా నేరుగా థియేటర్లలో విడుదల కావడమే కాదు అనేక ఫిల్మ్ క్లబ్‌లు కూడా ఆరోజుల్లో దీన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాయి. 1984లో రాడికల్ విద్యార్థి ఉద్యమం బలంగా సాగిన తిరుపతి వంటి పట్టణాల్లోనూ ఈ సినిమాను థియేటర్లో స్పెషల్‌గా ప్రదర్శించారు. భూమి కోసం తర్వాత వరుసగా వచ్చిన మాభూమి, వీర తెలంగాణ, రాజన్న, ఇటీవలే ఓటీటీలో వచ్చిన అన్ హెర్డ్ వరకు తెలంగాణ సాయుధ పోరాటాన్ని విస్తృత స్థాయిలో తెలుగు సినిమాలు చిత్రిక పట్టాయి. 2015లోనే విడుదలైన 'రజాకార్' సినిమా మరాఠీ భాషలో వచ్చి తర్వాత తెలుగులోకి డబ్ కావడం గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమాలు చరిత్రగా మిగిలిపోకుండా ఈరోజుకీ సీరియస్ సినిమా చర్చల్లో భాగమవుతున్నాయి.

(ముగింపు వచ్చేవారం)

కె. రాజశేఖరాజు

73496 94557

Advertisement

Next Story