- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మట్టి చేతుల్లో డాక్టరేట్ పట్టా
సాకే భారతి ఒక వ్యవసాయ కూలి, గిరిజన మహిళ, ఒక బిడ్డకు తల్లి, నివాసం మారుమూల గ్రామం. భర్త భూమి లేని నిరుపేద. ఇద్దరి రెక్కలాడితే తప్ప కడుపు నిండని సంసారం. అయినా చదువు కొనసాగించింది. చివరకు ఎవరెస్టు శిఖరమెక్కినట్లు స్నాతకోత్సవ వేదికనెక్కి డాక్టరేట్ పట్టాను అందుకుంది. ఆ వేడుకకు సాధారణ చీర, చెప్పులు ధరించి వచ్చిన భారతిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఆమె జీవితం గురించి తెలుసుకొని పొగడ్తలతో ముంచెత్తారు. వార్తల్లో డా.భారతి వివరాలు తెలుసుకున్న ప్రపంచం నివ్వెర పోయింది.
పేదరికంపై విద్యాపేక్ష గెలుపు
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో నాగులగుడ్డం అనే ఒక మారుమూల పల్లెలో జన్మించిన సాకే భారతి చదువు ఇంటర్మీడియట్ దాకా ప్రభుత్వ బడులలో ఇంటి నుండే సాగింది. పేదరికం వల్ల ఆమె చదువు ఊరు దాటలేదు కానీ పిన్న వయసులో పెళ్లి చేసి ఇంటివాళ్లు ఆమెను ఊరు దాటించారు. అయితే రోజూ ఆమెను చదువు పిలుస్తూనే ఉంది. తమ ఊరు అనంతపురంకు 30 కి.మీ.దూరం. ఊర్లోకి బస్సు రాదు. అయినా చదువుపైనున్న ప్రగాఢ కాంక్ష అన్ని అడ్డంకులను దాటించింది. పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేసి కాలేజీకి వెళ్లొచ్చి తిరిగి కూలీ పనికి వెళ్ళేది. ఇలా డిగ్రీ, ఆ తర్వాత పీజీ అక్కడే పూర్తి చేశారామె. ఈ చదువు కొనసాగింపులో ఆమెకు భర్త శివప్రసాద్ సహకారం పూర్తిగా లభించింది. చదువుపై భారతికి ఉన్న ఆపేక్ష, ఆమె విద్యా ప్రజ్ఞను గ్రహించిన భర్త సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి తోడ్పడ్డారు.
మట్టి మనిషి పిండిన రసాయన సారం
నిజానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే చాలు అనుకున్న భారతిని కెమిస్ట్రీ ప్రొఫెసర్లు పీహెచ్‌డి చేయమని ప్రోత్సహించారు. భర్త కూడా మద్దతునీయడంతో ఆమె ఎస్‌కెయూలో పరిశోధనకు దరఖాస్తు చేసుకున్నారు. అవకాశం లభించి, ఆమె శ్రమ ఫలించి జులైలో డాక్టరేట్ పట్టా చేతిలో పడింది. ప్రొఫెసర్ శోభ ఆమెకు గైడ్‌గా ఎంతో ప్రోత్సహించారు. రీసెర్చ్ సమయంలో స్టైఫండ్ లభించినా భారతి పని చేయడం మానలేదు. కొరుకుడు పడని రసాయన శాస్త్రంలో ఒక మట్టి చేతుల మనిషి 'బైనరీ లిక్విడ్ మిక్చర్స్' అనే టాపిక్‌పై పరిశోధన చేయడం అనేది ఉహించడం కూడా కష్టమే. అయితే ఆ ఊహలకు నింగి నేలను ఏకం చేసే రెక్కలు తొడిగేలా భారతి తన విజయ పతాకాన్ని ఎగరవేశారు.
సాకే భారతి కాదు... సాధన సామర్థ్యం
శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా సాధించడంతో ఆమె మసక జీవితంలో వెలుగులు ప్రసరించాయి. పలకరించడానికి వచ్చిన పాత్రికేయులతో తనకు అధ్యాపకురాలిగా పనిచేయాలని ఉందని, పేద కుటుంబాలకు కూడా విద్య అందేలా కృషి చేయాలనీ ఉందని తెలియజేశారు. భారతి జ్ఞానతృష్ణ, అందుకు పడిన శ్రమను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు దగ్గర్లోని గిరిజన గురుకుల కళాశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధపడింది. అంతేకాకుండా 2 ఎకరాల వ్యవసాయ భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు, అసంపూర్తిగా ఉన్న వారి ఇంటిని పూర్తి చేసేందుకు సన్నాహాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. విద్య ద్వారా ఇన్ని విజయాలు, సదుపాయాలు సాధించిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. డాక్టర్ సాకే భారతి అనే పేరు ఇప్పుడు సాధనా సామర్థ్యానికి మారుపేరు. పెకిలించ తరంకాని బండరాయి లాంటి సంకల్పాన్ని పిండి కొట్టిన చదువుల సానరాయి. విజయ పరంపర ఊహకందని కొత్త రికార్డు లిఖించిన స్వేద ముఖచిత్రం.
-బి.నర్సన్
9440128169