ఆమె ఈ దేశానికి మనసిచ్చింది కానీ...

by Ravi |   ( Updated:2024-03-05 00:30:48.0  )
ఆమె ఈ దేశానికి మనసిచ్చింది కానీ...
X

ప్రెంచ్ సంతతికి చెందిన ఆమె భారతదేశంలో విద్యనభ్యసించడానికి పాతికేండ్ల కిందట వచ్చింది. భారత పౌరుడిని ప్రేమించి పెండ్లి చేసుకుంది. ఇక్కడే స్థిరపడింది. జీవనోపాధి కోసం జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుంది. వృత్తి నిబద్ధతకు కట్టుబడి ఆమె రాసిన రాతలు రాజ్యానికి కంటగింపుగా మారాయి.

రాజ్యం బెదిరించింది. ఇక్కడి నుండి వెళ్లిపొమ్మని హుకుం జారీ చేసింది. ఈ దేశాన్ని ప్రేమించి ఇక్కడే స్థిరపడిన ఆమె ఇప్పుడు.. పుట్టుక మూలాలను వెతుక్కుంటూ నిష్క్రమించింది. బరువెక్కిన హృదయంతో న్యాయంపై నమ్మకంతో మళ్లీ తిరిగి వొస్తానన్న చిరు ఆశతో ప్రయాణమవుతూ ఓ లేఖను విడుదల చేసింది. భారతదేశాన్ని అమితంగా ప్రేమించే వనెస్సా లాంటి జర్నలిస్టులు ఈ సమాజానికి ఎంతో అవసరం.

ఆమె పేరు వనెస్సా డౌనక్. విదేశీ సీనియర్ జర్నలిస్ట్. 1998లో భారతదేశానికి విద్యార్థినిగా వచ్చింది. 2001 నుంచి జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించింది. హర్యానాకు చెందిన సహపాఠిని ప్రేమ పెండ్లి చేసుకుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఫ్రెంచ్, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. అయితే వనెస్సా ఎక్కువ కాలం ఇండియాలో ఉన్న విదేశీ సీనియర్ జర్నలిస్టు కూడా. ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కూడా ఉంది. లాక్రోయిక్స్, లే పాయింట్, లే టెంప్స్, లే సోయిర్ నాలుగు ఫ్రెంచ్ మీడియా సంస్థల దక్షిణాసియా ప్రతినిధిగా పని చేసింది. రెండు దశాబ్దాల చరిత్రకు సాక్షి ఆమె. 23 ఏండ్ల పాటు పాత్రికేయ రంగంలో అనేక కథనాలు అందించిన ఆమెకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. భారతదేశంలో మానవ హక్కుల గురించి, దేశీయ రాజకీయాల గురించి అనేక విశ్లేషణాత్మక కథనాలను, వ్యాసాలను అందించారు.

పీడితుల పక్షాన నిలిచిన గొంతుక

బిజెపి సారధ్యంలో జరుగుతున్న అమానవీయ ఘటనలను సాహసోపేతంగా వెలుగులోకి తెచ్చారు. కరోనా సమయంలో దేశ పరిస్థితి పై, పాలకుల పని తీరుపై, గంగా నదిలో మృతదేహాల లభ్యంపై, అనేక ఘటనలపై అందించిన కథనాలు పాలకులను ఇరుకున పెట్టాయి. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పత్రికా స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడింది. దేశంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నందుకు హత్యలకు, దాడులకు గురైన జర్నలిస్టులు వేలాది మంది ఉన్నారు. ఉపా చట్టం లాంటి కేసులు మోపబడి జైలు జీవితం గడిపిన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు. ఆ కోవలోనే వనెస్సా డౌనక్ రాజ్య నిర్బంధానికి గురయ్యారు. పీడనకు గురౌతున్న అణగారిన జనానికి వనెస్సా ఒక బలమైన గొంతుక. అందుకు ఆమె కథనాలు దర్పణంగా నిలుస్తాయి.

కుటిల రాజనీతికి వనెస్సా బలి

2022 సెప్టెంబర్‌లో ఆమె జర్నలిజం పర్మిట్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. వనెస్సా వినతులకి స్పందన లేదు. కక్షపూరితంగా వేధింపులకు గురి చేసింది. రెండు దశాబ్దాల జర్నలిస్టుకి, ఆమె చేసిన సేవలకు ఈ రూపంలో పాలకులు కానుక ఇచ్చారు. ఇప్పుడు ఓసీఐ కార్డు రద్దు ఉపసంహరణ ఎందుకు చేయకూడదు.. అంటూ హోంశాఖ జనవరి 24న నోటీసు ఇచ్చింది. గతంలో అధికారులు ఆమెను జర్నలిజం వదిలేయాలని సలహాలు ఇచ్చారు. ఇష్టమైన, ప్రేమించే వృత్తిని వదిలి వేయాలని ఆమె అనుకోలేదు. తనపై నిరూపించని ఆరోపణలు చేశారని, తన రచనలను 'ద్వేషపూరితం' అంటూ వ్యాఖ్యలు చేశారని, ఉపద్రవం కలిగించేలా, శాంతిని భగ్నం చేసేవిగా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నట్లు వనెస్సా వెల్లడించింది. తనూ ప్రేమించిన ఈ దేశాన్ని, తన కుటుంబాన్ని వదిలి వెళ్లేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని చెబుతూ ఫిబ్రవరి 16న వెళ్లిపోతూ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత సార్వభౌమాధికారం, సమగ్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఆమె రచనలు ఉన్నాయని చెప్పడం ద్వారా కాషాయ పాలకులు తమ కుటిల రాజనీతిని ప్రదర్శించారు. వనెసా లాంటి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడానికి టార్గెట్‌గా ఈ మహిళా జర్నలిస్టును ఎంచుకున్నారు.

ఈ నిష్క్రమణ దేశానికే కళంకం

2024 పార్లమెంట్ ఎన్నికలు రానున్న సమయంలో పత్రికలపై, జర్నలిస్టులపై వేధింపులను తీవ్రతరం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన నోటీస్‌పై విదేశీ కరస్పాండెంట్లు అంతర్జాతీయంగా ఆమెకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛను హరించడం, జర్నలిస్టుల గొంతుకను నొక్కేయడం భారత ప్రజాస్వామ్యానికి కళంకం లాంటిది, అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను దిగజార్చుతుంది. ఇలాంటి చర్యలు రాజ్య స్వభావాన్ని, పాలకుల అసహనాన్ని బయటపెడుతున్నాయి. భారతదేశాన్ని అమితంగా ప్రేమించే వనెస్సా లాంటి జర్నలిస్టులు ఈ సమాజానికి ఎంతో అవసరం. ఆమె మళ్లీ భారత్‌కు తిరిగి రావాలని, ఆమెకు న్యాయం జరగాలని ఆశిద్దాం.

- మామిండ్ల రమేష్ రాజా

రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ (యం యల్)

78932 30218

Advertisement

Next Story