విస్మృత యోధులు..

by Ravi |   ( Updated:2024-07-17 00:30:10.0  )
విస్మృత యోధులు..
X

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అసంఖ్యాక ముస్లింయోధుల్లో తెలంగాణకు చెందిన మన హైదరాబాదీ ముద్దుబిడ్డలు మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్, తుర్రెబాజ్ ఖాన్ ముఖ్యులు. కోఠీలోని బ్రిటిష్ అధికారుల నివాసాలపై దాడిచేసి ఆంగ్ల సైన్యానికి చుక్కలు చూపించిన వీరులు వీరు. మౌల్వీ సయ్యద్, అల్లావుద్దీన్ హైదరాబాద్ నగర చరిత్రాత్మకమైన మక్కామసీదు ఇమామ్‌గా సేవలందించారు. ఈయన ప్రియ శిష్యుడు, హైదరాబాద్ సమరసింహం తుర్రెబాజ్ ఖాన్ పౌరుషానికి, ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. ఈ కారణంగానే ఆయన తురుంఖాన్‌గా ప్రసిద్ధి చెందాడు.

బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా గురుశిష్యులిద్దరూ ఒకరోజు 5000 మందితో కలిసి హైదరాబాదులోని ఆంగ్ల సైన్యాధికారుల నివాసాలపై దండెత్తాలనుకున్నారు. తుర్రెబాజ్‌ ఖాన్‌ తన సాటి పఠాన్‌ యోధులతోపాటు, స్థానిక తెలుగువారిని కూడా కలుపుకొని బేగం బజార్‌లో మాటు వేశాడు. మరోవైపు మౌల్వీ సయ్యద్‌ అలావుద్దీన్‌ వందలాది తిరుగుబాటు యోధులను కూడగట్టి సయీదాబాద్‌ ఈద్గా మైదానం మీదుగా కోఠీలోని బ్రిటిషర్ల నివాసాలపైకి దండయాత్రకు బయలు దేరాడు. వీరిద్దరూ కోఠీలోని మార్వాడీల ఇండ్లపైకి చేరుకున్నారు. మారణాయుధాలతో రెసిడెన్సీ‌పైకి దాడి జరపాలని పథకం రూపొందించారు. వెంటనే తుపాకులతో ప్రధాన ద్వారం రెసిడెన్సీ భవనంపై దాడి మొదలు పెట్టారు.

వణికిపోయిన బ్రిటిష్ అధికారి

ఈ ఆకస్మిక దాడితో నాటి రెసిడెంట్‌ డేవిడ్‌సన్‌ గజాగజా వణికిపోయాడు. హైదరాబాదీ యోధులను ముఖా ముఖి ఎదుర్కోలేక తుర్రెబాజ్‌ ఖాన్‌, మౌల్వీ అల్లా ఉద్దీన్‌లను దొంగచాటుగా మట్టుబెట్టడానికి తోపులతో దొంగదాడికి దిగాడు. 1857 జులై 17న మొదలైన ఈ లడాయి రెండోరోజు (జులై 18 వ తేదీ) ఉదయం వరకు కొనసాగింది. చీకటి కావడంతో డేవిడ్‌ సన్‌ పన్నాగానికి హైదరాబాద్‌ వీరయోధులు ఒక్కొక్కరుగా నేలకొరిగారు. మౌల్వీ అల్లా వుద్దీన్‌, తుర్రెబాజ్‌ ఖాన్‌ శత్రువు ఎత్తుగడను అర్థం చేసుకొని తిరిగి శక్తిని కూడగట్టుకోవడం కోసం వ్యూహాత్మకంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తుర్రెబాజ్ ఖాన్ మారువేషంలో బెంగుళూరుకు వెళుతుండగా మహబూబ్‌నగర్‌ జిల్లా మొగిలిగిద్ద అనే ఊరిలో పోలీసులకు దొరికి పోయాడు. కోర్టులో హాజరు పరచినప్పుడు తాను తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు గర్విస్తున్నానని ప్రకటించారు. అక్కడ ఆయనకు జీవిత ఖైదు పడింది. తరువాత ఆయన్ను అండమాన్‌కు తరలిస్తుండగా 1859 జనవరి 18న మెరుపులా తప్పించుకున్నాడు.

స్వాతంత్ర్య యోధుడి వీరమరణం

మంగళంపల్లిలో అరెస్టయిన మౌల్వీ సయ్యద్‌ అల్లా వుద్దీన్‌కు యావజ్జీవ శిక్ష పడింది. ఆయనను బ్రిటీషు ప్రభుత్వం అండమాన్‌ నికోబార్ లోని ' కాలాపానీ ' అనే జైలుకు తరలించి చిత్రహింసలు పెట్టి చంపేసింది. తప్పించుకున్న తుర్రెబాజ్‌ ఖాన్‌ 1859 జనవరి 20 ఉదయం తూఫ్రాన్‌ గ్రామంలో ఆశ్రయం తీసుకుంటుండగా సమాచారం తెలిసిన పోలీసులు చుట్టుముట్టారు. ఖాన్‌ వారితో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. ఈ వీరుని మృతదేహాన్ని హైదరాబాదుకు తీసుకువచ్చి, తలను, మొండాన్ని వేరుచేసి మూడు రోజుల పాటు కోఠీ సెంటర్లో బహిరంగంగా వేలాడదీశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో తుర్రెబాజ్ ఖాన్‌ శూరత్వానికి గుర్తుగా ఓ స్మారకస్థూపం నిర్మించబడి ఉంది. కోఠి ఉమెన్స్ కాలేజీ నుంచి పుత్లిబౌలీ ఎక్స్ రోడ్ వరకు ఉన్న దారికి తుర్రెబాజ్ ఖాన్ పేరు పెట్టారు. కనుక నిజమైన చరిత్ర కాల గర్భంలో కలసిపోకుండా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది.

(నేడు బ్రిటిష్ రెసిడెన్సీ మీద మన సమర యోధులు దాడి జరిపిన రోజు)

- యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Advertisement

Next Story

Most Viewed