- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తునికాకు కూలీల బోనస్.. దిగమింగిన ఫారెస్ట్ తిమింగలాలు
ఆదివాసీ గిరిజనులు గిరిజనేతర పేదలకు వేసవిలో తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరు. 250 యూనిట్ల పరిధిలో 3లక్షల మంది వరకు ఏటా తునికాకు సేకరణలో పాల్గొంటుంటారు. ఏజెన్సీలో దాదాపు ప్రజలందరూ తునికాకు సేకరణలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రావాల్సిన తునికాకు బోనస్ కోసం ఎదురుచూస్తున్న కూలీలకు ఈ సంవత్సరం బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలలో తునికాకు సేకరించిన కూలీలకు రావలసిన 900 కోట్ల రూపాయల బోనస్ బకాయిలలో ఇప్పటికే 277 కోట్లు విడుదల చేశామని అటవీ శాఖ మంత్రి ప్రకటించారు. తద్వారా ఒక్కో కూలి 5వేల నుంచి లక్ష రూపాయల దాకా బోనస్ పొందుతారని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (TS FDC) ఈసంవత్సరం బోనస్‌ను విడుదల చేసింది. కానీ అది ఆకు సేకరించిన కూలీలకు దక్కకుండా దారి మళ్ళీ దళారీల ఖాతాల్లోకి వెళ్ళింది. తునికాకు గురించి ముక్కు మొహం తెలియని ఫారెస్ట్ బినామీల ఖాతాల్లో లక్షల రూపాయల బోనస్ జమ అయ్యింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో తునికాకు బోనస్ కుంభకోణాలు భారీగా బయటపడ్డాయి. అయితే ఈ కుంభకోణం గురించి పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఇంతవరకు ఒక్కరిపై కూడా కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
సంబంధం లేని వారికి బోనస్..
రాష్ట్ర విభజన తర్వాత తునికాకు బోనస్ నెట్ రెవిన్యూ షేర్‌లను పంపిణీ చేసుకోవడం తదితర కారణాలతో ఇంతకాలంగా బోనస్ విడుదలలో తీవ్ర జాప్యం చేసారు. అనేక ఆందోళనల తర్వాత చివరకు ఇప్పుడు బోనస్ బకాయిలను కొంత మేరకు విడుదల చేయాలని నిర్ణయించడంతో అర్హులైన వారి పేర్లు, బ్యాంకు వివరాలు, డబ్బుల వివరాలను పారదర్శకంగా పంపాల్సిన ఫారెస్ట్ అధికారులు ఇక్కడే పెద్ద కుంభకోణానికి తెరలేపారు. తునికాకు సేకరించిన వారిని పక్కన పెట్టి ఇష్టానుసారంగా లిస్ట్ తయారు చేసి పంపించారు. దీని వలన తునికాకు సేకరణతో సంబంధం లేని కొందరికి వేల నుండి లక్ష రూపాయల వరకు ఖాతాలలో పడ్డాయి. ఆకు సేకరించిన వేలాది మంది పేదలకు బోనస్ డబ్బులు రాలేదు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కోయగూడెం లాంటి పురాతన ఆదివాసీ గ్రామంలో ఏటా క్రమం తప్పకుండా ఊరు ఊరంతా తునికాకు కోస్తున్నా ఆ ఊరిలో ఒక్కరికి కూడా బోనస్ డబ్బులు రాలేదు. అలాగే రాష్ట్రంలో అనేక గ్రామాలకు బోనస్ డబ్బులు పడలేదు. తమకు బోనస్ డబ్బులెందుకు రాలేదని ప్రజలు ఫారెస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా వారు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు. తమ వద్ద ఆకు సేకరించిన వారి వివరాలు లేనందున కళ్ళేదారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో లిస్ట్ తయారు చేసి పంపించినట్లు ఫారెస్ట్ వారు చెబుతున్నారు. గట్టిగా అడిగితే తర్వాత లిస్టులో మీ పేర్లు వస్తాయని దాట వేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గోల్‌మాల్..
మహబూబాబాద్ జిల్లా గంగారం రేంజ్ పరిధిలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రంజిత్ రెడ్డి, ఆదినారాయణలు మూడు లక్షల చొప్పున బోనస్ డబ్బులను తమ అనుచరుల పేర ఖాతాలో వేయించుకొని కాజేశారు. దీనిపై ప్రజలు గొడవ చేస్తే వారి నుండి డబ్బులు రికవరీ చేస్తామని చెప్తున్నారు తప్ప వీరిపై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. జంగాలపల్లి గ్రామానికి వచ్చే బోనస్ ఆరు లక్షల రూపాయలను ఫారెస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ ఫూల్ సింగ్ తన బంధువుల పేరుతో ఖాతాలో వేయించుకొని కాజేశాడు. జంగాలపల్లి తండాలో బానోత్ రవి, బోడ శంకర్ అనే కళ్ళేదారులు మూడు లక్షల రూపాయల బోనస్ డబ్బులను తమ ఖాతాలో వేసుకున్నారు. గూడూరు మండలం భూపతి పేటలో శోభన్ రెడ్డి అనే టిఆర్ఎస్ నాయకుడికి లక్ష రూపాయల బోనస్ ఖాతాలో పడ్డాయి. ఆకుల వెంకట స్వామి అనే కల్లేదారుకు లక్ష రూపాయలు, మరో రిటైర్డ్ ఉద్యోగి పేరుతో లక్ష రూపాయలు ఖాతాలో పడ్డాయి. ఇదే మండలంలోని లైన్ తండాలో 110 మంది పేదలకు రావాల్సిన బోనస్ ఇంతవరకు రాలేదు. బయ్యారం మండలం బాలాజీ పేటలో గ్రామంలో పేదలకు రావాల్సిన బోనస్ లో 3 లక్షల రూపాయలను ముగ్గురు కల్లే దారులు తమ కుటుంబ సభ్యుల పేర్లతో ఖాతాలో వేసుకున్నారు. గ్రామంలో బోనస్ రావాల్సిన 50 కుటుంబాల వారు వీరిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. 2020లో పెళ్లి అయిన తన భార్య పేరుతో 2016 నుంచే ఇక్కడ తునికాకు కోసినట్లుగాను, వేరే జిల్లాకు చెందిన తన బావమరిది పేరుతోను ఒక కళ్ళేదారు బోనస్ తీసుకున్నాడు. హైదరాబాదులో నివాసం ఉండేవారి పేర్లతో, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లల పేర్లతో వేల రూపాయలు ఖాతాల్లో వేసి వారికి 1000, 2000 చొప్పున ఇచ్చి మిగతావన్నీ కళ్ళేదారులు, ఫారెస్ట్ సిబ్బంది తీసుకున్నారు. బయ్యారంలో తునికాకు కళ్ళం లేనప్పటికీ కొందరు బినామీల పేర్లతో సుమారు 10 లక్షల రూపాయల బోనస్ అటవీశాఖ సిబ్బంది కాజేశారు. జిల్లాలోని బయ్యారం, గంగారం, పాకాల కొత్తగూడెం, గూడూరు మండలాల్లో భారీ స్థాయిలో తునికాకు బోనస్ డబ్బులను ఫారెస్ట్ వారు, కల్లేదార్లు, దళారులు కాజేశారు. కొన్ని గ్రామాల్లో నామమాత్రంగా కొంతమంది పేర్లను పంపించి మిగతా మెజారిటీ కూలీల పేర్లను మినహాయించారు. ఇవి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన తునికాకు బోనస్ అవినీతి ఘటనలలో మచ్చుకు కొన్ని మాత్రమే. జిల్లాకు విడుదలైన 26 కోట్ల బోనస్ డబ్బులలో 75% నిధులు గోల్ మాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బోనస్ పంపిణీలో ఇదే తంతు నడిచింది.
ఇప్పుడు అధికారులు రారెందుకు?
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో తునికాకు సేకరణతో సంబంధం లేని 50 మంది ఎకౌంట్లలో భారీగా బోనస్ డబ్బులు పడ్డాయి. ఇవి ఎక్కడివో తెలియక బ్యాంకు అధికారులు, ఖాతాదారులు తికమక పడ్డారు. చివరికి అవి బోనస్ డబ్బులని పోలీసులు తేల్చారు. ఆకు సేకరణలో ఏనాడూ పాల్గొనని వీరి పేర్లను ఫారెస్ట్ అధికారులు ఎందుకు పంపించి ఉంటారో తెలియంది కాదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఇందులో అవకతవకలు జరిగాయి. భద్రాచలం నుండి నిర్మల్ దాకా తునికాకు సేకరణ జరిపే అన్ని జిల్లాల్లో ప్రజలు తమకు రావాల్సిన బోనస్ కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గొత్తికోయలు పోడు రైతు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావును హత్యచేసిన సందర్భంలో ముఖ్యమంత్రి మొదలు ప్రభుత్వ యంత్రాంగమంతా కదిలింది. ఫారెస్ట్ సిబ్బందికి ఆయుధాలిస్తామని, ఫారెస్టు పోలీస్ స్టేషన్లు పెట్టే ప్రతిపాదనలున్నాయని మాట్లాడారు. ఇప్పుడు రెక్కాడితే కాని డొక్కాడని ఆదివాసీ,గిరిజన, గిరిజనేతర పేదల కష్టమైన వందల కోట్ల రూపాయల బోనస్ ను పక్కదారి పట్టించిన ఫారెస్ట్ అధికారుల నిర్వాకంపై ప్రజా ప్రతినిధులు,ఉన్నతాధికారులు ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఆదివాసీ గిరిజనుల వైపు నుండి జరిగే చిన్న ఘటనలకు కూడా పెద్ద ఎత్తున స్పందించే మంత్రులు ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఫారెస్ట్ శాఖ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి అడ్డగోలు అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారు.
రికార్డులు ఎలా మాయమవుతాయి?
మండుటెండల్లో అనేక కష్టనష్టాలకోర్చి తునికాకు సేకరించిన కూలీలకు ఆకు అమ్మితే లాభాల్లో 25 శాతాన్ని బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఇవ్వడం లేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వందలకోట్ల బోనస్ బకాయిలు పేరుకు పోయి వున్నాయి. ఒక్క భద్రాద్రి జిల్లాలోనే లక్ష పదివేల మందికి వంద కోట్లకు పైగా బోనస్ బకాయిలున్నాయి. వీరందరికీ బోనస్ అందించే బాధ్యత అటవీ శాఖది. తునికాకు అమ్మకం జరిగిన వెంటనే ఎప్పటి బోనస్ అప్పుడే పంపిణీ చేస్తే ఇంతటి అవినీతికి ఆస్కారం ఉండేది కాదు. ఎప్పటికప్పుడు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి సాగదీసి ఇప్పుడు విడుదల చేసిన ప్రభుత్వం దాన్ని సక్రమంగా కూలీలకు అందించే ఏర్పాటు చేయకుండా ఫారెస్ట్ అధికారులకు, దళారీలకు భోజ్యంగా మార్చింది. ప్రభుత్వం వైపు నుండి జరిగిన ఆలస్యాన్ని అటవీ శాఖాధికారులకు అవకాశంగా తీసుకొన్నారు. కళ్ళేదారుల నియామకం దగ్గరనుంచి, ఆకు సేకరించిన వారి వివరాలను రికార్డు చేసి భద్రపరిచే బాధ్యత ఫారెస్ట్ శాఖదే అయినప్పటికీ తమ వద్ద వివరాలు లేవని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖ నమోదు చేసిన తునికాకు రికార్డులు ఎలా మాయమవుతాయి? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మొదలుకొని అరణ్య భవన్ దాకా వుండే రికార్డులన్నీ ఒకేసారి మాయమైపోయాయనేది నమ్మ శక్యంగాలేదు. ఏరోజు కారోజు ఆకు సేకరించిన వారి వివరాలు రాసి కింది నుండి పైవరకు పంపించిన లిస్టులు ఒక చోట తప్పిపోయిన మరోచోట నైనా భద్రంగా వుంటాయి.
కాజేసిన మొత్తం రాబట్టాలి
ఉన్నత స్థాయి ఫారెస్ట్ అధికారులు బినామీల పేర్లతో బోనస్‌ని దారి మళ్లించడానికి కారకులయ్యారు. ఫారెస్ట్ వారి నేరపూరిత నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. బినామీ పేర్లతో ఫారెస్టు సిబ్బంది, కల్లేదార్లు కాజేసిన బోనస్ మొత్తాన్ని రికవరీ చేసి న్యాయంగా చెందాల్సిన కూలీలకు అందించాలి. ఇప్పటి వరకు రావాల్సిన మొత్తం బోనస్ బకాయిలను విడుదల చేసి తునికాకు కల్లాల వారీగా గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన వుంది. ఇప్పటికీ ఏజెన్సీలో తునికాకు సేకరించిన చాలా మంది ఆదివాసీలకు తమకు బోనస్ వస్తుందని విషయమే తెలియదు. వారికి అవగాహన కల్పించాలి. నోరులేని పేదల సొమ్మును కాజేసిన రాబందులపై చర్యలు తీసుకొని తునికాకు కోసిన వారందరికీ బోనస్ చెల్లింపు జరిగే వరకు పోరాడాలి.ప్రజాస్వామిక వాదులంతా వారికి అండగా నిలవాలి.
గౌని ఐలయ్య
AIKMS రాష్ట్ర కార్యదర్శి
94907 00955