- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మాయి తండ్రి భయపడాలా! ఇంకెన్నాళ్ళు?
కొడుకు చదువుకు ఎంత ఖర్చు చేశానుకుంటున్నావ్? ఎంత కష్టపడ్డాం అనుకుంటున్నావ్? అంటూ బేరమాడే అబ్బాయి తల్లిదండ్రులు, అదే అమ్మాయిని పెంచి పెద్ద చేసి చదివించడానికి ఖర్చులేం పెట్టలేదా? అని ప్రశ్నించుకోవడం లేదు. ఈ ధోరణి వెనుక పురుషాహాంకారం స్పష్టంగా కనిపిస్తున్నది. సమాజం మారుతున్నది. అలవాట్లు, వేషధారణలో అనేక మార్పులు వచ్చాయి. సంప్రదాయం పేరిట అమ్మాయి, అబ్బాయిని వేర్వేరుగా చూడడం ఇక్కడే ఉన్నది. సంప్రదాయాలు, ఆనవాయితీలు, పద్ధతుల పేరిట అమ్మాయి తండ్రిని పీల్చి పిప్పి చేసే వ్యవస్థకు మూలాలేమిటో చర్చించాలి. వరుడికి కట్నకానుకలు ఇవ్వాలని ఎక్కడుంది? అమ్మాయి తల్లిదండ్రుల కంటే అబ్బాయి తల్లిదండ్రులదే పైచేయి అని ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు? తెలుసుకోవాలని ఉంది.
భార్యాభర్తల మధ్య సంబంధం, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లిష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్ షిప్ బిట్వీన్ టు పర్సన్స్ ఆఫ్ ఏ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్, బట్ షుడ్ నాట్ ఏ ఫిష్ అండ్ ఫిషర్‌మ్యాన్' పెద్దరాయుడు సినిమాలోని మోహన్‌బాబు డైలాగ్ ఇది. ఇందులో కుటుంబాల అనుబంధం గురించి చెప్పిన తీరు అద్భుతం. ఆ సినిమాలో పట్నం వాతావరణం నుంచి వచ్చిన హీరోయిన్‌కు పల్లెవాసన నచ్చదు. కారణం తాను పెరిగిన ఇల్లు, మనుషుల అలవాట్లు. దీంతో విభేదాలు. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటివి సహజం. సినిమాలలో హీరోయిన్ల మాదిరిగా అన్ని కుటుంబాలలో అమ్మాయిల డామినేషన్ ఉండదు. అబ్బాయి, వారి కుటుంబం ఆధిపత్యం అడుగడుగునా కనిపిస్తున్నది. ప్రతి సందర్భంలోనూ తమదే పైచేయి అన్నట్లుగా వ్యవహరించడం పరిపాటి. ఈ ధోరణి అనాదిగా వస్తున్నదే కావచ్చు. కానీ, ఎంత కాలం? అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకు భయపడాలి.
అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వేర్వేరా? అబ్బాయిలు కలిగిన తల్లిదండ్రులే అదృష్టవంతులా? అమ్మాయి పేరెంట్స్ ఎల్లకాలం అణిగిమణిగి ఉండాల్సిందేనా! సమ ప్రాధాన్యం పొందడానికి అర్హతలు కావాలా? కొడుకు కంటే కూతురిని పెంచి పెద్ద చేయడమే కష్టం. అది బిడ్డలను కన్న తల్లిదండ్రులకు బాగా తెలుసు. అలాంటప్పుడు ఎవరికి విలువ ఎక్కువ ఇవ్వాలి? 20–25 ఏండ్లు తల్లిదండ్రుల మధ్య పెరిగిన అమ్మాయి అన్నింటినీ వదులుకొని పరిచయం లేని ఇంటిలో అడుగు పెట్టి చచ్చేదాకా ఉండేందుకు సిద్ధపడుతుంది. అంతటి ఆమె త్యాగానికి అబ్బాయి, పేరెంట్స్ ఇచ్చే గౌరవం, చూపే ప్రేమ, ఆప్యాయత ఎంత? దానికి బదులుగా చిన్నచూపు. అడుగడుగునా ఛీత్కారాలు. పెళ్లితో మొదలయ్యే అబ్బాయి కుటుంబపు ఆధిపత్యం చివరి దాకా కొనసాగుతున్నది. ఇదేదో ఒక సామాజిక వర్గానికి సంబంధించింది కాదు. అన్ని వర్గాలలోనూ ఉంది. అన్ని ప్రాంతంలోనూ ఈ ధోరణి కనిపిస్తున్నది.
ఆవేదనకు అంతమెప్పుడు?
అమ్మాయి పుట్టింది మొదలు ప్రతి సందర్భంలోనూ తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. అమ్మాయి చదువు, పెళ్లి భారంగా మారాయి. వియ్యంకుడు, వియ్యపురాలు అనే రెండు బాంధవ్యాలు భయపెడుతున్నాయి. వారు పెడుతున్న ఇబ్బందులను, అవమానాలను మౌనంగా భరిస్తున్నారు. పలకరింపులతోనే మొదలు. పెళ్లిలో మర్యాదల పేరిట నానాయాగీ చేసే కుటుంబాలు ఉన్నాయి. అబ్బాయి తరపున బంధువులకు రెండు ముక్కలు తక్కువ పడ్డాయని గొడవ పడిన ఉదంతాలు చూశాను. తమ వాళ్లను సరిగ్గా చూసుకోలేదని అలిగిన అబ్బాయి మేనమామలను చూశాను. ఎవరికీ చెప్పుకోలేరు. చెప్పుకుంటే ఎక్కడ తన బిడ్డను కష్టపెడతారన్న భయం.
'మేం అబ్బాయి తరపు వాళ్లమన్న' బింకం. ఆడ, మగ సమాన హక్కులు కలిగి ఉన్నప్పుడు ఈ ఆధిపత్యపు పైత్యాన్ని పెద్దలు ఎందుకు పెంచి పోషించారు? ఈ ధోరణి మధ్యతరగతి వర్గాలలో అధికంగా కనిపిస్తున్నది. అబ్బాయిని కన్న తల్లిదండ్రుల గొప్ప ఏమిటో నాకర్థం కాలేదు. ఎక్కడైనా ఆ సమాచారం లభిస్తుందేమోనని వెతికినా దొరకలేదు. కొందరు పెద్దలనూ అడిగాను. సరైన సమాధానం రాలేదు. అమ్మాయితేనేం, అబ్బాయితేనేం.. ఇద్దరూ సమానమే అన్న సామాజిక బాధ్యతనే గుర్తు చేశారు. పెంచి, చదివించి, అడిగినంత కట్నకానుకలు ఇచ్చిన అమ్మాయి తల్లిదండ్రులదే పైచేయి కావాలి. వీళ్లు ఇస్తున్నవాళ్లు. వాళ్లు తీసుకుంటున్నవారు కదా!
ఎందుకీ అవమానాలు?
ప్రతి సందర్భంలోనూ అమ్మాయి తల్లిదండ్రులకు అవమానాలు తప్పడం లేదు. మంచి బట్టలు పెట్టలేదని, దావత్ సరిగ్గా చేయలేదని. ఇలా ఒక్కటేమిటి? అడగడానికి సవాలక్ష సమస్యలు. కట్నకానుకల ప్రస్తావన, స్వీకరణ అన్నీ ఇల్లీగల్. కానీ లీగల్‌గానే అడుగుతారు. ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకునే అబ్బాయికి కూడా ఇవ్వాల్సిందే. ఆ దంపతులకు బిడ్డ పుడితే, మళ్లీ మొదలాయే. లాంఛనాల పేరిట చంపుకు తింటున్నారు. ఆనవాయితీ, సంప్రదాయం అంటూ ఎన్నెన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
'ఒకరి ఇంటిలో అది చేశారు, మరో ఇంటిలో ఇది చేశారు' అంటూ కొత్త ఫంక్షన్లను పుట్టించారు. ఎన్నని అమ్మాయి తండ్రి భరించాలి? ఓ ఇంటికి వెళ్లే ఆడబిడ్డ కూడా వేధింపులకు కారణమైన కేసులు ఎన్నెన్నో ఉన్నాయి. మేనమామ భార్య ఇష్టాయిష్టాలను పట్టించుకోలేదంటూ గొడవకు దిగిన ఫ్యామిలీలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. సంప్రదాయాల పేరిట సాగుతున్న ఈ వివక్ష చిన్నగానే కనిపిస్తుండొచ్చు. కానీ అమ్మాయి తల్లిదండ్రులను మానసికంగా ఎంత కుంగదీస్తున్నదో సమాజం ఆలోచించాలి.
భయం, ఆందోళన
కూతురు ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలు కావాలని ప్రతి తండ్రీ కోరుకుంటాడు. కానీ, భయం. సిటీకి పంపాల్సి వస్తే ఆందోళన. ఒంటరిగా పంపిస్తే నిలబడగలదా? గెలవగలదా? అన్న సంకోచం. అబ్బాయి తల్లిదండ్రులకి ఏ చీకూచింతా లేదు. 'వాడు మగాడ్రా బుజ్జీ' అంటూ స్వేచ్ఛ అనే కంకణాన్ని తొడిగి పంపిస్తున్నారు. అమ్మాయి చదువులకే తడిసి మోపెడైందనుకుంటే కట్నం కింద సమర్పించడానికి ఉన్నదంతా తుడిచి పెట్టేందుకు సిద్ధం కావాలి. కొడుకు చదువుకు ఎంత ఖర్చు చేశానుకుంటున్నావ్? ఎంత కష్టపడ్డాం అనుకుంటున్నావ్? అంటూ బేరమాడే అబ్బాయి తల్లిదండ్రులు, అదే అమ్మాయిని పెంచి పెద్ద చేసి చదివించడానికి ఖర్చులేం పెట్టలేదా? అని ప్రశ్నించుకోవడం లేదు.
ఈ ధోరణి వెనుక పురుషాహాంకారం స్పష్టంగా కనిపిస్తున్నది. సమాజం మారుతున్నది. అలవాట్లు, వేషధారణలో అనేక మార్పులు వచ్చాయి. సంప్రదాయం పేరిట అమ్మాయి, అబ్బాయిని వేర్వేరుగా చూడడం ఇక్కడే ఉన్నది. సంప్రదాయాలు, ఆనవాయితీలు, పద్ధతుల పేరిట అమ్మాయి తండ్రిని పీల్చి పిప్పి చేసే వ్యవస్థకు మూలాలేమిటో చర్చించాలి. వరుడికి కట్నకానుకలు ఇవ్వాలని ఎక్కడుంది? అమ్మాయి తల్లిదండ్రులకంటే అబ్బాయి తల్లిదండ్రులదే పైచేయి అని ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు? తెలుసుకోవాలని ఉంది.
శిరందాస్ ప్రవీణ్‌కుమార్
8096677450