నెరవేరిన ఉపాధ్యాయుల ప్రమోషన్ల కల

by Ravi |   ( Updated:2024-07-10 01:15:28.0  )
నెరవేరిన ఉపాధ్యాయుల ప్రమోషన్ల కల
X

దశాబ్దాల కాలం పాటు ఉపాధ్యాయ లోకం ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల కల నెరవేరడంతో టీచర్లు ఆనందోత్సహాల్లో మునిగితేలుతున్నారు. గత పదేళ్లుగా పదోన్నతులు లేక ఐదేళ్లుగా బదిలీలు లేక నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్న టీచర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలు పొంది నూతన పాఠశాలల్లో చేరిన టీచర్లు బోధనపై దృష్టి సారించనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వద్దనే విద్యాశాఖ ఉండడంతో, వారు దృఢ సంకల్పంతో వెనుకంజ వేయక టీచర్ల పదోన్నతులు, బదిలీలు జరిపేలా సాహసోపేత నిర్ణయం తీసుకోవడం దానికి విద్యా శాఖ ఉన్నతాధికారులు కూడా పట్టుదలగా వ్యవహరించి ప్రక్రియను కొనసాగించడం వల్ల అనేక వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు, బదిలీలకు నోచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని టీచర్లందరూ పదోన్నతులు, బదిలీల కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన మాట వాస్తవం. దీనికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమకు పదోన్నతులు, ఇతరత్రా అంశాలలో అన్యాయం జరిగిందని భావించారు. ప్రత్యేక తెలంగాణ సహకారం అయితే తమ ఆశలు నెరవేరుతాయని కలగన్నారు. తెలంగాణ ఉద్యమంలో మమేకమైనారు. ఆశించిన విధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయింది. కానీ టీచర్ల పదోన్నతుల విషయంలో మాత్రం వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించలేదు, ఇతరత్రా ప్రయోజనాలు నెరవేరలేదు. ఒకవేళ ఈ దశాబ్ద కాలంలో ఏవైనా పదోన్నతులు లభించాయంటే అవి అరకొరగానే జరిగాయి.

కోర్టులూ, కేసులూ, నిరాశా...!

ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ప్రభుత్వ, పంచాయతీ రాజ్ టీచర్ల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య తెరపైకి వచ్చేది. ఆ విషయం కోర్టు పరిధిలో ఉండటం వల్ల అప్పటి ప్రభుత్వం కూడా ఆ విషయమై శ్రద్ధ చూపకపోవడం వల్ల అటు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇటు పంచాయతీరాజ్ టీచర్లు న్యాయంగా వారికి రావలసిన పదోన్నతులను పొందలేక నష్టపోతూ వచ్చారు. 2017లో అప్పటి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల వేదిక సాక్షిగా వేలాదిమంది భాషోపాధ్యాయులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. అది కూడా జరగలేదు. వీటన్నిటికీ కారణం కోర్టు కేసులే.

ప్రభుత్వం చొరవ తీసుకొని టీచర్లకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని భావించి గత సంవత్సరం ప్రక్రియను ప్రారంభించగా, కొంతమంది టీచర్లు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని తమకు న్యాయం జరగడం లేదని కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేసుల వ్యవహారంతో విసుగు చెందిన ప్రభుత్వం వాటి పరిష్కారానికి ప్రయత్నించకుండా వదిలివేయడంతో ఆ ప్రక్రియ సజావుగా ముందుకు సాగలేదు. టీచర్ల కోర్టు కేసులు పండిట్ వర్సెస్ ఎస్జీటీ, టెట్ వర్సెస్ నాన్ టెట్, డి.ఎడ్ వర్సెస్ బి.ఎడ్‌గా సాగాయి. వీటితో పాటు 317 జీవో బాధితులు, స్పాజ్ బాధితులు మొదలుగా కేసులు కొనసాగాయి. ఇన్ని సమస్యల నడుమ టీచర్ల పదోన్నతులు, బదిలీలు జరిగేలా లేవని భావించిన అధిక శాతం మంది టీచర్లు నిరాశ చెందారు. ప్రభుత్వం కూడా ఈ విషయమై ఎటువంటి చొరవ తీసుకోలేదు.

సీఎం ఆదేశాలతో వడివడిగా...

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు పాఠశాల విద్యను బలోపేతం చేయడంపై వారు దృష్టి సారించారు. అందులో భాగంగా గతంలో వివిధ కారణాలతో కోర్టు కేసుల వివాదాలతో నిలిచిపోయిన టీచర్ల పదోన్నతులు, పండిట్, పీఈటీ పోస్టుల ఉన్నతీకరణ, బదిలీలపై ప్రత్యేక చొరవ చూపారు. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియ సజావుగా ముందుకు సాగేలా చూడాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే కోర్టుకు హాజరై విద్యాశాఖ పక్షాన సరైన సమాధానం చెప్పి ప్రక్రియ కొనసాగేలా ముందడుగు వేయాలని సూచించారు. రెండు దశాబ్దాలుగా ఉన్నతీకరణ కోసం చకోర పక్షుల్లా ఎదురు చూసిన భాషా పండితులు కల ఎట్టకేలకు నెరవేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల పోస్టులను అప్ గ్రేడ్ చేయడంతో పండితులంతా స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి పొందారు.

బదిలీలకు క్యాలెండర్

నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం టీచర్ల పదోన్నతులు బదిలీలకు సంబంధించి క్యాలెండరును విడుదల చేయాలని, గతంలో కొనసాగిన నెలవారీ పదోన్నతుల ప్రక్రియను పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దొడ్డిదారి బదిలీలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు పదోన్నతులు నిర్వహించడంపై ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఇదే ప్రక్రియను భవిష్యత్తులో కొనసాగించాలని కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం...

- సుధాకర్ ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed