గ్రంథాలయ శాస్త్ర పితామహుడు S. R. Ranganathan

by Ravi |   ( Updated:2023-08-12 23:30:03.0  )
గ్రంథాలయ శాస్త్ర పితామహుడు S. R. Ranganathan
X

ఎస్‌.ఆర్ రంగనాథన్ లైబ్రరీ సైన్స్ రంగంలో దూరదృష్టి గల మార్గదర్శకుడు. లైబ్రరీల నిర్వహణ, సమాచార సేవలను వేగంగా చదువరులకు అందించటంలో ఆ సంస్థలను విప్లవాత్మకంగా మార్చివేయటంలోనూ. ఆధునిక గ్రంథాలయ పద్ధతులను తీర్చిదిద్దటంలోనూ ఆయన రచనలు పునాదిగా నిలిచాయి. గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి గొప్ప పరిశోధన శాస్త్రవేత్త గా నిలిచాడు.

ఐదు సూత్రాలు కనుగొని

భారతదేశంలోని తమిళనాడులోని షియాలీ(Shiyali)లో 12 ఆగస్టు 1892లో జన్మించిన రంగనాథన్ చిన్నప్పటి నుండే వివిధ శాస్త్ర విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తిని ప్రదర్శించాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో ముఖ్యంగా గణాంక శాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాడు. అలాగే, సంస్కృతం భాషలో కూడా రాణించాడు. రంగనాథన్ విద్యా నైపుణ్యం అతనికి స్కాలర్‌షిప్‌లను సంపాదించిపెట్టింది. తద్వారా అతను ఇంగ్లాండ్‌లో ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కలిగింది. రంగనాథన్ ఇంగ్లాండ్ పర్యటనలో పాశ్చాత్య లైబ్రరీలలో సంప్రదాయకంగా అనుసరిస్తున్న పద్ధతులనూ, నైపుణ్య విధానాలను గురించి క్షుణ్ణంగా శోధించి తెలుసుకున్నాడు.

అప్పటికి అందరూ గ్రంథాలయాలలో అనుసరిస్తున్న డ్యూయీ డెసిమల్ క్లాసిఫికేషన్ (DDC) వ్యవస్థను పరిశీలించటం ద్వారా ఆయన బాగా ప్రభావితుడయ్యాడు. ఆ విధానాలను భారతీయ గ్రంథాలయాల అవసరాలకు అనుగుణంగా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. రంగనాథన్ గ్రంథాలయ శాస్త్రంలో అప్పటికే స్థిరపడి ఉన్న విభిన్న సంస్కృతులను, పద్ధతులను, వ్యవస్థలను లోతుగా పరిశీలన చేశాడు. తద్వారా లైబ్రరీ సైన్స్‌లో ఒక వినూత్న ఆలోచనా రీతులను రూపొందించడంలో ఆ విజ్ఞానం అతనికి సహాయపడింది.

ఎస్.ఆర్ రంగనాథన్ 1931లో గ్రంథాలయ శాస్త్రంలో ఐదు ప్రధానమైన సూత్రాలు (ఫైవ్ లాస్‌)ను కనుగొని వాటిని విస్తృతంగా ప్రచారం చేశాడు.ఈ ఐదు సూత్రాలను రూపొందించడం ద్వారా రంగనాథన్ ప్రపంచ ప్రఖ్యాతి పోందాడు. అవి ఉపయోగం కోసం పుస్తకాలు, ప్రతి చదువరికీ తన పుస్తకం, ప్రతి పుస్తకానికీ ఒక చదువరి, చదువరి సమయాన్ని వృధా చేయకుండా రక్షించు, గ్రంథాలయం ఒక పెరిగే సంస్థ. ఈ ఐదు చట్టాలు లేదా సూత్రాలు సమర్థవంతమైన లైబ్రరీ నిర్వహణకు అలాగే గ్రంథాలయ వినియోగదారుల సేవలకు విశేషంగా తోడ్పడాయి. ప్రతీ గ్రంథపాలకుల పనితీరుకు గీటురాయిగా నిలిచాయి. మొత్తం గ్రంథాలయ తత్వశాస్త్ర మర్మం ఈ ఐదు సూత్రాలలో దాగి ఉంది. చదువరుల (వినియోగదారుల) అవసరాలు సత్వరంగా తీర్చటానికి, సమర్థవంతమైన సూత్రాలుగా ఇవి నిలిచాయి. గ్రంథాలయ సంస్థ ప్రాముఖ్యతను పెంచటంలో ఈ సూత్రాలు విశేషంగా దోహదపడ్డాయి.

ఈ వ్యవస్థలో కోలన్ వర్గీకరణ

1933లో ప్రవేశపెట్టిన రంగనాథన్ సంచలనాత్మక కోలన్ వర్గీకరణ వ్యవస్థ, డి.డి.సి. (DDC)కి మరింత అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందించింది. ఈ వ్యవస్థ (సిస్టమ్)లో అంశాల (సబ్జెక్ట్ )ఆధారంగా పుస్తకాలను వర్గీకరించింది. వినియోగదారులు సమాచారాన్ని మరింత సులభంగా, సమర్థవంతంగా యాక్సెస్ చేయడానికి ఈ పద్ధతి వీలు కల్పిస్తుంది. ఎస్‌ఆర్ రంగనాథన్ వినూత్నమైన ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా వర్గీకరణ వ్యవస్థల (క్లాసిఫికేషన్ సిస్టమ్)పద్ధతిని ప్రభావితం చేసింది.

రంగనాథన్ ఇంగ్లాండ్ నుండి 1925లో భారతదేశానికి తిరిగివచ్చాడు. మన భారతదేశంలో గ్రంథాలయ వ్యవస్థలను నెలకొల్పడంలోనూ, వాటి సేవలను ఆధునీకరించి ఉపయోగించటంలో ఆయన కీలక పాత్రను పోషించాడు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా విశ్వవిద్యాలయ లైబ్రరీ పాఠశాల(లైబ్రరీ స్కూల్)ను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అప్పటికే వివిధ గ్రంథాలయాలలో పనిచేస్తున్న అనేక మంది లైబ్రేరియన్లకు గ్రంథాలయ శాస్త్రంలో వచ్చిన ఆధునిక పద్ధతులను, పరిణామాలను ఆకళింపు చేసుకొనే శిక్షణను అందించాడు. అలాగే గ్రంథాలయ శాస్త్రాన్ని అభ్యసించే నూతన విద్యార్థులకు ఈ కోర్సులు విశేషంగా తోడ్పడాయి. డా.ఎస్ ఆర్ రంగనాథన్ గ్రంథాలయ శాస్త్రానికి,ఉద్యమానికి చేసిన సేవలను గుర్తించి ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

రంగనాథ్ గౌరవార్థం అనేక గ్రంథాలయాలకు, సంస్థలకు ఆయన పేరు పెట్టారు. రంగనాథన్‌ను స్మరించు కోవడం కోసం గ్రంథాలయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ' లైబ్రరీ డే'గా, రంగనాథన్ జయంతిని జరుపుకుంటున్నారు. అతని జ్ఞాపకార్థం సమాజంలో గ్రంథాలయాల వారోత్సవాలను ఆయా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు అధికారంగా నిర్వహిస్తున్నాయి.

డా. రాధికా రాణి,

అసిస్టెంట్ ప్రొఫెసర్, కే.యూ

98493 28496

Advertisement

Next Story

Most Viewed