అనాథగా అన్నదాత

by Viswanth |   ( Updated:2022-09-03 15:12:44.0  )
అనాథగా అన్నదాత
X

గౌరవెల్లిలోనూ ఇప్పుడు పోలీసుల పట్ల రైతుల ఆగ్రహం, తెగింపు కనిపిస్తున్నది. 'కాళ్ల కింద నేల కదిలిపోతున్నదని, భవిష్యత్తు ప్రశ్నార్థకం కానున్నదని' రైతులు పసిగట్టారు. చట్టాన్ని గౌరవించాల్సిన సర్కారే నిర్లక్ష్యం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. బువ్వ పెట్టే భూమి ముంపులో పోతుంటే జీర్ణించుకోలేపోతున్నారు. ప్రత్యామ్నాయం లేకుండా బతుకు భారమవుతుందనే ప్రమాదాన్ని గ్రహించారు. ఉన్న భూమిని నిలుపుకుంటే చాలని కోరుకుంటున్నారు. న్యాయం కోసం గొంతెత్తుతున్నారు. గ్రామాలకు వచ్చే అధికార పార్టీ నేతలను తరిమేస్తున్నారు. మంత్రుల నుంచి సర్పంచ్ వరకూ ఇదే కొనసాగుతున్నది. చైతన్యంలో, ఆలోచనలలో మార్పు కనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలోని తెగింపు ఇప్పుడిప్పుడే రాజుకుంటున్నది. విద్యార్థులు, నిరుద్యోగులకు తోడు ఇప్పుడు రైతులలోనూ వ్యక్తమవుతున్నది.

తెలంగాణ ప్రజలకు తండ్రి, పెద్దన్న, మేనమామ ఈ పాత్రలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌వే. ఆ పార్టీ నేతలు, మంత్రులు అనేక సందర్భాలలో గొప్పగా చెప్పుకున్నారు. అంతేకాదు, రైతులకు బంధువు కూడా అని అన్నారు. కానీ, ఆ రైతులే ఇప్పుడు బందీలవుతున్నారు. అనాథలుగా మొరపెట్టుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వమే పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నది. పెద్దన్న ప్రగతిభవన్‌లో ఉండగానే గౌరవెల్లి రైతులపై పోలీసుల లాఠీచార్జి జరిగింది. మద్దతు ధర అడిగినందుకు గతంలో మిర్చి రైతుల చేతులకు సంకెళ్లు పడ్డాయి. ఇప్పుడు రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నందుకు లాఠీ దెబ్బలు తిన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి సౌకర్యాలు పెరిగాయని, భూముల ధరలకు రెక్కలొచ్చాయని, ఒక్కో ఎకరం 30 లక్షల రూపాయల ధర పలుకుతున్నదని స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారు. మూడెకరాల భూమున్న రైతు కోటీశ్వరుడు అంటూ చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టుల కోసం భూములను సేకరిస్తున్న ఇదే సర్కారు, ఇదే ముఖ్యమంత్రి ఎకరానికి పది లక్షల పరిహారం కూడా ఇవ్వడంలేదు. 'అమ్మబోతే అడవి..' తరహాలో రైతులు దిక్కులేనివారుగా మిగిలిపోయారు. భూమితో రైతుకు ఉండే అనుబంధంపైనా కేసీఆర్ చాలా చెప్పారు. ఇప్పుడు ఆ భూమితోనే రైతుకు బంధం తెగిపోతున్నది.

గోడు పట్టించుకునేదెవరు?

'నేనూ ఒక రైతునే, నేనూ ఒక పెద కాపునే' అని చాలాసార్లు చెప్పుకున్న ఆ పెద్దన్న ఇప్పుడు రైతుల గోడు పట్టించుకోవడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు తాజాగా గౌరవెల్లి రిజర్వాయర్ వరకు భూసేకరణలో రైతులకు అన్యాయమే జరిగింది. మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలో రైతులకు జరిగిన అన్యాయం దుబ్బాక ఉప ఎన్నికలో రిఫ్లెక్ట్ అయింది. 'కాకుల్ని కొట్టి గద్దలకు' అనే చందంగా పేద రైతులను భూమికి దూరం చేస్తున్నారన్న అపవాదును కేసీఆర్ మూటగట్టుకున్నారు. ఇప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎన్జీటీలలో పదుల సంఖ్యలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా, ఒక నమూనాగా ఉన్నదంటూ అధికార పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. రైతుబంధు సంగతి ఎలా ఉన్నా బలవంతపు భూసేకరణ, పరిహారం చెల్లింపులో నిర్లక్ష్యం, నిర్వాసితులపై పోలీసు యంత్రాంగం దౌర్జన్యం, ఇవన్నీ తెలంగాణ రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి పార్టీగా ఎదిగేందుకు కసరత్తు జరుగుతున్నది. తెలంగాణ రైతుల గోస ఇకపైన దేశమంతా తప్పదా? అనే చర్చలు జరుగుతున్నాయి.

చట్టాలను కాలరాసి

రైతుల పరిస్థితి 'పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందమైంది' బ్రిటిషుకాలంనాటి బలవంతపు భూసేకరణ పీడ నుంచి బైట పడడానికి పదేళ్ల కింద వచ్చిన కొత్త చట్టం కాస్త నైతిక భరోసా ఇచ్చిందనే భావన ఉండేది. కానీ, ఆ చట్టాన్ని కూడా తెలంగాణ సర్కారు లెక్కచేయలేదు. పాత జీఓ ప్రకారమే నష్టపరిహారం ఇస్తామంటూ మొండికేసింది. చివరకు వ్యవహారం కోర్టుకెక్కింది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారి కాదంటూ కోర్టు మొట్టికాయలేసింది. రైతుల సంక్షేమం సర్కారుకున్న రాజ్యాంగ బాధ్యత అని స్పష్టంగానే చెప్పింది. కొత్త చట్టం వచ్చిన తర్వాత కూడా పాత జీఓ ప్రకారం భూసేకరణ చేయడం చెల్లదని స్పష్టం చేసింది.

కేంద్ర చట్టానికి అనుగుణంగా పాత జీఓ రద్దయింది. కరోనా టైమ్‌లో ఆదుకున్నది వ్యవసాయ రంగమేనంటూ కేసీఆర్ చాలా గొప్పగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. ఈ మాటలన్నీ రైతులకు ఒకింత సంతోషాన్ని కలిగించాయి. కానీ, అది ఎంతోసేపు నిలవలేదు. మద్దతు ధరకు వడ్లను అమ్ముకోలేక రైతులు నిస్సహాయంగా మిగిలిపోయారు. సాగునీరు పుష్కలంగా ఉన్నా వరి వేయకుండా భూముల్ని పడావు పెట్టాల్సి వచ్చింది. సాగు ప్రణాళిక లేకపోవడంతో రైతులు గందరగోళంలో పడ్డారు. కళ్ళముందు తక్కువ ధరకు మిల్లర్లకు వడ్లను అమ్ముకోవాల్సి వస్తున్నా సర్కారు ధైర్యం కల్పించలేకపోయింది.

ప్రజాభిప్రాయం నామమాత్రం

నిజానికి చట్టం ప్రకారం భూసేకరణ జరపాలంటే దానికి కొన్ని పద్ధతులు పాటించడం అవసరం. భూముల సర్వే జరగాలి. కానీ, రైతులకే తెలియకుండా రహస్యంగా ఆ తంతు ముగిసిపోతుంది. అడ్డుకున్న రైతులపై పోలీసులు విరుచుకుపడతారు. ప్రజాభిప్రాయ సేకరణ మొక్కుబడి ప్రక్రియకే సరిపోయింది. రైతులకు సమాచారమూ ఉండదు. ఒకవేళ ఉన్నా అందులోని వివరాలు అర్థంకానే కావు. అధికార పార్టీ స్థానిక నేతలతో సరే అనిపించుకుని తీర్మానం జరిగిపోతుంది. జహీరాబాద్ నిమ్జ్ విషయంలో ఇదే జరిగింది. చివరకు ఈ ఫార్మాలిటీ ప్రక్రియను కోర్టు కూడా తప్పు పట్టింది. చట్టం ప్రకారం నష్టపరిహారం అడిగిన రైతులు సర్కారు దృష్టిలో దోషులు. అభివృద్ధి నిరోధకులు.

వ్యవసాయాన్ని పర్యావరణ అంశంగా చూడాలని గతంలో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ అడ్వయిజరీ కౌన్సిల్ సూచించింది. కానీ, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుట్టదాఖలా చేసింది. అనుకూలంగా ఉన్న రైతులను రంగంలోకి దించి ప్రజాభిప్రాయ సేకరణను మమ అనిపిస్తుంది. కొద్దిమంది రెవెన్యూ అధికారులే దళారుల పాత్రను పోషిస్తున్నారు. వారు అనుకున్నవారికి ఎక్కువ ధర ఇప్పిస్తారు. నోరులేని పేద రైతులకు న్యాయమే జరగదు. కలెక్టర్ దగ్గరా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. భూసేకరణ ప్రక్రియను తొందరగా పూర్తి చేసిన అధికారులు సర్కారు దృష్టిలో సమర్థులు. అండదండలు, అవకాశాలు, పదోన్నతులు, కోరుకున్న చోట పోస్టింగ్, ఇదీ టీఆర్ఎస్ మార్కు పాలన.

వారికి కోట్లు, వీరికి కన్నీళ్లు

నిజానికి 2013 నాటి భూసేకరణ చట్టం ప్రకారం రెండు పంటలు పండే భూములనుగానీ, భూసారం ఎక్కువ ఉండే భూములనుగానీ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం సేకరించకూడదు. సాగుకు పనికిరాని భూములున్న ప్రాంతంలోనే పరిశ్రమలకు ప్రాధాన్యత ఉండాలి. భూ సేకరణకు ముందే మార్కెట్ రేటును సర్కారు తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ విలువను కూడా సవరించాలి. మూడు రెట్ల మేర నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలి. కానీ, ఇదీ అమలుకావడంలేదు. మల్లన్నసాగర్ విషయంలో ఎకరానికి ఆరు లక్షల రూపాయల ధరనే సర్కారు ఖరారు చేసింది. 'జీ హుజూర్' అన్న రైతులకు డబుల్ రేటు ఇచ్చింది. అంతా రెవెన్యూ సిబ్బంది మహిమ.

రైతుల నుంచి సేకరించిన భూమిని ఐదేళ్ల లోపు నిర్దిష్ట లక్ష్యానికి వినియోగించుకోవాలి. లేదంటే ఆ భూమిని యజమానులకే వదిలేయాలి. ఇవేవీ సర్కారుకు పట్టవు. కాళేశ్వరం మొదలు ట్రిపుల్ వన్ జీఓ వరకు రాజకీయ నాయకుల, సమాజంలో పెద్దలుగా చెలామణి అయ్యే పలుకుబడి కలిగిన మోతుబరుల, భూస్వాముల భూములకు ఎప్పుడూ సర్కారు అండగానే ఉంటుంది. అవసరమయితే రోడ్ల, ప్రాజెక్టుల డిజైన్లు మారుతాయి. ఆ భూములకు మరింత ధరలు వచ్చేలా సహకారం ఉంటుంది. పేద రైతులకే తిప్పలన్నీ. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యే లేదా పదవిని పొందే అధికార పార్టీ నేతలు ఐదేళ్లలో కోటీశ్వరులవుతున్నారు. తరతరాలుగా భూమిని నమ్ముకున్న బక్క రైతులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు.

అన్ని వర్గాలలోనూ అసహనం

గ్రామీణ జీవితం భూమి చుట్టూ తిరుగుతుంటుంది. ఆ భూమికి సాగునీరు వచ్చినప్పుడు రైతులు సర్కారుకు జేజేలు పలికారు. ఇప్పుడు బలవంతపు భూసేకరణ, నష్టపరిహారంలో అన్యాయం, అందరికీ ఒకే ధరను ఫిక్స్ చేయకపోవడం. ఇలాంటి సమస్యలతో రోడ్డెక్కక తప్పడంలేదు. రైతుబంధు అందుకుంటున్నవారే ఇది భూస్వాములకు లక్షలాది రూపాయలు ఇవ్వడానికి ఉద్దేశించిన స్కీమ్ అని తిట్టిపోస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దొరల భూములకు నీటిని పుష్కలంగా తరలించుకోడానికే అనే మాట వినిపిస్తున్నది. స్వంత భూమిని కోల్పోయి కౌలు రైతులవుతున్నారు. బంగారు తెలంగాణ నినాదం అపహాస్యం పాలవుతున్నది. ధరణి తెచ్చిన తంటా రైతులను నిద్రపోనివ్వడంలేదు. భూమిపై హక్కులున్నా సర్కారు దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తున్నది. పోడు రైతుల విషయంలోనూ సర్కారు తీరు అలానే ఉన్నది. ఆదివాసీల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆయుధాలున్నా అటవీ సిబ్బందిపై తిరగబడ్డ సంఘటన అనూహ్యం.

గౌరవెల్లిలోనూ ఇప్పుడు పోలీసుల పట్ల రైతుల ఆగ్రహం, తెగింపు కనిపిస్తున్నది. 'కాళ్ల కింద నేల కదిలిపోతున్నదని, భవిష్యత్తు ప్రశ్నార్థకం కానున్నదని' రైతులు పసిగట్టారు. చట్టాన్ని గౌరవించాల్సిన సర్కారే నిర్లక్ష్యం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. బువ్వ పెట్టే భూమి ముంపులో పోతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యామ్నాయం లేకుండా బతుకు భారమవుతుందనే ప్రమాదాన్ని గ్రహించారు. ఉన్న భూమిని నిలుపుకుంటే చాలని కోరుకుంటున్నారు. న్యాయం కోసం గొంతెత్తుతున్నారు. గ్రామాలకు వచ్చే అధికార పార్టీ నేతలను తరిమేస్తున్నారు. మంత్రుల నుంచి సర్పంచ్ వరకూ ఇదే కొనసాగుతున్నది. చైతన్యంలో, ఆలోచనలలో మార్పు కనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలోని తెగింపు ఇప్పుడిప్పుడే రాజుకుంటున్నది. విద్యార్థులు, నిరుద్యోగులకు తోడు ఇప్పుడు రైతులలోనూ వ్యక్తమవుతున్నది.

ఎన్. విశ్వనాథ్

99714 82403

Advertisement

Next Story