- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ ఔషధం.. నమ్మితే ప్రమాదం
భారతదేశంలో 25 శాతం మందులు నకిలీ లేదా తక్కువ నాణ్యత ఉన్నవేనని 2022లో అసోచామ్ అధ్యయనం తేల్చింది. ప్రపంచంలో అమ్ముడవుతున్న కల్తీ మందుల్లో 35 శాతం ఇండియా నుంచి ఎగుమతి అయినవేనని భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య 2007లోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నకిలీ ఔషధాలు తరచూ పట్టుబడుతున్నాయి. కొన్ని స్థానికంగానే తయారు చేస్తుండగా, మరికొన్ని ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రముఖ కంపెనీల పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా వీటిని మెడికల్ షాపులకు చేరవేస్తున్నారు. ఎక్కువ లాభాలు వస్తుండటంతో కొంతమంది వీటిని విక్రయిస్తూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారు.
నకిలీ ఔషధాలను చాక్ పీస్ పౌడర్, మొక్కజొన్న పిండితో కూడా తయారు చేస్తున్నట్లు ఔషధ నియంత్రణ శాఖాధికారులు గతంలో గుర్తించారు. వీటిని డాక్టర్ రెడ్డీస్, అబౌట్, సన్ ఫార్మా, గ్లెన్ మార్క్, అరిస్టో, టోరెంట్ కంపెనీల బ్రాండ్లను అతికించి విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా మోతాదు కంటే అతి తక్కువ రసాయనాలతో ఔషధాలు తయారు చేస్తున్నట్లు, ఒక ఫార్ములాకు బదులు మరో ఫార్ములా వాడుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. మరోవైపు ప్రభుత్వ డిస్పెన్సరీలకు సైతం నకిలీ మందులు సరఫరా చేసిన ఘటనలు గతంలో వెలుగు చూశాయి. అందుకే మనం ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని మందులను కొనకపోతే.. ఉన్న రోగం పోవడమేమో కానీ.. కొత్త రోగాలు వచ్చే ప్రమాదముంది.
పరిణామాలు ఇలా..
ఔషధాల్లో ఉండే ‘యాక్టివ్ ఇంగ్రేడియెంట్’ మన శరీరంలోకి చేరిన తర్వాత వ్యాధిని నియంత్రిస్తుంది. అయితే.. నకిలీ మందుల్లో యాక్టివ్ ఇంగ్రేడియెంట్ ఉండదు. పిండి, మక్కజొన్న పొడి, ఆలుగడ్డ పొడి వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తప్పుడు యాక్టివ్ ఇంగ్రేడియెంట్ వాడుతున్నారు. ఉదాహరణకు ‘అమాక్సిసిల్లిన్’ ట్యాబ్లెట్లలో ‘పారాసిటమాల్’ నింపుతున్నారు. లేదా తగినంత పరిమాణంలో యాక్టివ్ ఇంగ్రేడియెంట్ వేయడం లేదు. అంతేందుకు కేన్సర్, గుండె జబ్బుల్లో ఉపయోగించే మందుల ధరలు ఎక్కువగా ఉంటాయి. పేషెంట్లు ఏండ్ల తరబడి వీటిని వాడాల్సి ఉంటుంది. దీంతో కేటుగాళ్లు వీటికి నకిలీలను తయారు చేసి, తక్కువ ధర ఆశ చూపి పేషెంట్లకు అంటగడుతున్నారు. ఈ నకిలీ మందులు రోగి ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలో పడేస్తాయి. ఇవి వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా, కాలక్రమేణా రోగికి వినాశకరమైన పరిణామాలు సృష్టిస్తాయి. ఆర్థికంగానూ నష్టాన్ని చేకూరుస్తాయి. వీటిని వాడితే కొత్త అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
పరిశీలన అవసరం
ఈ నకిలీ ఔషధాలు అసలు మందులను పోలి ఉంటాయి. దాదాపు ఒరిజినల్ ప్రొడక్ట్ తీరుగానే ప్యాకేజ్ చేస్తున్నారు, దీనిని ల్యాబ్‌కు పంపించి టెస్ట్ చేస్తే తప్ప కొన్నిసార్లు నకిలీదని గుర్తించలేమని చెబుతున్నారు అధికారులు. అయితే మందులు కొనేముందు ప్రతి ఒక్కరూ ఒకటికి, రెండు సార్లు పరిశీలించాలి. దీర్ఘకాలిక రోగాలతో తరచూ మందులు వినియోగిస్తున్నట్లయితే గతంలో కొనుగోలు చేసిన మందులతో ప్యాకేజింగ్‌ను పోల్చుకోవాలి. పేర్లలో స్పెల్లింగ్‌ను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. తయారీ తేదీ, గడువు తేదీని తనిఖీ చేయాలి. పేరున్న కంపెనీల ఉత్పత్తులను చౌకగా అమ్ముతుంటే అనుమానించాలి. అంతేకాకుండా మెడికల్ షాపులో కొనుగోలు చేసిన మందుల బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలి. కేంద్రం ఔషధాలకు సంబంధించి 300 బ్రాండ్ మెడిసిన్‌ను నోటిఫై చేసి, వాటికి బార్, క్యూఆర్ కోడ్‌ను ఇచ్చింది. వాటిని గమనించాలి. అలాగే ఏవైనా మందులతో అనారోగ్య సమస్యలు, ఎలర్జీ, ఇతర దుష్ప్రభావాలు వంటివి కనిపిస్తే వాటిని అనుమానించాలి.
‘ఆన్ లైన్’కు దూరమే మంచిది..
వెబ్‌సైట్‌లు లేదా ఇతర ఇంటర్నెట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి మందులు కొనుగోలు చేయకపోవడమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని వెబ్‌సైట్లు భారీ డిస్కౌంట్లతో ఫార్మా ప్రొడక్టులను అమ్ముతుండగా.. ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. వీటిని తగిన టెంపరేచర్‌లో నిల్వ చేయకపోవడం, రవాణా చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మందుల సామర్థ్యం తగ్గవచ్చని చెబుతున్నారు. ఆర్‌ఎంపీలు, డ్రగ్ కంట్రోల్ అనుమతి లేని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా పేషెంట్లకు నకిలీ మందులను చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం వాట్సాప్ గ్రూపులను సైతం వినియోగించుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే నకిలీ ఔషధాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 6969కు సమాచారం అందించాలి. గడువు తీరిన ఔషధాలు అమ్మినా దగ్గరలో ఉన్న డ్రగ్ ఇన్స్ పెక్టర్కు గానీ లేదా టోల్‌ఫ్రీ నెంబర్‌కైనా ఫోన్ చేసి విషయాన్ని చెప్పాలి.
-సింగిడి అమృత్,
జర్నలిస్ట్,
98499 73404