‘సినిమా’ పరిణామ కథ!

by Ravi |   ( Updated:2023-06-17 03:04:29.0  )
‘సినిమా’ పరిణామ కథ!
X

‘సినిమా కథలు సెప్పక’ని రావుగోపాల్ రావు గారు యమగోల సినిమాలో ఓ ఊతపదంగా వాడుతారు.. నిజమే.. సినిమా కథలన్నీ ఊహలు, ఉబుసుపోక కబుర్లే ఉంటాయని ఆ మాటకు అర్థం. కానీ.. ‘సినిమా’నే పెద్ద కథ. నేడు 2కే, 4కే... ఇంకా అనేక రకాల అవతారాలలో అభివృద్ధిలో ‘సినిమా’ను మనమంతా చూస్తున్నాం. ఆనందిస్తున్నాం కూడా! తెలుగు సినిమా కథకున్నంత విస్తృతి ‘సినిమా’ కథకు ఉంది... ఎన్నెన్నో మలుపులు, అనుభవాలు, అనుభూతులు... ఎన్నెన్నో ‘ట్విస్టు’లు కూడా ఉన్నాయి. కదలని బొమ్మలు, కదిలే బొమ్మలు, మాటలు లేని, పాటలు లేని, మాటలు నేర్చిన, నడక నేర్చిన, నాట్యం నేర్చిన ఇలా సినిమా ప్రయాణంలో అద్భుతమైన ‘చిత్ర’విచిత్రాలను తమలో ఇముడ్చుకొని 1895 వ సంవత్సరంలో ఫ్రాన్స్ నుంచి 1896 జూలై 7 భారతదేశంలో ‘బొమ్మ పడేంత’ వరకు సినిమా ప్రస్థానంలో సైన్స్ ప్రగతి, సాంకేతిక విజ్ఞాన విస్ఫోటనం కూడా ఉందనే విషయాన్ని విస్మరించరాదు.

127 సంవత్సరాల భారతీయ సినిమా గమనంలో ఎంతో సంప్రదాయబద్ధమైన జ్ఞానం దాగి ఉంది. నాటి హెచ్.ఎం. రెడ్డి, రఘుపతి వెంకయ్య నాయుడులను నుంచి నేటి రాజమౌళి, సుకుమార్‌ల వరకు ఎంతో మంది మేధావులు మన సినిమాకు నూతన రంగులు అద్దారు. వీరు తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌తో పాటు ‘ఆస్కార్’ వంటి కీర్తి పతాకాలను తెచ్చి పెట్టారు. కొన్ని వేల మంది సాంకేతిక నిపుణుల, నటీనటుల ఐక్యతారాగం, వ్యాపార సూత్రాల పరుగులు నేటి సినిమా కథకు ‘రీళ్ళ’ వలె జరిగిపోయిన కాలానికి గుర్తులే.. కదిలిన వదిలిన నాటి జ్ఞాపకాల ‘తెర’లను తొలగిస్తే అద్భుతమైన, ఆశ్చర్యకరమైన అంశాలు క(వి)నిపిస్తాయి.

కదిలే బొమ్మ గా పరిచయమై..

‘కదిలే బొమ్మ’ గురించి తెలియగానే జనం 1895 ప్రాంతంలో భయపడ్డారు. విభ్రాంతికి గురయ్యారు. ఆశ్చర్యంగా చూశారు. మొదట ఫ్రాన్స్‌లో ప్రారంభమైన కదిలే బొమ్మ చరిత్ర 1896లో భారతదేశంలో ప్రవేశించింది. మనదేశంలో జూలై ఏడవ తేదీన, అమెరికాలో ఏప్రిల్ 23వ తేదీన ప్రదర్శితమైంది. ఆ రోజుల్లో ‘ఈ శతాబ్దపు విచిత్రం. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి కదిలే ఛాయాచిత్రాలు. మనిషి సైజు బొమ్మలు’ అని ప్రకటనలు ఇచ్చేవారు. టికెట్ ధర నాలుగు అణాల నుంచి (అణా అంటే ఆరు పైసలు) రెండు రూపాయల వరకు ఉండేది. అయితే అలా ప్రదర్శించింది చిత్రాలు కాదు. వూరికే అవి, ఇవి, కలిపి చూపించేవారు. రైలు బండి రాక, లండన్ లోని నాట్యకత్తెలు, సముద్ర స్నానాలు, సముద్రంలో తుఫాను వంటివి పేర్లుగా నిర్ణయించి చిత్రాలు వేసేవారు. తర్వాత కాలం ఇద్దరు ఇటలీ దేశస్తులు ఒక మైదానం, ‘గుడారం’ (టెంట్ ) వేసి సినిమాలు ప్రదర్శించారు. జెమ్ షెడ్ జీటాటా విదేశాల నుంచి సినిమా పరికరాలను తెప్పించుకొని తన ఇంట్లో సినిమాలు వేసుకునేవారు.

అలా 1904 నుండి కదిలే చిత్రాలను చూడడానికి జనం అలవాటు పడ్డారు. టాటానే ఈ సంవత్సరంలో ఒక టూరింగ్ టాకీస్ కొనుక్కొచ్చి వాటిలో ‘క్రీస్తు జీవితం’ అనే సినిమాను ప్రదర్శించారు. 1910 నాటికి దాదాపుగా పెద్ద నగరాల్లో సినిమా థియేటర్స్ నిర్మాణం జరిగింది. అయితే అన్నింటా కూడా విదేశీ సినిమాలే ప్రదర్శించేవారు. 1912 సంవత్సరంలో తొలి భారతీయ చిత్రంగా ‘రాజా హరిశ్చంద్ర’ నిర్మాణం జరిగింది. నిర్మించినది- దుండిరాజు గోవింద్ ఫాల్కే. ఆయన యూరప్ కూడా వెళ్లి చిత్ర నిర్మాణం గురించి తెలుసుకున్నారు. 1921లో మొదటి తెలుగు టాకీ సినిమా వచ్చింది. దీని నిర్మాణం రఘుపతి వెంకయ్య నాయుడు చేశారు. ‘స్టార్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్’ అనే సంస్థ పేరిట ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తర్వాత ‘భీష్మ ప్రతిజ్ఞ’ను తీశారు. రఘుపతి వెంకయ్య నాయుడు ముందు థియేటర్ అధినేత. 1914లోనే మద్రాస్‌లో మొట్టమొదటి పర్మినెంట్ థియేటర్ కట్టారు. `భీష్మ ప్రతిజ్ఞ’కు నాయుడు గారి కుమారుడు ఆర్. ప్రకాష్ దర్శకుడు. సి. పుల్లయ్య సహాయ దర్శకుడే కాకుండా ఆ సినిమాలో ఓ పాత్రను కూడా ధరించారు. ఈ చిత్రంలో విశేషమేమిటంటే ప్రధానమైన పాత్రలు శంతనుడిగా ఐమీ ఆస్టిన్, గంగగా పెగ్గి కాస్టిల్లో వేశారు. వీరిద్దరూ ఐరోపా దేశస్తులు. ఆ రోజుల్లో స్త్రీలు చిత్రాలలో నటించేందుకు ముందుకు వచ్చేవారు కాదు. స్త్రీ వేషాలు కూడా పురుషులే ధరించేవారు. భీష్ముని పాత్రను దర్శకుడు ప్రకాష్, దాశరాజు పాత్రను హరిసుబ్బారావులు చేశారు. మొట్టమొదటి మూకీ చిత్రాల నటులుగా వారినే పేర్కొనవచ్చు.

మూకీలు మూగబోయి..టాకీలుగా మారి

‘కదిలే బొమ్మ ఎందుకు మాట్లాడకూడదు’ అనే ప్రశ్న ఆనాటి ప్రముఖులకు అనిపించింది. థామస్ అల్వా ఎడిసన్ 1887లోనే శబ్దం వేరేచోట, చిత్రం వేరే చోటా ఉండేవి. క్రమేణ అభివృద్ధి చెంది 1926లో ‘వార్నర్ బ్రదర్స్’ (అమెరికా) తొలి వాక్ చిత్రం ‘డాన్ జువాన్’ నిర్మించారు. 1927లో సంభాషణలతో సహా ‘జాజ్ సింగర్’ నిర్మించారు. 1928లో హాలీవుడ్ లో శబ్ద గ్రహణ శాఖ పుట్టింది.’ అని తన నోట్స్‌లో రాసుకున్నాడు. తరువాత సినిమా చరిత్ర మనందరికీ తెలిసిందే. మన దేశంలో తయారైన 1929 సంవత్సరం లండన్‌లో ప్రదర్శితమైన ‘ఏత్రో ఆఫ్ ది డైస్’. సీతాదేవి అనే ఆమె ఈ చిత్రం నాయక పాత్ర ధరించడం విశేషం. ఈ సంవత్సరంలోనే మన దేశంలో మొదటి టాకీ చిత్రం ప్రదర్శితమైంది. పేరు ‘మెలోడీ ఆఫ్ లవ్’ కలకత్తాలోని ఎలిఫిన్ స్టన్ పాలెస్ లో ప్రదర్శించారు. 1931లో మదాన్ థియేటర్స్ వారు నిర్మించిన రెండు చిన్న చిత్రాలు ‘ఎంపైర్ సినిమా’లో ఆడించారు. ఈ చిత్రాల్లో శబ్దం కూడా ఉంది. హిందూస్థానీ గాయని మున్నాభాయ్ ఇందులో బెంగాలీ పాటలు పాడారు. నృత్యాలు కూడా ఈ సినిమాల్లో ఉన్నాయి... ఇదో వింతగా ఆ రోజుల్లో చెప్పుకునే వారు. మన దేశపు తొలి టాకీ ‘ఆలమ్ ఆరా’ సెలెక్ట్ టూరింగ్ టాకీస్ అనే ముంబై సంస్థ దీన్ని నిర్మించింది. మొదటి టాకీ చిత్రం‌ను ప్రదర్శించిన వారిని చూసిన జనం ‘టాకీ మనుషుల’ని పిలిచేవారు.

1935లో టాకీల నిర్మాణం పెరిగింది. ‘మూకీ’లు మూగబోయాయి. అంతకుముందు 1931లో హిందీ (అలం అరా, అర్దేష్ ఇరానీ నిర్మాత) తెలుగు (భక్త ప్రహ్లాద) తమిళ (కాళిదాస)లు విడుదలైనాయి. తెలుగు, తమిళ చిత్రాల సారధి హెచ్.ఎం. రెడ్డి, ‘భక్త ప్రహ్లాద’ తొలి తెలుగు సినిమాగా ముద్ర వేసుకుంది. తర్వాత ‘పాదుకా పట్టాభిషేకం’ ‘శకుంతల’ చిత్రాలు విడుదలైనాయి. ముంబైకి చెందిన సాగర్ మూవీ టోన్ వారు వీటికి నిర్మాతలు. 1934లో తెలుగు టాకీ నిర్మాణం దక్షిణ భారతదేశానికి వచ్చేసింది. సి.వి. దాసు వేల్ పిక్చర్స్ స్టూడియో నెలకొల్పి ‘సీతాకళ్యాణం’ నిర్మించారు. ఇదీ ‘సినిమా’ కథ ప్రస్తుతం ‘సినిమా’ ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. ‘ఏది సులువుగా సాధ్యం కాదు సుమీ’ అనే కవివాక్కుకు ‘సినిమా’ ఓ దృశ్య సాక్ష్యం.

భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Also Read: హిందీ సినిమాల్లో నూతన ఒరవడి.. హృషికేష్ ముఖర్జీ

Advertisement

Next Story