- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
31 మంది ఎంపీలు ఏం ఉద్ధరించారు?
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేంద్ర బేజేపీ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రం పట్ల ఇంత వివక్ష చుపిస్తూ, ద్రోహం చేసినా 22 మంది పార్లమెంట్ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు మొత్తం 31 మంది వైసీపీ ఎంపీలు ఉండి కూడా పార్లమెంట్‌లో కనీసం నోరు విప్పలేదంటే ఏం ఉద్దరించారని? కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నా అధికార పార్టీ ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ తీవ్రంగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. ఉత్తుత్తి అభ్యర్ధనలు, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కాదు.. ఫలితం చూపండి. మీరు మెడలు వంచడం కాదు, కేంద్రం మెడలు వంచండి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం జరిగింది. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు కేటాయించకపోగా విదిలింపులతో రాష్ట్రానికి బిచ్చం వేశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అనేక హామీలను కూడా కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ప్రత్యేక హోదా, వెనుకబడ్డ జిల్లాల ప్యాకేజీ, రైల్వే జోన్ ఊసే లేదు. కేంద్ర విద్యాసంస్థలకు గతేడాది కేటాయించిన నిధులకు కోతపెట్టారు. ఆర్థిక సంఘం నిర్దేశించిన ప్రకారం రాష్ట్రానికి నిధులు బదిలీలలోను భారీ కోతలు పెట్టారు. మొత్తంగా ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేంద్ర బేజేపీ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రం పట్ల ఇంత వివక్ష చుపిస్తూ, ద్రోహం చేసినా 22 మంది పార్లమెంట్ సభ్యులు, 9 మంది రాజ్యసభ సభ్యులు మొత్తం 31 మంది వైసీపీ ఎంపీలు ఉండి కూడా పార్లమెంట్‌లో కనీసం నోరు విప్పలేదంటే ఏం ఉద్దరించారని? వీరిని ఎంపీలుగా పంపిన ప్రజలు విశ్లేషించుకోవాలి. పార్లమెంట్‌లో రాష్ట్ర సమస్యలు, ప్రజాసమస్యలపై పోరాడి సాధిస్తారని ప్రజలు ఆశించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇవ్వక పోయినా ఏపీ ముఖ్యమంత్రిపై వున్న కేసుల కోసం రాజీపడి రాష్ట్ర ప్రయోజనాలు ఒక్కొక్కటి తాకట్టు పెట్టారు. రాష్ట్రానికి రావాల్సినవి ఏమి ఇవ్వకపోయినా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిలదీసి ఎరుగరు. పైగా రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కేంద్ర బడ్జెట్ అందరికీ ఉపయోగపడేలా ఉందని కితాబునిచ్చారు.
విభజన చట్టంలో ఉన్నా విస్మరించి
విభజన చట్టాలను ఆమోదించి పదేళ్లు కావస్తున్నా కేంద్ర బడ్జెట్‌లో హామీల ప్రస్తావన కానీ, నిధుల కేటాయింపులు గానీ జరగలేదు. పోలవరం, అమరావతి నిర్మాణానికి నిధులు, విశాఖ ఉక్కుపైనా కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. పోలవరం రాష్ట్రానికి చాలా కీలకమైన భారీ నీటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు భరించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 4785 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2023-24 బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కానీ త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందటానికి కర్ణాటకలోని అప్పర్ భద్ర నీటి ప్రాజెక్టుకు మాత్రం బడ్జెట్‌లో ఏకంగా రూ. 5,300 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తుంగభద్ర దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతానికి ప్రమాదం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.35 వేల కోట్లు అవసరం కానుంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని, వంద శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ పదేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులను ఇవ్వకుండా మోడీ సర్కార్ మడత పేచీలు పెడుతున్నది. కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల 75 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.
కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదా అంశంగానీ, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపులు లేవు. గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ మినహా మరే విద్యా సంస్థకు కేటాయించలేదు. వాటికి కూడా అరకొర నిధులే విదిలించారు. విశాఖ రైల్వే జోన్, ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ ఐటి, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో, ఎయిమ్స్, రాజధాని నిర్మాణానికి నిధుల ఊసేలేదు. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ మెట్రోరైళ్ల నిర్మాణానికి ఎలాంటి కేటాయింపులు లేవు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన చట్టబద్ధ హామీలు యిచ్చి పదేళ్లు అవుతున్నా ఇవి ఆచరణకు నోచుకోవడంలేదు. ఈ బడ్జెట్‌లో కూడా వీటి గురించి ఒక్క మాట కూడా లేదు. రైల్వే లైన్లు అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త రైల్వే మార్గాల ప్రతిపాదనలు లేవు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుపై ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ రెండేళ్ళ క్రితమే రూపొందించినా ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్‌ను కూడా కేంద్ర బీజేపీ సర్కార్ రద్దు చేసింది. కొత్త జోన్ రాకపోగా ఉన్న డివిజన్ కోల్పోవాల్సి వచ్చింది. గత తొమ్మిదేళ్ళుగా ఎదురు చూస్తున్న కడప స్టీల్‌ప్లాంట్, దుగ్గరాజుపట్నం పోర్టుల నిర్మాణాలకు ఈ బడ్జెట్‌లో కూడా మొండి చెయ్యి చూపారు. నిధుల కేటాయింపు దేవుడెరుగు కనీస ప్రస్తావన కూడా లేదు. వీటికి కూడా పూర్తిగా పంగనామాలు పెట్టినట్లే. ఇక విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేసే దిశగానే వేగంగా పావులు కదుపుతున్నది కేంద్రం. రెండున్నరేళ్లుగా విశాఖ స్టీలు ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నా అధికార పార్టీ ఎంపీలు కానీ,ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ తీవ్రంగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అనుమతించేది లేదని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పాల్సిన 31 మంది ఎంపీలు, సీఎం జగన్ మౌనంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు విదిలింపులతో సరిపెట్టారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు మాత్రం వరాల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌పై చూపిన సవతి తల్లి ప్రేమ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2022-23 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.56.66 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల్లో రూ.13.08 కోట్లకు తగ్గించింది. హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో పెట్టుబడులకు రూ.100 కోట్లు కేటాయించి రూ.10 కోట్లకు కోతపెట్టారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీకి రూ.150 కోట్లు కేటాయించి రూ.100 కోట్లకు తగ్గించారు. పోర్ట్ ట్రస్టుకు రూ.207.99 కోట్లు ప్రతిపాదించి రూ.155.39 కోట్లకు తగ్గించారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో రూ.910 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించి రూ.603 కోట్లకు తగ్గించారు. 2022-23లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు కింద ఏఐఐబీ నిధులు రూ.1,500 కోట్లు కేటాయించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో రూ.655 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. రాష్ట్ర వాటా సకాలంలో విడుదల చేయకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లి బిల్లులు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రోడ్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. పట్టణాల్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు కోసం గత బడ్జెట్‌లో రూ.1,200 కోట్లు కేటాయిస్తే, రాష్ట్రం 389 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. దీంతో కేంద్రం ఇప్పుడు రూ. 200 కోట్లే కేటాయించింది. రోడ్ల పునర్నిర్మాణానికి గత ఏడాది రూ.979 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో కేవలం రూ.247 కోట్లు మాత్రమే కేటాయించారు. మండల కనెక్టివిటీకి సంబంధించి లింక్ రోడ్ల నిర్మాణానికి గత బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.884 కోట్లు కేటాయిస్తే. ఈ బడ్జెట్ లో కేవలం రూ.248 కోట్లు ఖర్చు చేశారు. అందుకే బడ్జెట్‌లో రూ.209 కోట్లే కేటాయించారు.
కేంద్రం మెడలు వంచండి
ఈ 44 నెలలలో ఏపీ సీఎం జగన్ దాదాపు 25 సార్లు ఢిల్లీ వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి అవే అభ్యర్ధనలతో తేదీలు మార్చి అవే ప్రకటనలు విడుదల చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏమి సాధిస్తున్నారని రాజకీయ వర్గాలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చేస్తున్న మోసాన్ని ఎండగట్టకుండా, నిలదీయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం కేంద్ర పెద్దల వద్ద సాగిలపడి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయని ఊదరగొట్టిన జగన్ రెడ్డి నేడు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదు? అదనపు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతి కోసం, తనపై సీబీఐ, ఈడీ కేసులను తప్పించుకోవడం కోసం, బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులను సర్దుబాటు చేసుకునేందుకే ప్రధాని మోదీతో, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమవుతున్నారన్న చర్చకూడా జరుగుతోంది. బీజీపీతో పోరాడే పరిస్థితి లేక రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.
మోడీ ప్రభుత్వ దన్నుతో లాభాల్లో వున్న గంగవరం పోర్టును కారు చౌకగా అదానీ, అంబానీలకు, గనులు, ఇతర సహజ వనరులను కట్టబెట్టారు. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించకుండా జగన్ ప్రభుత్వం ఇదే విధంగా సాగిలపడితే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి? పార్లమెంట్ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందని అంగీకరిస్తూనే ప్రతి బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు కమలనాధులు. ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోవడం ప్రజాద్రోహం కాదా? ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టంగా అర్థం అవుతున్నా కేంద్రానికి మోకరిల్లి జగన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డికి సీఎం హోదా దక్కింది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కరలేదా? ఉత్తుత్తి అభ్యర్ధనలు, ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కాదు.. ఫలితం చూపండి. మీరు మెడలు వంచడం కాదు, కేంద్రం మెడలు వంచండి.
నీరుకొండ ప్రసాద్
9849625610
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ ౭౯౯౫౮౬౬౬౭౨
ఇవి కూడా చదవండి : ఉద్యోగుల తొలగింపు... సంక్షోభాన్ని పరిష్కరిస్తుందా?