సగం కూడా లేని సమానత్వం

by Ravi |   ( Updated:2023-03-07 18:45:59.0  )
సగం కూడా లేని సమానత్వం
X

కండ్లకు గుడ్డను కట్టి న్యాయదేవతగా నిలబెట్టారు స్త్రీని. ఎంత భారమైనా ఓపికతో మోసే భూమినీ తల్లిగా చేసి కొలిచారు. పురాణాలు, ఇతిహాసాలలో శక్తి స్వరూపిణి అని, సర్వశక్తి మంతురాలనీ కీర్తనలు, వర్ణనలతో పొగడ్తలను వెల్లువెత్తించారు. కానీ స్త్రీని నిజజీవితంలో బలహీనురాలుగా, రెండోరకం పౌరురాలుగానే చూడటం అనేక తరాలుగా కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థగా చెప్పుకునే నేటి ఆధునికయుగంలోనూ అనేక అన్యాయాలకు అసమానతలకు, అవమానాలకు మహిళ గురవుతూనే ఉంది. న్యాయదేవత స్త్రీమూర్తి అయినా న్యాయస్థానాల్లో స్త్రీకి నిలువెత్తు అన్యాయం జరగటాన్ని చూస్తున్నాం. సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే న్యాయస్థానంలో కాఫ్‌ పంచాయతీలో పెద్దమనిషి వలె మాట్లాడటం గమనిస్తే మహామహా ఉన్నత విద్యావంతుల మెదళ్ళలో స్త్రీకి ఉన్న స్థానమేమిటో అర్థమవుతుంది. నమ్మించి, మోసగించి అత్యాచారానికి పాల్పడిన నేరస్తున్ని పట్టుకుని 'నువ్‌ అత్యాచారం చేసిన అమ్మాయిని పెండ్లి చేసుకుంటావా లేదంటే ఉద్యోగాన్ని కోల్పోయి, శిక్షననుభవిస్తావా! నెలరోజుల్లో తేల్చుకోమని ఉచితమైన సలహాను నిందితుడి ముందుపెట్టారు. అతనికి అప్పటికే పెండ్లయి ఉన్న విషయాన్ని కూడా విస్మరించి మోసం, లైంగికదాడి మొదలైన నేరాలకు పెళ్లిని శిక్షకు ఒప్పుకుంటావా అని మగవాని నిర్ణయానికి న్యాయం ఎదురు చూడటమంటే, ఇంకా మన చట్టాలూ, న్యాయాలూ, మానసిక దౌర్భాగ్యాలు ఎంత హీనంగా అఘోరిస్తున్నాయో అర్థమవుతుంది. నేరం చేసిన వాడికి ఒక నెల విడుదల గడువు నివ్వటం న్యాయమూర్తి ఔదార్యానికి మచ్చుతునక.

పురుషుల ఆలోచనల సారమిదే

ఇది ఒక న్యాయమూర్తి మెదడులోని ఆలోచన మాత్రమే కాదు. మెజారిటీ పురుష పుంగవుల ఆలోచనల సారం కూడా అలానే ఉంటుంది. ఇంతకాలమూ అడుగున ఎక్కడో తచ్చాడుతున్న భావాలు నేడు పురివిప్పి ఎగరటానికి ప్రేరేపితులెవరో మనకు తెలుసు. అవమానించి ఆలిని చూలింతగా ఉన్నప్పుడే నిర్దయగా అడవుల్లో వొదిలివేసిన ఆదర్శమూర్తుల జపతపోధనుల పాలనలో, 'సతి' పేర భర్త చితిలోనే భార్య కాలిపోవాలని, అదే ఈనేల సంప్రదాయమనీ ఢంకాభజాయించి చెబుతున్న సనాతన ధర్ముల ఏలుబడిలో, స్త్రీలు వంటింటికీ, పిల్లలు కనడానికి మాత్రమేనని నిర్లజ్జగా ధర్మాలు వల్లిస్తున్న ప్రచారకులున్న సమాజాన ఇంతకన్నా గొప్పనైన ప్రభావాలు ఏముంటాయి ఇక చెప్పుకునేందుకు?

అన్నీ మతాచారాల్లోనూ స్త్రీ బానిసే..

'కార్యేషు దాసీ.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాతా.. రూపేచ లక్ష్మీ.. శయనేషు రంభా.. క్షమయాధరిత్రి..' అని కొలవడంలోనే అన్ని విధాలుగా సేవలను మగపురుషులకు అందించాలన్న లక్ష్య నిర్దేశనం ఉంది. అంటే స్త్రీ ఏమేమిచేయాలో, ఎలా చేయాలో, దాసిగా ఎలా ఉండాలో ధర్మసాహిత్యంలో పొందుపరచారు గానీ పురుషుడు స్త్రీపట్ల ఎలా ఉండాలో, ఏమేమిచేయాలో ప్రచారంలో ఎక్కడా కనిపించదు. ''యత్రనార్యస్తు పూజ్యంతే, రమంతే తత్రదేవత'' అంటూ ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందంతో సంచరిస్తారని పురుషుని కేంద్రంగానే వ్యాఖ్యానించారు. దేవతల సంతోషం కోసం. స్త్రీలకు స్వతంత్రమైన వ్యక్తిత్వాలున్నాయన్న గుర్తింపు మనకెక్కడా కానరాదు. 'నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అని స్పష్టంగానే చెప్పిన దాఖలాలు ఉన్నాయి. వైదిక మత ధర్మాచారాలలోనే కాక ప్రపంచంలోని అన్ని మతాచారాల్లోనూ స్త్రీని బానిసగానే చూశారు. పురుషుని చాటున అతని ఆధారంగా బతికే జీవిగానే పరిగణించారు. మహామహా ఉద్ధండులు, పండితులు పెద్దలున్న కౌరవసభలోనే ఒక మహిళను వివస్త్రను చేయబోతే ఒక్క గొంతూ పెగలకపోవడాన్ని మహాభారత కథలో మనం చూశాం. నవీన భారతంలోనూ ఆ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి కొనసాగుతూనే ఉంది.

ఈ నిస్తేజమే హానికరం

మనువాద భావజాలాన్ని పుణికిపుచ్చుకుని పరిపాలన చేస్తున్న వారి ఆచరణ, మధ్యయుగాల తరహా సమాజాన్ని నిర్మించాలన్న వారి కోరికల ప్రతిఫలమే నేడు జరుగుతున్న దుర్మార్గాల పట్ల నిస్తేజంగా ఉండటం. నిర్లిప్తంగా వ్యవహరించడం. ఆకాశంలో సగం, అవనిలో సగమని కవితాత్మకంగా ఎన్ని చెప్పినా సగం కూడా లేని సమానత్వమే కనపడుతుంది. అయితే శతాబ్దాలుగా తమపై జరుగుతున్న దాడిని, అణచివేతను స్త్రీలు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. తరతమ స్థాయిల్లో నిరసన కొనసాగుతూనే ఉంది. హక్కులు, సమానత అడుక్కుంటే వచ్చేవికావు. పోరాడి గెలుచుకోవాలి. ఇప్పటికున్నవి కూడా అలాపొందినవే. ''ఎప్పుడైతే స్త్రీ పురుషుల మధ్య శ్రమ విభజన జరిగిందో అప్పుడే స్త్రీ దోపిడీకి గురైందని, మొదటివర్గ విభజన అదేనని'' ఎంగెల్స్‌ చెప్పిన సత్యం ఇప్పటికీ రుజువవుతూనే ఉంది. దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించి, పాలనలో సమాన భాగస్వామ్యాన్ని పొంది, ఒక సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఈ నేలన తీసుకువచ్చి సమసమాజాన్ని నిర్మించుకోవడమే స్త్రీ విముక్తికి దోహదం చేస్తుంది. అప్పటివరకు ఎదురయ్యే అన్ని ఆటంకాలపై నారి నిత్యయుద్ధభేరి మోగిస్తూనే ఉండాలి. హక్కుల కోసం ఉద్యమించాలి. అందుకు మహిళా దినోత్సవాలు, సమరాలకు శంఖారావాల్ని పూరించాలి. స్త్రీ సమానతను కోరుకునే ప్రతి గొంతూ స్వరం కలపాలి. కలసి నడవాలి.

చినకాళయ్య

9640355036

Advertisement

Next Story