దేశ చరిత్రలో చీకటి రోజు ‘ఎమర్జెన్సీ’

by Ravi |   ( Updated:2023-06-25 00:15:51.0  )
దేశ చరిత్రలో చీకటి రోజు  ‘ఎమర్జెన్సీ’
X

భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే 1975 జూన్ 25న ఒక ‘చీకటి రోజు’గా నిలిచిపోయింది. ఇదే రోజున నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశంలో అంతర్గత అస్థిరతను, అశాంతిని కారణంగా చూపుతూ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించి, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కారు. ఇదే రోజున ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు హేమాహేమీ నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పేయి, మొరార్జీ దేశాయ్, బిజూ పట్నాయక్, చంద్రశేఖర్ లాంటి మరెందరో ప్రముఖులతో సహా లక్ష మందికి పైగా ప్రజలను నిర్బంధించి జైళ్లలో పెట్టారు. అంతేకాకుండా ఎన్నికలు వాయిదా వేయడం, ప్రభుత్వ వ్యతిరేక నిరసననలను ఉక్కుపాదంతో అణచివేయడం, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చట్టాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం జరిగింది. ‘ఎమర్జెన్సీ’ అంటే ఇందిరా గాంధీకి ఒక పర్యాయపదంగా మారిపోయింది. 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీ 1977 మార్చ్ 21 వరకు అంటే 21 నెలల పాటు అమలులో ఉంది. నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశంలో అంతర్గత అశాంతిని కారణంగా ఉటంకిస్తూ అధికారికంగా ఎమర్జెన్సీని జారీ చేశారు.

ఎమర్జెన్సీ విధింపునకు కారణం

దేశంలో ప్రబలంగా నెలకొని ఉన్న ‘అంతర్గత అస్థిరత, అశాంతి’ అత్యవసర పరిస్థితి విధింపునకు కారణంగా ఇందిరా గాంధీ పేర్కొన్నప్పటికీ, వాస్తవంగా 1971లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఆమె అవకతవకలకు పాల్పడినట్లు మోపబడిన ఆరోపణలపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు 1975లో ఆమెను దోషిగా నిర్ధారించి పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడమే కాక తదుపరి 6 సంవత్సరాల పాటు ఎన్నుకోబడిన ఏ పదవిని నిర్వహించలేరని తీర్పునివ్వడం కారణంగానే ఆమె ఎమర్జెన్సీని ప్రకటించారన్నది అధిక సంఖ్యాకుల అభిప్రాయం.

జాతీయ ఎమర్జెన్సీ

దేశవ్యాప్తంగా అస్థిరత, అంతర్గత అశాంతి ఏర్పడి దేశ భద్రతకు సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు, దేశంపై బాహ్య దురాక్రమణ (రెండు దేశాలు పరస్పరం సాయుధ బలగాలతో దాడి చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తే అది యుద్ధం. కానీ ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండా ఒక దేశం మరో దేశంపై సాయుధ బలగాలతో దాడికి దిగితే అది బాహ్య దురాక్రమణ) జరిగినప్పుడు, దేశంలో సాయుధ తిరుగుబాటు (44వ చట్ట సవరణ ద్వారా ‘అంతర్గత అశాంతి’ బదులుగా ‘సాయుధ తిరుగుబాటు’గా మార్చారు) తలెత్తినప్పుడు, రాష్ట్రపతి భారత రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన విశేషాధికారాలను వినియోగించుకుని 352 అధికరణం ప్రకారం జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. జాతీయ ఎమర్జెన్సీ అమలులో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలపై చట్టాలు రూపొందించే అదనపు అధికారాలతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను (ప్రాణ, వ్యక్తిగత స్వేచ్ఛ మినహాయించి) ఉపసంహరించే విశేషాధికారాలు సంక్రమిస్తాయి. జాతీయ ఎమర్జెన్సీ దేశవ్యాప్తంగా కానీ లేదా కేవలం ఒక ప్రాంతంలో కానీ అమలు అయ్యేలా విధించవచ్చు. ప్రధాన మంత్రి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి సిఫారసు చేసినప్పుడు మాత్రమే జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించవలసి ఉంటుంది. ఈ తీర్మానాన్ని ఆమోదించడానికి ప్రత్యేక సంఖ్యా బలం (స్పెషల్ మెజారిటీ) తప్పనిసరి. తీర్మానం ఆమోదం పొందిన తరువాత “అత్యవసర పరిస్థితి” గరిష్టంగా ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది.

లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ పాత్ర

లోక్ నాయక్ (ప్రజల నాయకుడు) గా అత్యంత ప్రజాదరణ పొందిన జయప్రకాష్ నారాయణ్ బీహార్‌లో 1975కి ముందు ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక నిరసనలు నిర్వహించారు. ఆమె నేతృత్వంలో గాడితప్పిన వ్యవస్థను సంస్కరించడానికి, బలీయంగా నాటుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాతాలను పారద్రోలడానికి , ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఆయన తీవ్రంగా ఉద్యమించారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో గెలవడానికి ఇందిరా గాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏకీభవించిన అలహాబాద్ హైకోర్టు 1975లో ఇందిరా గాంధీని దోషిగా నిర్ధారించి 6 సంవత్సరాల పాటు ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాన్ని నిర్వహించకుండా నిషేధించింది. తత్ఫలితంగా లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నిక రద్దయింది. ఈ నిర్ణయం తర్వాత, ఇందిరా గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రధానమంత్రి పదవిలో కొనసాగడంతో జయప్రకాశ్‌ నారాయణ్‌ రామ్‌లీలా మైదాన్‌లో నిరసనలు ఉధృతం చేశారు. దీంతో ప్రధానమంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జీవత్రామ్ కృపలానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, విజయరాజే సింధియా, అరుణ్ జైట్లీ, జై కిషన్ గుప్తా సత్యేంద్ర నారాయణ్ సిన్హా, గాయత్రీ దేవి, జైపూర్‌లోని డోవజర్ రాణి, ఇతర నాయకులను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వెంటనే అరెస్టు చేశారు.

ఎమర్జెన్సీ తదుపరి ఎన్నికల్లో ఇందిర పరాజయం

1975లో జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరా గాంధీ పరాజయం పొందడమే కాక భారత జాతీయ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. కాగా జయప్రకాశ్ నారాయణ్ చొరవతో ‘జనతా పార్టీ’గా అవతరించిన భావసారూప్యత గల జనసంఘ్ లాంటి తదితర పార్టీలు మొరార్జీ దేశాయి ప్రధాన మంత్రిగా మొట్టమొదటిసారి ‘కాంగ్రెసేతర’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ భాగస్వామ్య పార్టీల మధ్య అనైక్యత కారణంగా 1980 పార్లమెంట్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆమె మరోసారి తిరిగి ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు.

యేచన్ చంద్ర శేఖర్

మాజీ రాష్ట్ర కార్యదర్శి

ది భారత్ స్కౌట్స్ & గైడ్స్, తెలంగాణ

8885050822

Advertisement

Next Story

Most Viewed