- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగనన్న తెచ్చిన కరెంట్ కష్టాలు!
కరెంట్ చార్జీలు బాదుడే బాదుడు.. అన్నొస్తున్నాడని చెప్పండి.. గత ఎన్నికల సమయంలో జగన్ రెడ్డి పెట్టిన గావుకేకలు... ఇది విని ప్రజలు నిజమేనని నమ్మారు. ఇప్పుడు షాకుల మీద షాకులు ఇస్తుంటే గాని నిజస్వరూపం తెలియలేదు. ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ముఖ్యమంత్రి అవగాహనలేమి తోడవడంతో గత నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం, చలికాలంలోనే పవర్ హాలిడేలు ప్రకటిస్తే.. వేసవిలో కరెంట్ కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఊహించవచ్చు. ఒకవైపు కరోనా, మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పారిశ్రామిక రంగం నష్టాల ఊబిలో కూరుకుపోయింది. దీనికితోడు ఎగుమతులు లేకపోవడంతో భారీ పరిశ్రమలు మరింత సంక్షోభంలో పడ్డాయి. ఇప్పుడు పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తున్నారు. తాత్కాలింగా పవర్ హాలిడేలపై వెనక్కి తగ్గినా ముందుంది ముసళ్ల పండగ.
జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ హాలిడేలు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. గతేడాది కూడా పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటించారు. దీని ప్రభావం ఉద్యోగ, ఉపాధి రంగాలపైనా పడింది. పవర్ హాలిడేలు, మౌలిక సదుపాయాల లేమితో కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోతున్నాయి.
అమ్మడం కాదు కొంటున్నారు!
రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడం వల్లే కరెంటు కష్టాలు ఎదురవుతున్నాయి. పక్క రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే పరిస్థితి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసే స్థాయికి దిగజార్చారు. సింగరేణి నుంచి సకాలంలో బొగ్గు కొనుగోలు చేసి ఉంటే టన్ను రూ. 6,500కు దొరికేది. ముడుపుల కోసం ఆస్ట్రేలియా నుంచి అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గును రూ.19,500 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో ఉన్న రాష్ట్రాన్ని 2018 నాటికి 19 వేల మెగావాట్లకు పెంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారు. ఇతర రాష్ట్రాలకు అమ్మే స్థాయికి చేరాం. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు పెంచలేదు. సౌర, పవన విద్యుత్ రంగంలో రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి, 4 అల్ట్రా మెగా సోలార్ పార్కులు అనంతపురంలో 2, కడప, కర్నూలులో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేశారు. రాయలసీమలో 13 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నాడు దేశంలోనే మొట్ట మొదటిసారిగా, ఆసియాలోనే అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ 1000 మెగావాట్లను కర్నూలులో స్థాపించారు.
సోలార్, విండ్ పవర్ నిర్వీర్యం
నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం అదనంగా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో జగన్ రెడ్డి చేసింది శూన్యం. పైగా గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను రద్దు చేశారు. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల పీపీఏలను రద్దు చేయొద్దని అందరూ మొత్తుకున్నా వినలేదు. పీపీఏలలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసినా పెడచెవిన పెట్టారు. అంతే కాదు.. విద్యుత్ కంపెనీలను సమీక్షలకు పిలిచి ధరలు తగ్గించాల్సిందేనని బెదిరించారు. పీపీఏల విషయంలో జగన్ రెడ్డి వైఖరిని ఒక్క విద్యుత్ రంగ నిపుణుడు కూడా సమర్థించని పరిస్థితి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా ఈ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడలేదు. దేశంలో అందరికీ నిరంతర విద్యుత్తు అన్న కేంద్రం లక్ష్యానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. పాత ఒప్పందాలను రద్దు విధానాలతో కొత్త పెట్టుబడులకు గండి కొట్టింది. విద్యుత్ రంగంలో పెట్టుబడుల పెంపుదల సానుకూల విధానాలకు గండి కొట్టింది. సోలార్ పార్కులుపై దాడులు చేయించారు. మొత్తానికి సోలార్, విండ్ పవర్‌లను పూర్తిగా నిర్వీర్యం చేశారు.
బినామీ కంపెనీలకు దోచిపెట్టి...
2019-22 మధ్య బహిరంగ మార్కెట్లో రూ.12,200 కోట్లకు విద్యుత్ కొనుగోళ్లు చేశారు. థర్మల్ పవర్ స్టేషన్లలో సామర్ధ్యానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. ఇటీవల ఎన్టీపీఎస్‌లోని 6 యూనిట్లలో ప్రొడక్షన్ బ్రేక్ డౌన్ అయ్యింది. బినామీ కంపెనీల నుంచి నాసిరకం విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయడమే బ్రేక్ డౌన్‌కు ప్రధాన కారణం. గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పేరుతో జగన్ రెడ్డి మరో రూ.30 వేల కోట్లు భారాలు వేయడానికి రంగం సిద్ధం చేశారు. కమీషన్ల కోసం జగన్ రెడ్డి తన బినామీ కంపెనీలైన షిరిడీసాయి, హిందూజాలకు దోచిపెడుతూ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతూ రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల భవిష్యత్తులో క్రాప్ హాలిడేలు ప్రకటించే రోజు వస్తుంది. రూ.61 వేలు విలువ చేసే ట్రాన్స్ ఫార్మర్‌ను రూ.1.30 లక్షలకు పెంచి కొన్నారు. విద్యుత్ ప్లాంట్లను సక్రమంగా వినియోగించుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. గత ప్రభుత్వ పాలనలో 36 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఇస్తే జగన్ రెడ్డి నాలుగేళ్లలో కేవలం 8 లక్షలు మాత్రమే ఇచ్చారు. గత ప్రభుత్వంలో 3.26 లక్షల మోటార్ కనెక్షన్లు ఇస్తే జగన్ రెడ్డి కేవలం లక్షా 17 వేలు మాత్రమే ఇచ్చారు.
కరెంటు కోతల్లో రికార్డు!
వేళాపాళలేని విద్యుత్ కోతలతో వృద్ధులు, పసిపిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సబ్ స్టేషన్ల ముందు పార్టీలకతీతంగా పెద్దఎత్తున వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో రోగులకు కూడా కరెంట్ కష్టాలు తప్పడం లేదు. పలుచోట్ల 15 గం.ల నుంచి 18 గంటల వరకు కరెంటు కోతలు విధిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల ఓల్టేజీ సమస్య కూడా తీవ్రంగా ఉంది. అనధికారికంగా ప్రతిరోజూ పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఆక్వా పరిశ్రమకు, గృహావసరాలకు విద్యుత్ కోతలు గంటలకొద్దీ విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో రైతులకు ఎడాపెడా కోతలు పెడుతున్నారు. దీంతో కళ్లముందే పచ్చని పైర్లు ఎండిపోతున్నాయి. మరోవైపు గృహ వినియోగదారులకు కరెంట్ బిల్లు ముట్టుకుంటేనే షాక్ తగిలేలా ఉంది. ఎడాపెడా అప్పులు తెచ్చి విద్యుత్ వినియోగదారులపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాలుగేళ్లలో రూ.57 వేల కోట్ల భారాలు మోపారు. 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారానే ప్రజలపై రూ.18వేల కోట్ల భారం పడింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపై రూ.3,082 కోట్లు వసూలు చేస్తున్నారు.
కొనకుండానే స్థిర చార్జీల చెల్లింపు!
హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయకుండానే స్థిర ఛార్జీల పేరుతో ఆ కంపెనీకి రూ.2,834 కోట్లు చెల్లించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం అవినీతికి తార్కాణం. ఈ అప్పు చెల్లించడానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ లిమిటెడ్ నుంచి 9.5 శాతం వడ్డీతో అప్పు తీసుకోవాలని డిస్కంలను ప్రభుత్వం ఆదేశించడం దుర్మార్గం కాదా? రూ. 2,834 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదని జ్యుడీషియల్ ప్రివ్యూలో న్యాయనిపుణులు చెప్పినప్పటికీ ముందుకే వెళ్తున్నారు. దీనికి ప్రధానకారణం హిందుజాతో క్విడ్ ప్రోకోకు పాల్పడమే. ఈ విధంగా జగన్ రెడ్డి అసమర్థ విధానాలతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఇప్పటికైనా ఈ కారుచీకట్లను తొలగించేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కేంద్రం చౌకగా ఇచ్చే విద్యుత్ కొనుగోలు చేయాలి. బహిరంగ మార్కెట్ లో అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయడం నిలిపివేయాలి. అదనపు విద్యుత్ ఉత్పాదనకు తగు చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి గ్యాస్ స్టేషన్స్ రాబట్టాలి. విద్యుత్ సంక్షోభం ఇలానే కొనసాగితే పారిశ్రామిక, వ్యవసాయ రంగాలు కుదేలైపోతాయి. ప్రభుత్వం విద్యుత్ రంగ నిపుణులు, మేధావుల సూచనలు పాటించి అవినీతి రహితంగా వ్యవహరిస్తే బాగుంటుంది. బొగ్గు నిల్వలు పెంచుకుని డిమాండుకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలి. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం ఆపాలి.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్
99497 77727