ప్రమాదంలో విద్యా ప్రమాణాలు

by Ravi |   ( Updated:2022-09-03 14:53:15.0  )
ప్రమాదంలో విద్యా ప్రమాణాలు
X

ఇప్పటికి అయినా దిద్దుబాటు చర్యలు అవసరం. బోధనా సిబ్బందికి డిజిటల్ శిక్షణ ఇప్పించాలి. విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించాలి. అవకతవకలకు పాల్పడినవారిని జవాబుదారీగా మార్చే ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే మరుగుదొడ్లు, కరెంటు, మంచినీటి వసతి కల్పించాలి. సరిపడా తరగతి గదులు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి. మంచి పనితీరు కనబరిచిన ఉపాధ్యాయులకు, విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కాలానుగుణంగా విద్యారంగంలో సంస్కరణలకు చోటు కల్పించాలి.

కొవిడ్ కారణంగా ప్రత్యక్ష బోధనకు దూరమైన విద్యార్థులు చాలా వరకు ప్రాథమిక భావనలు మర్చిపోయారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మెజారిటీ విద్యార్థులు చదవడం, రాయడం, గుణించడం వంటి కనీస అభ్యసనల సామర్థ్యాలలో వెనుకబడ్డారు. సుదీర్ఘకాలంగా బడులు మూతపడడంతో గ్రామీణ భారతంలో 37 శాతం పట్టణాలలో 19 శాతం విద్యార్థులు చదువుకు దూరం అయ్యారు. మిగిలిన పిల్లల మీదా కరోనా పెను ప్రభావం చూపింది. మరోపక్క పాఠశాల విద్యా వ్యవస్థ పట్టు తప్పుతున్నది.

ప్రతి పిల్లవాడిని పాస్ చేయించి, పైకి పంపి కాగితాలు మార్చుతున్నారు కానీ, ఉపాధ్యాయులు పిల్లవాడి సూక్ష్మ ప్రగతిని నిరంతరం మూల్యాంకనం చేయలేకపోతున్నారనే అపవాదు ఉంది. ఇలాంటి పరిస్థితులలో గత ఏడాది నవంబర్‌లో చేపట్టిన జాతీయ సాధన సర్వే బిత్తరపోయే చదువులను, నివ్వెరపోయే నిజాలను బయటపెట్టింది. ముఖ్యంగా మూడు, ఐదు, ఎనిమిది, పదో తరగతి విద్యార్థులకు పఠన,రాత గణిత నైపుణ్యాలు బాగా తగ్గిపోయాయని నివేదికలు తేటతెల్లం చేశాయి.

అదే అసలు సమస్య

చాలా రాష్ట్రాలలో విద్యార్థులకు కనీస అభ్యసన ప్రమాణాలు క్షీణించాయని సర్వే తెలిపింది. దేశంలో ఉన్న 720 జిల్లాలలోని 1,18,274 పాఠశాలల్లో 34,01,158 విద్యార్థులకు నిర్వహించిన 'న్యాస్' (నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే) ఫలితాలు ఈ దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. పంజాబ్, రాజస్థాన్, కేరళ, జమ్మూ-కాశ్మీర్, చండీఘర్ రాష్ట్రాలు మినహా తక్కిన రాష్ట్రాలలో ప్రమాణాల పతనం తీవ్రంగా ఉంది. తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఫలితాలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. కరోనా సమయంలో దేశంలో 33 శాతం విద్యార్థులు అభ్యసన సమస్యలు ఎదుర్కొన్నారని, 24 శాతం మందికి ఆన్‌లైన్ విద్య కొనసాగించడానికి డిజిటల్ ఉపకరణాలు అందుబాటులో లేవని న్యాస్ ఫలితాలు స్పష్టం చేశాయి.

చాలా రాష్ట్రాలలో మూడో తరగతి విద్యార్థులు చిన్నచిన్న పదాలు, గేయాలు సైతం చెప్పలేకపోయారు. త్రిభుజం, చతురస్రం, వైశాల్యాలను గణించడంలో, సంఖ్యలు గుర్తించి చదవడంలో ఐదవ తరగతి పిల్లలు విఫలమవుతున్నారు. ఎనిమిదో తరగతి పిల్లలు పటాలపై చారిత్రక ప్రదేశాలు, ప్రాంతాలను గుర్తించలేకపోతున్నారు. పదవ తరగతి వారు సైతం మాతృభాషలో, ఆంగ్లంలో పదాలు వాక్యాలను చదవలేకపోయారు. తెలంగాణలోనూ 4,701 పాఠశాలల్లో 1,45,420 మంది విద్యార్థులకు నిర్వహించిన సర్వేలో ఫలితాయి జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యాయి. 2017 ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి బాగా తగ్గాయి. మూడవ తరగతిలో జోగులాంబ గద్వాల, సంగారెడ్డి జిల్లాలు, ఐదో తరగతిలో జనగామ, గద్వాల, ఎనిమిదో తరగతిలో వరంగల్ అర్బన్, వికారాబాద్, పదవ తరగతిలో వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాలు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచాయి.

ఇందుకు కారణాలెన్నో

పాఠశాల విద్యలో ప్రమాణాలు దిగజారటానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ బడులలో కనీస సౌకర్యాలు లేకపోవడం, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులు లేకపోవడం, పాఠ్యాంశాలను దాటి బోధనాస్థాయి విస్తరించకపోవడం, ఉపాధ్యాయుల పనీతీరు, బోధనా నాణ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి అవసరమైన సంస్కరణలు తీసుకు రాకపోవడం, విద్యారంగం మీద ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేయకపోవడం, కరోనా వలన విద్యార్థులు బడికి దూరం కావడం మెదలైనవి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికి అయినా దిద్దుబాటు చర్యలు అవసరం.

బోధనా సిబ్బందికి డిజిటల్ శిక్షణ ఇప్పించాలి. విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించాలి. అవకతవకలకు పాల్పడినవారిని జవాబుదారీగా మార్చే ప్రయత్నాలు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే మరుగుదొడ్లు, కరెంటు, మంచినీటి వసతి కల్పించాలి. సరిపడా తరగతి గదులు, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలి. మంచి పనితీరు కనబరిచిన ఉపాధ్యాయులకు, విద్యా సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కాలానుగుణంగా విద్యారంగంలో సంస్కరణలకు చోటు కల్పించాలి. పాఠ్యాంశాలలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను చేర్చుతూ, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. అప్పుడే నాణ్యమైన బడి చదువు బంగారు భవితకు నారుమడి అవుతుంది.

అంకం నరేష్

UF RTI రాష్ట్ర కో-కన్వీనర్

6301650324

Advertisement

Next Story