- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్య సంక్షేమానికి ఉపకరణం
విద్యావంతులు నాయకత్వం వహించే సమాజం సమగ్రాభివృద్ధి దిశలో పయనిస్తుంది. పేదరిక నిర్మూలనలో విద్య పాత్ర వెలకట్టలేనిది. నిరక్షరాస్యులకు విద్యా గొడుగును అందిస్తే వారి జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి. 2018 గణాంకాల ప్రకారం ప్రపంచ వయోజనుల అక్షరాస్యత రేటు 86 శాతం ఉండగా, భారతదేశం రేటు 77.7 శాతంగా ఉంది. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 జాబితాలో నాలుగవ లక్ష్యంగా నాణ్యమైన విద్య (క్వాలిటీ ఎడ్యుకేషన్)కు పెద్దపీట వేశారు.
అనేక ఆటంకాలు
ఐక్యరాజ్య సమితి 2021 నివేదిక ప్రకారం కోవిడ్ వలన 2020లో 1.6 బిలియన్ పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారు. మధ్యాహ్న భోజనం పై ఆధారపడిన 369 మిలియన్ పిల్లలు పోషకాహారానికి దూరమయ్యారు. నిజానికి విద్యకు విఘాతం కలిగితే అన్ని రంగాలపై దాని దుష్ప్రభావం పడుతుంది. కరోనా విజృంభణతో దాదాపు 70 శాతం పిల్లల చదువులకు పూర్తిగా లేదా పాక్షికంగా ఆటంకం కలిగింది. పేదల విద్యార్జన కుంటుపడింది. దాదాపు 100 మిలియన్ పిల్లలు కరోనా కారణంగా రీడింగ్ స్కిల్స్ కోల్పోయారు. పాఠశాలల మూసివేత వలన బాల్యవివాహాలు ఎక్కువయ్యాయి. ఆ విపత్తు కారణంగా ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించడంతో పిల్లలలో ఏకాగ్రత లోపించడం ఎక్కువైంది.
ఆన్‌లైన్ విద్య 500 మిలియన్ ప్రపంచ బాలలకు అందలేదు. ప్రపంచంలో ఆర్థికాభివృద్ధికి పేదరిక నిర్మూలన, ఉచిత విద్యా కల్పన, వైద్య ఆరోగ్య వసతులు, సామాజిక రక్షణ, ఉద్యోగ ఉపాధుల కల్పన, వాతావరణ ప్రతికూల మార్పులను తగ్గించడం లాంటి చర్యలు తీసుకోవాలి. అందరికీ నిర్బంధ, ఉచిత పాఠశాల విద్యను అందించాలి. వృత్తి నైపుణ్యాలు అందించే విద్యా ప్రణాళికలు వేసి కార్యరూపం ఇవ్వాలి. ఉన్నత విద్యలో జీఈఆర్‌ను క్రమంగా పెంచేలా చర్యలు తీసుకోవాలి. విశ్వం కుగ్రామం అయిన ఈ డిజిటల్ యుగంలో దేశాల మధ్య అసమానతలు ప్రపంచ మానవాళికి ప్రతిబంధకాలు కానున్నాయి. విద్యతోనే విశ్వ కళ్యాణం కలుగుతుందని, మానవాళి సంక్షేమానికి విద్య ఉత్తమ ఉపకరణమని తెలుసుకొని అందరూ పిల్లలను, యువతను విద్యావంతులుగా మార్చే మహాయజ్ఞంలో మనందరం భాగస్వామ్యం తీసుకుందాం.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్, 9949700037