బీసీల లెక్క పక్కాగా తేలింది

by Sridhar Babu |
బీసీల లెక్క పక్కాగా తేలింది
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : కులగణనతో రాష్ట్రంలోని బీసీల లెక్క పక్కాగా తేలిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపుమేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏఐసీసీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అమలుపై నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో రెండు హిస్టారికల్ మూమెంట్స్ జరిగాయని, బీసీ కుల గణనతో రాష్ట్రంలో 56.36 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందని, రాజకీయాలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అంతే కాకుండా 30 ఏళ్ల కల అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కూడా ఆమోదం తెలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూడలేక ఆ రెండు పార్టీలు గగ్గోలు పెడుతున్నాయని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీలు లేని పథకాలను ప్రవేశపెట్టి స్కాములు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు పాలసీలను తీసుకువచ్చిందని తెలిపారు. 10 ఏండ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్ని ప్రవేశపెట్టలేదని, దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే దేశంలో మత, కుల విధ్వంసాలు చెలరేగేవని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నామని, నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చామన్నారు.

జై బాపు, జై భీమ్, జై సమ్మిదాన్ అనే వినూత్న కార్యక్రమాన్ని ఏఐసీసీ చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని గడపగడపకు చేరవేసి, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ రుద్రా సంతోష్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్​చార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఆవేశ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆయా మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story