Childhood Memories:చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు రావట్లేదా!.. అయితే మీకు ఈ సమస్య ఉన్నట్లే?

by Jakkula Mamatha |   ( Updated:2025-03-23 11:08:15.0  )
Childhood Memories:చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు రావట్లేదా!.. అయితే మీకు ఈ సమస్య ఉన్నట్లే?
X

దిశ,వెబ్‌డెస్క్: బాల్యం(childhood) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ అద్భుతమైన, మధురమైన జ్ఞాపకం. చిన్ననాటి మెమోరీస్ గుర్తు చేసుకుని ఇప్పటికీ చాలా మంది సంతోషపడుతుంటారు. ఈ క్రమంలో చిన్నతనంలోనే బాగుండేదని అనుకుంటారు. ఈ తరుణంలో ఒకసారి కాలం వెనక్కి వెళితే బాగుండు.. మళ్లీ చిన్ననాటి మెమోరీస్‌(Childhood Memories)ను పొందె వాళ్లం అనుకుంటుంటారు. ఏ స్థాయిలో ఉన్నవారైన సరే బాల్య మిత్రులను చూస్తే మళ్లీ ఆ రోజులను గుర్తు చేసుకుని సంబరపడిపోతుంటారు. ఇక ఇద్దరు బాల్య మిత్రులు ఒక దగ్గర ఉన్న చోట.. చిన్నప్పుడు ఆ చెట్టు ఎక్కాం, వాగులో ఆడుకున్నాం, ఆటలు, స్కూల్‌లో జరిగిన సంఘటనలను చర్చించుకుంటారు.

అంతేకాదు ఆ రోజులు మళ్లీ తిరిగి రావని చింతించే వారు కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. చిన్నతనంలో ఏం జరిగింది? ఏం చేశామనే వివరాలు సాధారణంగా చాలా మందికి గుర్తుండవు. మూడు నాలుగేళ్ల వయసులో ఏం చేశాం? ఎవరితో ఉన్నాం? ఎలా ఆడుకున్నాము? అనే జ్ఞాపకాలు ఎంత ప్రయత్నించినా గుర్తు తెచ్చుకోలేరు. ఈ క్రమంలో దీనికి కారణం ఏంటి? అనే విషయం పై ‘‘జర్నల్ సైన్స్’’(Journal Science) తాజాగా తన పరిశోధన పత్రంలో వెల్లడించింది.

అయితే.. మూడేళ్ల లోపు చిన్నారులకు నేర్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని గతంలో చాలా పరిశోధనల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాతృభాషతో పాటు ఇతర భాషలు నేర్చుకునే సామర్థ్యం కూడా అధికంగా ఉంటుందని తేలింది. చిన్నతనంలో ర్యాపిడ్ లెర్నింగ్ స్కిల్స్ ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ.. ఆ వయసులో జరిగిన సంఘటనలు మాత్రం బాల్యంలో, పెద్దయ్యాక గుర్తుండవు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం మూడు నాలుగేళ్ల వయసులో జ్ఞాపక శక్తికి సంబంధించిన వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడమేనని తేల్చి చెప్పారు.

ఈ మేరకు 25 మంది చిన్నారులపై జరిపిన పరీక్షలో ఈ విషయం తెలిసిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చిన్నారులకు ఫంక్షనల్ మాగ్నెటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్ (FMRI) పరీక్ష చేశామని చెప్పారు. ఈ పరీక్షలో చిన్నారులు తాము చూసిన, గమనించిన విషయాలను జ్ఞాపకాలుగా భద్రపరుచుకుంటున్నారని తేలిందన్నారు. ఈ క్రమంలో జ్ఞాపక శక్తికి సంబంధించిన మెదడులో కీలకమైన భాగం హిప్పోకాంపస్ పూర్తిగా అభివృద్ధి చెందని కారణంగా పెద్దయ్యాక బాల్య జ్ఞాపకాలు(Childhood Memories) గుర్తుకు తెచ్చుకోవడం సాధ్యం కావడం లేదని శాస్త్రవేత్తలు(Scientists) తాజా పరిశోధనలో వెల్లడించారు.

Note: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది మాత్రమే.. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు.

Next Story