VRA strike: వారికిచ్చిన హామీలు బుట్టదాఖలేనా?

by Ravi |   ( Updated:2022-12-16 02:14:14.0  )
VRA strike: వారికిచ్చిన హామీలు బుట్టదాఖలేనా?
X

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. ఇందులో 3 వేల మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్(direct recruitment) ద్వారా, 20 వేల మంది వారసత్వం ద్వారా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొత్త రెవెన్యూ చట్టం(new revenue act) తీసుకువస్తూ అసెంబ్లీ సాక్షిగా, వీరందరికీ పదోన్నతులు ఇస్తామని, పేస్కేల్(vra payscale) వర్తింపజేస్తామని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.

రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీలు అమలు కాలేదు. వీఆర్ఏలు 80 రోజులు సమ్మె చేసినా, సమ్మె కాలంలో 40 మంది మరణించినా ప్రభుత్వం కనికరించలేదు. మునుగోడు ఉప ఎన్నిక తరువాత జీఓలు విడుదల చేస్తామని చెప్పి సమ్మె విరమింపజేశారు. కానీ, ఇప్పటిదాకా ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు.

హామీలు, పోరాటాలు

2016: డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని ఎం‌ఎల్‌సీ కె. కవిత(kalvakuntla kavitha) హామీ ఇచ్చారు.

2016 సెప్టెంబర్‌లో 3000 మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలు 36 రోజులు సమ్మె చేసారు.

2017 ఫిబ్రవరి 24న ముఖ్యమంత్రి ప్రగతిభవన్‌కు(pragathi bhavan) పిలిపించుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏలను ఇతర శాఖలకు పంపిస్తూ రెగ్యులరైజ్ చేస్తామని, వారసత్వ వీఆర్ఏలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

2020 సెప్టెంబర్ 9 న ముఖ్యమంత్రి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారు. వీఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేశారు. నిండు అసెంబ్లీలో వీఆర్ఏలను పే స్కేల్ ఎంప్లాయీస్‌గా గుర్తిస్తామని, అర్హులకు పదోన్నతులు ఇస్తామని, 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

2022 మార్చ్ 15న మళ్లీ అసెంబ్లీలో 'వీఆర్ఏలలో విద్యాధికులు ఉన్నారు. అర్హతను బట్టి పదోన్నతులు ఇస్తాం, వారి సమస్యలు పరిష్కరిస్తాం'అని మరోసారి హామీ ఇచ్చారు.

2022 ఫిబ్రవరి 22న, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇందిరా పార్క్ వద్ద 15 వేల మంది వీఆర్ఏలు అతి పెద్ద ధర్నా చేసారు.

2022 జులై 20 నుండి 24 వ తేది వరకు నాలుగు రోజు కలెక్టర్ కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేసారు.

2022 జులై 25 నుండి నిరవధిక సమ్మె(VRA strike) ప్రారంభించారు.

దాదాపు రెండు నెలలు వినూత్న నిరసనలు తెలుపుతూ సమ్మె చేసిన తర్వాత, 13 సెప్టెంబర్ 2022న 10 వేల మంది వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడించారు. అదే రోజు పోలీసులు చేతులు ఎత్తివేయడంతో మంత్రి కేటీఆర్(ktr) వీఆర్ఏ నాయకులను పిలిపించుకుని 'స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాలు జరుగుతున్నాయి. అవి అయిపోయాక 20 సెప్టెంబర్ 2022 రోజున మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తామని'హామీ ఇచ్చారు. 2022 సెప్టెంబర్ 20న వీఆర్ఏ నాయకులు కేటీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ని కలవగా 'మీ పే స్కేల్‌కి సంబంధించి పని జరుగుతుంది కొన్ని రోజుల సమయం పడుతుంది'అని దాటవేసారు.వీఆర్ఏలు అందరూ సమ్మె ఉధృతం చేస్తూ మునుగోడులో నామినేషన్ వేయడం మొదలుపెట్టారు. దీనితో ప్రభుత్వం స్పందించి 12 అక్టోబర్ 2022 రోజున సీఎస్ సోమేశ్ కుమార్(cs somesh kumar) వీఆర్ఏ నాయకులను ట్రెసా(TESRA) ఆధ్వర్యంలో పిలిపించి 'ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కోడ్ ముగిసాకా నవంబర్ 7 తర్వాత మీకు సంబంధిన జీఓ లు విడుదల చేస్తాము'అని హామీ ఇచ్చారు.

సమ్మెలో భాగంగా పే స్కేల్ జాతర, 48 గంటలు నిరవధిక దీక్షలు, బిక్షాటన, పాదయాత్ర, అర్ధనగ్న ప్రదర్శన, వంటావార్పు మొదలైన వినూత్న నిరసనల ద్వారా 80 రోజులు సమ్మె చేసి 40 మంది వీఆర్ఏల ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 12 తేదీన సమ్మె విరమించారు. ఇప్పటికీ ప్రభుత్వం నుండి కానీ సీఎస్ సోమేశ్ కుమార్ నుండి కానీ ఎటువంటి స్పందన లేదు. ఇన్ని సార్లు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అందరూ హామీ ఇచ్చిన ఇప్పటి వరకు హామీలు నెరవేరలేదు.

సమస్యలు

వీఆర్ఓ వ్యవస్థ రద్దు ద్వారా ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే జూనియర్ అసిస్టెంట్(junior assistant) పదోన్నతి రావాలి. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఎలు ఫైనల్ పబ్లికేషన్ అయ్యి పదోన్నతులు కోల్పోయారు. వీఆర్ఏలు గ్రామాలలో అన్ని శాఖలకు అనుబంధంగా ఉంటూ 24/7 అత్యవసర సేవలు అన్ని సమయాలు సెలవులతో పండుగలతో సంబంధం లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటారు. కనీస వసతులు లేవు. పే స్కేలు లేదు. పీఎఫ్ లేదు.మెటర్నిటీ, క్యాజువల్ సెలవులు లేవు. ఈఎస్ఐ లేదు. హెల్త్ కార్డ్స్ లేవు. పెన్షన్ లేదు. ఉద్యోగ భద్రత లేదు. సమయ పాలన లేదు. పదోన్నతులు లేవు.

గ్రామాలకే పరిమతం అయిన వీఆర్ఏలను కార్యాలయాలకు తీసుకువచ్చి అటెండర్లుగా, జీపు డ్రైవర్లుగా, నైట్ వాచ్మెన్ గా, చైన్‌మెన్‌గా నియమించారు. కొంతమంది రికార్డు అసిస్టెంట్స్ గా , ఇన్వార్డ్, అవుట్ వార్డ్ అసిస్టెంట్ గా, మీసేవ ఆపరేటర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, ధరణి ఆపరేటర్లుగా, జూనియర్ అసిస్టెంట్ కి సహాయకులుగా, సీనియర్ అసిస్టెంట్ కి సహాయకులుగా, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ కి సహాయకులుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి సహాయకులుగా నివేదికలు రాయడానికి, డిప్యూటీ తాసిల్దార్ కు సహాయకులుగా వీఆర్ఏలు వేట్టిచాకిరి చేయవలసి వస్తుంది. వీఆర్ఓలు నిర్వహించే అన్ని విధులు వీఆర్ఏలు చేస్తున్నారు. ఉద్యోగ, ఆర్థిక, మానసిక బాధతో ఎంతో మంది మరణిస్తున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నది. కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు చదువులు పక్కకు పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినం. ఈ రోజు మళ్లీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేయడానికి సిద్దం అయ్యాం. ఆ రోజు తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆపలేదు, ఈ రోజు పదోన్నతి సాధించే వరకు ఉద్యమం ఆపేది లేదు.

కర్ణకంటి రాజేశ్

వరంగల్ జిల్లా వీఆర్‌ఏ జేఏసీ కో కన్వీనర్

96767 98908

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.

Also Read....

దిశ కథనానికి స్పందన : యూనిఫామ్ తో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు

Advertisement

Next Story