ఆధునిక లైబ్రరీ ఏర్పాటుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?

by Ravi |   ( Updated:2022-12-12 19:15:53.0  )
ఆధునిక లైబ్రరీ ఏర్పాటుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?
X

దువరులకు, విద్యార్థులకు, పరిశోధకులకు విస్తృతంగా గ్రంథాలయాలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే సంకల్పించింది. అందుకోసం 1988 ఏప్రిల్‌‌లో ఫ్రొఫెసర్ యష్‌పాల్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ లోతుగా అధ్యయనం చేసి 1988 డిసెంబర్‌లో తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను అనుసరించి కేంద్రం 1992లో యూజీసీ పరిధిలో 'గ్రంథాలయ సమాచార నెట్ వర్క్' Information Library Network (INFLIBNET) అనే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేసింది.

దీని ప్రధాన కార్యాలయం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టరుగా ప్రొఫెసర్ జేపీ సింగ్ జోయెల్‌ను నియమించారు. ఈ INFLIBNET దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోని గ్రంథాలయాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తుంది. యూజీసీ(ugc) దీనిని ఒక జాతీయ ప్రాజెక్ట్‌గా తీసుకుంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తితో విశ్వవిద్యాలయ కేంద్రంగా పనిచేస్తుంది. దీనినే ఇంటర్ యూనివర్సిటీ అక్రిడిటేషన్ అసోసియేషన్ (IUCAA) అంటారు.

INFLIBNET ప్రధాన లక్ష్యాలు,విధులు

విద్యార్థులకు, పరిశోధకులకు, చదువరులకు కావాలిసిన సమాచారాన్ని అందుబాటులోకి తేవడం, సమాచార బదిలీ, యాక్సెస్‌లో సామర్థ్యాన్ని మెరుగుపరచడం. సమాచారం, లైబ్రరీ నెట్‌వర్క్‌ను స్థాపించటానికి దేశంలోని లైబ్రరీలను, డాక్యుమెంటేషన్ కేంద్రాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం. షేర్డ్ కేటలాగింగ్, ఇంటర్ లైబ్రరీ లోన్ సర్వీస్, కేటలాగ్ ప్రొడక్షన్, కలెక్షన్ డెవలప్‌మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ రిసోర్స్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయటం. సమాచార సేకరణలో డూప్లికేషన్‌ను నివారించడం. ఆన్‌లైన్ సమాచార సేవలను అందించడం కోసం ప్రాజెక్ట్‌లు, సంస్థలు, నిపుణులు మొదలైన వాటి డేటాబేస్‌ను రూపొందించడం. కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కోసం నియంత్రణ, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి నిర్వహించడం.

డేటాబేస్‌లో INDCAT: INFLIBNET సెంటర్‌లోని యూనియన్ కేటలాగ్ ఆన్‌లైన్ యూనియన్ కేటలాగ్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీలలోని పుస్తకాలు, సీరియల్‌లు, థీసిస్‌లు, బిబ్లియోగ్రాఫిక్ రికార్డులను కలిగి ఉంటాయి. దీనిలో మరికొన్ని ముఖ్యమైన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఇది MARC, MARC XML మొదలైన వాటిలో ప్రామాణిక గ్రంథ పట్టిక ఫార్మాట్‌లలో రికార్డులను అందిస్తుంది. బుక్ డేటాబేస్ సభ్యత్వం గల విశ్వవిద్యాలయాల పుస్తకాల గ్రంథ పట్టిక సమాచారాన్ని వివరిస్తుంది. మోనోగ్రాఫ్‌లు, రిఫరెన్స్ పుస్తకాలు, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్‌లు, పాఠ్యపుస్తకాలు మొదలైన వివరాలను కూడా అందిస్తుంది. థీసెస్ డేటాబేస్‌లోని యూనియన్ కేటలాగ్ భారతీయ విశ్వవిద్యాలయాలలో సమర్పించిన డాక్టోరల్ డిసెర్టేషన్‌లు, థీసిస్ గ్రంథ పట్టిక సమాచారాన్ని అందిస్తుంది.

నకిలీలను నివారించడానికి

వీడియో డేటాబేస్‌లో కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (CEC) రూపొందించిన వీడియో ప్రోగ్రామ్‌లకు సంబంధించిన సమాచారం వుంటుంది. వీటిని అకడమిక్ కమ్యూనిటీకి, సమాజంలోని ఇతర ప్రజానీకానికి అందించటమే లక్ష్యంగా పెట్టుకుంది. సహకార జాబితాలను రూపొందించటం ద్వారా నకిలీని నివారించడానికి 'ఆన్‌లైన్ కాపీ కేటలాగ్ సిస్టమ్' (OCS) అనే అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఇది అన్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు గేట్‌వే లాంటిది.

ఇది P.G విద్యార్ధులకు ఇ-కంటెంట్‌ను అందిస్తుంది. దీనికోసం 70 సబ్జెట్స్‌లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా విద్యపై జాతీయ మిషన్ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (MHRD) ద్వారా నిధులు సమకూరుస్తుంది. జాతీయ శాస్త్ర,సాంకేతిక, సమాచార వ్యవస్థ (NISSAT), UGC సమాచార కేంద్రాలు, సిటీ నెట్‌వర్క్‌లు, ఇతర సెక్టోరల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లు ద్వారా దేశీంగా రూపొందించిన డేటాబేస్‌లు అందుబాటులోకి వస్తాయి. జాతీయ, అంతర్జాతీయ డేటాబేస్‌లను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడానికి గేట్‌వేలను ఏర్పాటు చేయడం ద్వారా అనులేఖనాలు, సారాంశాలు మొదలైన వాటితో గ్రంథ పట్టికల రూపకల్పనకు వీలవుతుంది.

అందుబాటులో సమాచారం

జాతీయ, అంతర్జాతీయ సమాచార నెట్‌వర్క్‌లు, కేంద్రాల ద్వారా చేతి రాతలు (మాన్యుస్క్రిప్ట్‌లు), అందుబాటులో ఉన్న విలువైన సమాచారాన్ని ఆర్కైవ్ చేయడానికి కొత్త సాంకేతిక పద్ధతులను అభివృద్ధి చేస్తారు. అధిక సాంద్రత కలిగిన నిల్వ మాధ్యమాన్ని (హై డేటా ప్రిజర్వేటివ్ సర్వర్ల)ను ఉపయోగించి డిజిటల్ చిత్రాల రూపంలో ఇతర భారతీయ భాషలలో గల సమాచారాన్ని భద్రపరుస్తారు. ఇంటర్- లైబ్రరీ లోన్ సర్వీస్, కేటలాగ్ ప్రొడక్షన్, కలెక్షన్ డెవలప్‌మెంట్ ద్వారా సమాచార వనరుల వినియోగాన్ని వీలైనంత వరకు ఉపయోగంలోకి తెస్తారు. తద్వారా సాధ్యమైనంతగా కొనుగోలులలో నకిలీలను నివారించటానికి వీలవుతుంది.

వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల దూరభారంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా విస్తరించి వున్న వినియోగదారులకు సీరియల్స్, థీసెస్/డిసర్టేషన్, పుస్తకాలు, మోనోగ్రాఫిక్, నాన్-బుక్ మెటీరియల్‌కు సంబంధించిన సమాచారాన్ని ఏక కాలంలో యాక్సెస్ చేయడానికి అవకాశం వుంటుంది. అందుబాటులో ఉన్న మూలాలను (sources) సౌకర్యాలను పొందడం తేలికవుతుంది. INFLIBNET పత్రాలు యూనియన్ కేటలాగ్, ఆన్‌లైన్ సమాచార సేవలు, ప్రాజెక్ట్‌లు, సంస్థలు, నిపుణులు మొదలైన వాటి డేటాబేస్‌లను రూపొందిస్తారు. దేశంలోని లైబ్రరీలు, డాక్యుమెంటేషన్ కేంద్రాలు, సమాచార కేంద్రాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడం ద్వారా బలహీన ఆర్థిక వనరుల గల కేంద్రాలకు ఎక్కువ సహాయం చేయవచ్చు. కంప్యూటరైజ్డ్ లైబ్రరీ కార్యకలాపాలు, నెట్‌వర్కింగ్ రంగాన్ని స్థాపించడానికి, నిర్వహించడానికి, కొనసాగించడానికి మానవ వనరులకు శిక్షణ ఇవ్వడానికి, అభివృద్ధి చేయడానికి INFLIBNET ఇతోధికంగా తోడ్పడుతుంది.

సంభాషణలు సులభతరం

INFLIBNET ద్వారా ఎలక్ట్రానిక్ మెయిల్, ఫైల్ బదిలీ (File sharing) కంప్యూటర్ / ఆడియో / వీడియో కాన్ఫరెన్సింగ్ మొదలైన వాటి ద్వారా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సామాజిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల మధ్య విద్యా సంబంధ సంభాషణను సులభతరం చేయడానికి వీలవుతుంది. కమ్యూనికేషన్స్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్, ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్, డేటా మేనేజ్‌మెంట్, సిస్టమ్ డిజైన్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ నిర్వహణ (Management), నియంత్రణ (Control), పర్యవేక్షణ (Supervision) వ్యవస్థను ఏర్పాటు చేయడం, నిర్వహణ మొదలైన లక్ష్యాలను సాధించవచ్చు.

యూజీసీ విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలలో దేశ విదేశాలలోని సంస్థలు, లైబ్రరీలు, సమాచార కేంద్రాలు, ఇతర సంస్థలతో సహకరించడం; పరిశోధన, అభివృద్ధి (R&D)ని ప్రోత్సహించడం, అవసరమైన సేవలు (Services) సౌకర్యాలను (Facilities) అభివృద్ధి చేయడం, కేంద్రం లక్ష్యాలను సాధించడానికి సాంకేతిక స్థానాలను సృష్టించడం; మొదలైన బహుళార్ధక సేవలు ప్రయోజనాలు INFLIBNET వల్ల లభిస్తున్నాయి. ( పుల్లా కిశోర్, లైబ్రేరియన్, ఎంజేపీ గురకుల పాఠశాల స్టేషన్ ఘన్‌పూర్‌ సహకారంతో)


డా. రాధికారాణి

అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీ సైన్స్

కేయూ, వరంగల్

99495 95810

Advertisement

Next Story

Most Viewed