National farmers day: కష్టంగా కాదు ఇష్టంగా పండించాలి

by Ravi |   ( Updated:2022-12-22 19:01:21.0  )
National farmers day: కష్టంగా కాదు ఇష్టంగా పండించాలి
X

రోజురోజుకు దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ పాత్ర తగ్గుతూ వచ్చింది. ఇతర రంగాలు పుంజుకున్నంతగా వ్యవసాయం పుంజుకోలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వ్యవసాయాన్ని కష్టంతో కాకుండా ఇష్టంగా చేసే పరిస్థితులు కల్పించినప్పుడు మాత్రమే రైతు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా నిలదొక్కుకొని వ్యవసాయం చేస్తాడు. చైనా, అమెరికా కంటే మన దేశంలోనే పండే భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. రైతుల సంక్షేమంలో వెనుకబడి ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మేలు జరిగేలా చూడాలి. అప్పుడే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది.

క నిర్దిష్ట పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి పోషించి తద్వారా ఆహారం, ఇతర పదార్థాలను ఉత్పత్తి చేయడమే వ్యవసాయం. వ్యవసాయం మానవ చరిత్రలోనే అతి పెద్దది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక ప్రగతిలో వ్యవసాయ అభివృద్ధి ఒక ప్రధాన అంశం. మనది వ్యవసాయాధారిత దేశం. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానిదే కీలక పాత్ర. ఒక విధంగా వ్యవసాయం లేకపోతే మానవ మనుగడే లేదు. గత చరిత్రను ఆధారంగా చేసుకొని మన పూర్వీకుల అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికి ఉత్సవాలను చేసుకోవడం పరంపరగా కొనసాగుతూ వస్తున్నది. మన సంప్రాదాయాలు, సంస్కృతిని కాపాడుకునేందుకు ఈ ఉత్సవాలు జరుపుకొంటాం.

అదొక్కటే రైతుల కలల బడ్జెట్

నేల తల్లిని నమ్మి వివిధ రకాల పరిస్థితులను తట్టుకుంటూ, ఆరుగాలం శ్రమించి పంటలు పండించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే రైతులందరికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే రైతులే దేశ సంపదకు వెన్నెముక. మన దేశ జనాభాలో సుమారు 50 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి కీలకమైన వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోయింది. రైతుకు పంట గిట్టుబాటు కావడం లేదు. బుుతుపవన ఆధారిత భారతదేశంలో తొలిగా నిర్మించిన ప్రాజెక్టులు రైతులకు మేలు చేసినా, నదులపై పెరిగిన ఆనకట్టలు, తగ్గిన నదీ జలాల ప్రభావంతో రైతాంగం నీటి చుక్కల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకటి, రెండు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట సరిగా చేతికందక, అందిన పంటకు గిట్టుబాటు ధర లభించక, తమ అవసరాలను తెలియజెప్పే మార్గం కూడా తెలియక రైతు అల్లాడిపోయాడు. అలాంటి పరిస్థితిలో రైతులను సంఘటితపరిచారు చౌదరీ చరణ్‌సింగ్. తన జీవితమంతా వారి సమస్యల గురించి, వ్యవసాయ రంగ ఇబ్బందుల గురించి ఆలోచించారు.

రైతుల మద్దతుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా, దేశానికి ఉప ప్రధానిగా, ఆరు నెలలు ప్రధానిగా పని చేశారు. ప్రధానిగా ఆయన ప్రవేశ పెట్టిన ఏకైక బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతుల కలల బడ్జెట్‌గా నిలిచిపోయింది. అందుకే ఆయన జయంతిని 'కిసాన్ దివస్' (kisan divas)గా ఆయన సమాధిని 'కిసాన్ ఘాట్' గా(kishan ghat) నామకరణం చేశారు. దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో అవగాహన పెంచి, వ్యవసాయ రంగంలో నూతన విధానాలు తెలియజేసి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు రైతుకు సూచనలు ఇవ్వడం 'రైతు దినోత్సవ' (national farmers day) ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వాలు సైతం రైతులకు వైజ్ఞానిక వ్యవసాయంపై అవగాహన కలిగించాలి. రుణాలు, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ విధానం, మార్కెటింగ్ చేసుకునే మెరుగైన మార్గాల మీద అవగాహన పెంపొందించాలి. వ్యవసాయరంగం ఆవశ్యకతను తెలియజేయాలి.

పండే భూమి ఎక్కువగా ఉన్నా

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి, యాంత్రీకరణ, రసాయనాలు, సంకర జాతి వంగడాలను వాడి స్వల్పకాలంలో అధిక దిగుబడి సాధించేందుకు ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానాన్ని 'హరిత విప్లవం'(green revolution) అంటారు. ఇది మెదటగా మెక్సికోలో ప్రారంభమై విజయవంతమైంది. 1961 లో దేశంలో విపరీతమైన క్షామం ఏర్పడటంతో అప్పటి వ్యవసాయ మంత్రి ఎంఎస్ స్వామినాథన్(ms swaminathan) మెక్సికోలో వంగడాలను పంజాబ్‌లో ప్రవేశపెట్టి దేశంలో హరిత విప్లవానికి నాంది పలికారు. దీనిని పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ రైతులు వినియోగించుకొని లబ్ధి పొంది 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు దిగుబడిని పెంచారు. ఉత్పత్తి పెరిగినా రానురాను నాణ్యత తగ్గిపోయి పెట్టుబడి భారమైపోవడం, బుతుపవనాలు గతి తప్పడం, తరచుగా తుఫానులు, వర్షాభావ పరిస్థితులు, సాంప్రదాయ వ్యవసాయ విధానం, సహజ ఎరువులను వదిలి రసాయన ఎరువుల వినియోగానికి ప్రాముఖ్యత ఇవ్వడంతో వ్యవసాయం గాడి తప్పింది. ఇది మళ్లీ గాడిలో పడాలంటే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో వస్తున్న మార్పులను మనదేశంలో ప్రవేశపెట్టాలి.

వ్యవసాయ ఉత్పత్తిలో మన దేశం తొలి ఐదు స్ధానాలలో ఉంటుంది. వ్యవసాయంతో ముడిపడి ఉన్న చేపల పెంపకం, అడవుల పెంపకం వంటివి దేశ జీడీపీలో 16.6 శాతం ఉన్నాయి. కానీ, రోజురోజుకు దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ పాత్ర తగ్గుతూ వచ్చింది. ఇతర రంగాలు పుంజుకున్నంతగా వ్యవసాయం పుంజుకోలేకపోవడం ఆందోళన కలిగించే అంశం. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. వ్యవసాయాన్ని కష్టంతో కాకుండా ఇష్టంగా చేసే పరిస్థితులు కల్పించినప్పుడు మాత్రమే రైతు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా నిలదొక్కుకొని వ్యవసాయం చేస్తాడు. చైనా(china), అమెరికా(america) కంటే మన దేశంలోనే పండే భూమి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. రైతుల సంక్షేమంలో వెనుకబడి ఉంది. స్వామినాథన్ కమిషన్(swaminathan commission) సిఫార్సులను అమలు చేసి రైతులకు మేలు జరిగేలా చూడాలి. అప్పుడే భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది.

నరేందర్ రాచమల్ల

99892 67462

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story

Most Viewed