Kaikala Satyanarayana: కైకాల హీరో నుండి విలన్ గా ఎలా మారారు?

by Ravi |   ( Updated:2022-12-24 02:18:56.0  )
Kaikala Satyanarayana: కైకాల హీరో నుండి విలన్ గా ఎలా మారారు?
X

ద్భుత నటనతో, విలక్షణ పాత్రలతో సినీ పరిశ్రమకు పేరు తెచ్చిన నటులలో కైకాల సత్యనారాయణ ఒకరు. ఆయన పోషించని పాత్ర లేదు. అలరించని కోణం లేదు. తన అజరామర నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల గుండెలలో గూడు కట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. హీరోగా పరిచయమై, ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసి 'నవరస నటనా సార్వభౌముడి'గా ప్రశంసలు అందుకున్నారు. పౌరాణిక పాత్రలలో కైకాల ఒదిగిపోయిన తీరు మహా అద్భుతం. ఎన్టీఆర్ యమగోల(yamagola) నుంచి రవితేజ దరువు వరకు పలు చిత్రాలలో యముడిగా నటించారు. యముడు అంటే కైకాలనే అనే రీతిలో ముద్ర వేసుకున్నారు. గంభీర వాచకంతో, అబ్బురపరచే ఆంగికంతో హావభావాలను చిలికించి నటనకే భాష్యం చెప్పారు. వీర, రౌద్ర, బీభత్స రసాలను పౌరాణిక, జానపదాలలోనూ, చరిత్రాత్మక, సాంఘిక చిత్రాలలోనూ తనదైన శైలితో పలికించి మెప్పించిన గొప్ప నటుడు.

ఎన్టీఆర్ కృష్ణుడైతే సత్యనారాయణే సుయోధనుడు. ఎన్టీఆర్ రాముడైతే సత్యనారాయణే రావణాసురుడు. విఠలాచార్య ప్రోత్సాహంతో ప్రతినాయకునిగా రాణించిన అనుభవశాలి. 'నాపేరే భగవాన్‌'లో హిందీ విలక్షణ నటుడు ప్రాణ్‌ను మరిపించారు. 'శారద'లో చెల్లెలి కోసం తపించే అన్నగా, 'తాతమనవడు'లో నిర్దయుడైన తనయుడిగా, 'యమగోల'లో 'యముండ' అనే ట్రేడ్‌ డైలాగుతో అలరించారు. 'వేటగాడు'లో అమాయక చక్రవర్తిగా, 'సావాసగాళ్లు'లో ఉంగరాల సాంబయ్యగా, 'సూత్రధారులు'లో సంగీతానికి జీవితాన్నే వెచ్చించిన కళాకారునిగా, 'సిరిసిరిమువ్వ'లో వికలాంగుడైన చేతగాని తండ్రిగా, 'గురువును మించిన శిష్యుడు'లో ధర్మపాలునిగా వైవిధ్య నటనకు ఊపిరులూదారు. 82 యేండ్ల వయసుని, దాదాపు 800 సినిమాలతో 60 యేళ్ల నటనానుభవంతో అసాధారణ జీవితసారాన్ని ఔపోసన పట్టారు. 1959లో 'సిపాయి కూతురు' అనేచిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో 'మహర్షి' సినిమాలో చివరిసారిగా కనిపించారు. 2022, డిసెంబర్ 23న తుది శ్వాస విడిచారు.

చిన్న చిన్న పాత్రలతో

సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జులై 25న జన్మించారు. గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడలలో చదువుకున్నారు. పల్లెపడుచు, బంగారు సంకెళ్లు, ప్రేమలీలలు, కులంలేని పిల్ల, ఎవరుదొంగ వంటి నాటకాలలో విలన్‌గా, హీరోగా నటించి బహుమతులు గెలుచుకున్నారు. 1955 నాటికే డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. 'కొడుకులు-కోడళ్లు' అనే సినిమాకు ఓకే చేసినా దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం కాలేదు. దర్శకనిర్మాత బీఏ సుబ్బారావును కలిశారు. ఆయన కేవీ రెడ్డి(kv reddy) వద్దకు పంపినా అవకాశం రాలేదు.

'దొంగరాముడు' సినిమాలో తనకు దక్కాల్సిన పాత్ర ఆర్‌.నాగేశ్వరరావుకు దక్కింది. చివరకు దేవదాసు నిర్మాత డీఎల్‌. నారాయణ సత్యనారాయణను చెంగయ్య దర్శకత్వంలో 1959 లో తీసిన 'సిపాయి కూతురు'లో హీరోగా జమున సరసన నటింపజేశారు. అదే సత్యనారాయణకు మొదటి సినిమా. 1960లో ఎన్టీఆర్‌ చొరవతో 'సహస్ర శిరచ్ఛేద అపూర్వచింతామణి' చిత్రంలో అతిధి నటుడిగా నటించారు. ఈ సినిమా దర్శకుడు ఎస్‌.డి.లాల్‌ విఠలాచార్యకు చెప్పి ప్రతినాయకునిగా 'కనకదుర్గ పూజామహిమ'లో నటింపజేశారు. దీంతో సత్యనారాయణ(Kaikala Satyanarayana) విలన్ పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. బీఎన్‌ రెడ్డి కూడా 'రాజమకుటం' లో సత్యనారాయణ(Kaikala) చేత చిన్న పాత్ర వేయించారు.

ఇక వెనుదిరిగి చూడకుండా

1960 ఏప్రిల్‌ 10న నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు కైకాల. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. 1962లో సత్యనారాయణకు మంచి అవకాశాలు వచ్చాయి. 'స్వర్ణగౌరి'లో శివుడి పాత్ర సత్యనారాయణను వరించింది. మదనకామరాజు కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, నర్తనశాల, పరువు ప్రతిష్టలో ప్రతినాయకునిగా నటించారు. అగ్గిపిడుగులో విలన్ రాజనాలకు ఆంతరంగికునిగా, 'జిస్‌ దేశ్‌‌మే గంగా బెహతీ హై'లోని ప్రాణ్‌ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నారు.

శ్రీకృష్ట పాండవీయం, పాండవ వనవాసం, శ్రీకృష్ణావతారం, 'కురుక్షేత్రం' దాన వీర శూర కర్ణ' చాణక్య చంద్రగుప్త, సీతాకల్యాణం చిత్రాలలో అసమాన నటనను ప్రదర్శించారు. కథానాయిక మొల్లలో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి మెప్పించారు. ఉమ్మడి కుటుంబం, వరకట్నంలో అద్భుత నటన ప్రదర్శించారు. 'శారద' సినిమాతో కేరక్టర్‌ నటునిగా గుర్తింపు పొందారు. 'ప్రేమనగర్‌' కేశవవర్మ పాత్రలో జీవించారు. 'అడవిరాముడు', 'వేటగాడు' సినిమాలలో విలన్‌ పాత్రలు పోషించారు.

కేరక్టర్‌ ఆర్టిస్టుగా

ఎస్‌‌వీ రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీర పాత్రలు ఎక్కువగా సత్యనారాయణనే వరించాయి. పోలీసు అధికారిగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. తాత మనవడు, చదువు సంస్కారం, తూర్పు పడమర, నేరము శిక్ష, సిరిసిరిమువ్వ, బంగారు కుటుంబం, అన్వేషణ, తాతయ్య ప్రేమలీలలు, 'బొబ్బిలి రాజా, 'మంత్రిగారి వియ్యంకుడు, 'శ్రుతిలయలు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్రవీణ, 'అల్లుడుగారు', 'ఒంటరిపోరాటం' వంటి సాంఘిక చిత్రాలలోనూ సత్యనారాయణ విశ్వరూపం చూపారు.

రమాఫిలిమ్స్‌ పేరిట గజదొంగ, ఇద్దరు దొంగలు, 'కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు వంటి ఎనిమిది చిత్రాలు తీసి విజయం సాధించారు. కొన్ని చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. సత్యనారాయణ నటించిన దాదాపు 800 చిత్రాలలో 200 మంది దర్శకులతో కలిసి పనిచేసిన సత్యనారాయణ 223 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాలు, 59 సినిమాలు అర్ధశత దినోత్సవాలు, 10 సినిమాలు శత దినోత్సవాలు జరుపుకున్నాయి.

పురస్కారాలు

సత్యనారాయణకు అనంతపురం, గుడివాడ పట్టణాలలో 'నటశేఖర' బిరుదు ప్రదానం చేశారు. కావలి విశ్వోదయ సాంస్కృతిక సంస్థ వారు 'కళాప్రపూర్ణ' బిరుదుతో సత్కరించారు. 'నవరస నటనా సార్వభౌమ' బిరుదు సార్వజనీనకంగా అమరినదే. తాతమనవడు, సంసారం సాగరం, కచదేవయాని సినిమాలకు ఉత్తమ నటునిగా నంది బహుమతులను అందుకున్నారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చిగౌరవించింది.

1996 లో టీడీపీ(tdp) తరఫున మచిలీపట్నం ఎంపీగా 11 వ లోకసభకు ఎన్నికయ్యారు. సొంతవూరు కౌతవరంలో తాతగారి పేరుతో ప్రసూతి ఆసుపత్రిని కట్టించారు. గుడివాడలో కళా మండపం నిర్మించారు. పేద విద్యార్థులకు చదువు, వివాహాలు, ఉపాధికి సాయం అందించారు. వందల చిత్రాలలో నటించినప్పటికీ ఆయన వెనకేసింది చాలా తక్కువే. గతేడాది తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే ఏపీ సీఎం ప్రభుత్వం తరఫున ఆసుపత్రి ఖర్చులను చెల్లించారు.

పొన్నం రవిచంద్ర

సీనియర్ జర్నలిస్టు, సినీ విమర్శకులు

94400 77499

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read..

ధనుష్ 'సార్' మూవీ నుంచి బిగ్ అప్‌డేట్!

Advertisement

Next Story

Most Viewed