Hyderabad Book Fair: పుస్తకాలే విలువల వెలుగులు

by Ravi |   ( Updated:2022-12-24 02:11:54.0  )
Hyderabad Book Fair: పుస్తకాలే విలువల వెలుగులు
X

క్షరంబు వలయు కుక్షి జీవనులకు..అక్షరంబు జిహ్వ కిక్షు రసము..అక్షరంబు తన్ను రక్షించు గావున..నక్షరంబు నందరు నేర్వవలయు..అక్షరంబు లోక రక్షితంబు' అక్షరంబు అంటే చదువు. అది నాలుకకు చెరుకు రసములాంటిది. అది మనల్ని రక్షిస్తుంది, అన్నం పెడుతుంది, అదే లోకాన్నీ కాపాడుతుంది. కాబట్టి అందరు చదువు నేర్చుకోవాలనేది ఈ పద్య తాత్పర్యం. అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుందని ప్రజా కవి కాళోజీ అన్నట్లు అక్షరాలు మనుషుల్ని కదిలిస్తాయి. ఉద్యమాలకు ఊపిరి పోస్తాయి. అందుకే అక్షరం నాశనం లేనిదంటారు. అక్షరాల్లో దాగి ఉన్న విజ్క్షానం తెలియాలంటే పుస్తకాలే ఆధారం. మస్తిష్కం మెరవడానికి, మనసు మురవడానికి పుస్తక పఠనం అత్యవసరం!

సంఘజీవన సూచికలు

గతించిన కాలంలో సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, వర్తమానంలో వివిధ ప్రాంతాల్లో వస్తున్న మార్పులు, నూతన పోకడల గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. అక్షర రూపంలోకి మారిన గొప్పవారి జీవితాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. పుస్తకాలు చదవడం వల్ల చరిత్ర తెలుసుకోవచ్చు, వర్తమానాన్ని గమనించవచ్చును, భవిష్యత్‌ను ఊహించవచ్చు. గాంధీ జీవిత చరిత్ర 'సత్య శోధన' నేటికీ ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అంటే అతిశయోక్తి కాదు. గొప్ప గొప్పవారి జీవిత చరిత్రలు చదవడం వలన ప్రేరణ పొందడంతోపాటు జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలనే ధైర్యం, ఆలోచన అలవడుతాయి. అందుకే పుస్తకాలు సంఘజీవన సూచికలు, సంస్కార దీపికలు, విలువల వెలుగులుగా గుర్తింపు పొందాయి. క్రీస్తు శకం 1436లో జర్మనీలో గుటెన్‌బెర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టిన తర్వాత పుస్తకాలు ప్రచురితం కావడం మొదలైంది. టైపు రైటర్లు, కంప్యూటర్లు మొదలు.. ప్రస్తుత టాబ్లెట్లు వరకు ఎన్నో మార్పులు వచ్చాయి.

మొబైళ్లలో ఆన్‌లైన్ రీడింగ్ రోజురోజుకూ పెరుగుతున్నది. చేతిలోకి లైబ్రరీ వచ్చేసింది. తాజాగా వీడియో లైబ్రరీలు మొదలవుతున్నాయి. భవిష్యత్తులో హోలోగ్రామ్ టెక్నాలజీతో గాలిలోనే బుక్స్ కనిపించే రోజులు వస్తాయంటున్నారు. సోషల్ మీడియా వచ్చాక పుస్తకాలు చదివే వారి సంఖ్య తగ్గిపోతుండటం ఆందోళనకరం. ఎంత ఆన్‌లైన్​లో చదివినా, పుస్తకాన్ని పట్టుకుని చదువుతుంటే వచ్చే అనుభూతి మాత్రం రాదు. పుస్తక పఠనం పెంపొందించడం అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుస్తక పఠనం, పుస్తకాలపై ప్రేమ, ప్రచురణ, కాపీరైట్​లపై అవగాహన కల్పిస్తూ.. పుస్తక పఠనాన్ని ప్రోత్సాహించడానికి యునెస్కో(UNESCO) యేటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నది.

దీనికి ప్రత్యేక గుర్తింపు

దేశంలో కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనలు యేటా జరుగుతున్నాయి. వాటిలో హైదరాబాద్​ జాతీయ పుస్తక ప్రదర్శనది ప్రత్యేకమైన గుర్తింపు. 35వ హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​(Hyderabad Book Fair) ఎన్టీఆర్​ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈసారి 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు. నగరంలో నిజాం కాలం నుంచే పుస్తకాలకు ప్రత్యేక ఆదరణ ఉన్నది. ఇక్కడ అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్​ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఉన్నారు. అందుకే దాదాపు అన్ని భాషల పుస్తకాలకు హైదరాబాద్​ అప్పుడు, ఇప్పుడు కేంద్రంగానే ఉన్నది. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్​గా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్​ బుక్​ ట్రస్ట్(national book trust)​ నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలతో కలిసి 1986లో 'హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​'ను మొట్టమొదటిసారిగా కేశవ మెమోరియల్ స్కూల్​ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసింది.

తర్వాత నిజాం కాలేజీ గ్రౌండ్, ఆర్టీసీ క్రాస్​ రోడ్స్, చిక్కడపల్లి, సెంట్రల్​ లైబ్రరీ, నెక్లెస్​రోడ్​ తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. ఈసారి జనవరి 1 వరకు 11 రోజుల పాటు కొనసాగే ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఢిల్లీ, కోల్‌కతా, మహారాష్ట్ర, కర్నాటక పబ్లిషర్లు ఇక్కడ స్టాల్స్​ఏర్పాటు చేశారు. పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టారు. గ్రామీణ ప్రాంతాల లైబ్రరీలకు పుస్తకాలు అందించేందుకు ప్రత్యేకంగా బుక్ డొనేషన్ బాక్స్ ఏర్పాటు చేయడం హర్షణీయం. దేశంలో కోల్​కతా తర్వాత రెండో అతి పెద్ద పుస్తక ప్రదర్శనగా రికార్డులుకెక్కిన బుక్​ఫెయిర్​లో ఈసారి 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా.

పదాల ప్రాముఖ్యత తెలియాలి

కేరళ కొచ్చిలోని ఎర్నాకులతప్పన్ గ్రౌండ్స్‌లో 25వ కొచ్చి ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ కూడా వైభవంగా కొనసాగుతున్నది. 'వర్డ్ పవర్' థీమ్‌తో పుస్తక ప్రదర్శన జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ అధ్యక్షుడు, నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఈఎన్ నందకుమార్ చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావనర్హం. ప్రతి భాషలోనూ పద సంపద పుష్కలంగా ఉంటుంది. పదాల శక్తిని, వాటిని ఎలా ఉపయోగించవచ్చో చాలా మందికి తెలియదు. మలయాళంలో దాదాపు మూడు లక్షల పదాలు ఉన్నాయి.

రోజువారీ సంభాషణలలో మా పదజాలం 250 పదాలకే పరిమితం అని నేను ఊహిస్తున్నాను. అందుకే ఈ ఏడాది పదాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం" అని ఆయన అన్నారు. తెలుగు భాషలోనూ అలాంటి లోపాన్ని అధిగమించాల్సిన అవసరం ఉన్నది. మరో నెల తర్వాత 31వ ఢిల్లీ వరల్డ్​బుక్​ ఫెయిర్​(delhi world book fair) కూడా జరగనుంది. ఆజాదీ కా అమృత్​మహోత్సవ్​ థీమ్‌తో ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకు జరిగే ఈ బుక్​ ఫెయిర్‌కు ఫ్రాన్స్(france)​ అతిథి దేశంగా రానుంది. పుస్తక ప్రదర్శన కేంద్రాలను యువత ఉపయోగించుకోవాలి. జ్క్షాన సంపదను జాతికి అందించే ఇలాంటి కార్యక్రమాలు జిల్లా, మండల స్థాయిలలోనూ జరగాలని ఆశిద్దాం.

(హైదరాబాద్ బుక్​ ఫెయిర్‌ను పురస్కరించుకొని)

బచ్చు శ్రీనివాస్

9348 311117

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

Ampasayya Naveen: చైతన్య స్రవంతి శిల్పి అంపశయ్య నవీన్

Advertisement

Next Story