వేతన స్థిరీకరణపై అనుమానాలు..

by Ravi |   ( Updated:2024-09-11 01:00:31.0  )
వేతన స్థిరీకరణపై అనుమానాలు..
X

సుదీర్ఘ నిరీక్షణ తదుపరి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలకు పైచిలుకు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. పదోన్నతి పొందగానే ఉపాధ్యాయులకు వేతన వృద్ధి ఉంటుంది. ఈ సందర్భంలో వేతన స్థిరీకరణలో ఉపాధ్యాయులకు, డీడీవో‌లకు అనేక సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా FR-22(B) వర్తిస్తుందా? వర్తిస్తే ఏ తేదీకి ఆప్షన్ ఇచ్చుకుంటే ప్రయోజనం చేకూరుతుంది? ఒకవేళ ప్రమోషన్ తిరస్కరిస్తే ఇప్పటికే పొందిన అప్రయత్న పదోన్నతి పథక ప్రయోజనాలు ఉపసంహరిస్తారా? ప్రమోషన్ పొంది జూనియర్ అత్యధిక వేతనం తీసుకుంటే స్టెప్ అప్ చేసుకోవచ్చునా? ఇలాంటి సందేహాలపై కనీస అవగాహన కలిగి ఉండటం ఆవశ్యకం.

FR-22(B) జీవో 239 ద్వారా 1983లో ఈ నిబంధన అమలులోకి వచ్చింది. ఒక పోస్ట్ నుండి అంతకంటే ఎక్కువ ప్రాధాన్య బాధ్యతలు గల మరొక పోస్టుకు పదోన్నతి పొందినప్పుడు క్రింది పోస్టులో పొందుతున్న వేతనానికి ఒక నోష‌నల్ ఇంక్రిమెంట్ కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్టు స్కేలులో పైస్టేజి వద్ద స్థిరీకరిస్తారు.

వేతన స్థిరీకరణ కోసం..

ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రెండు రకాల వేతన స్థిరీకరణ కొరకు ఆప్షన్స్ కలిగి ఉంటాడు. 1. ప్రమోషన్ పోస్టులో చేరిన తేదీ 2. క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ తేదీకి అప్షన్ ఇచ్చుకునే అవకాశం. మొదటి పద్ధతి ప్రకారం ప్రమోషన్ తేదీనాడు ఒక నోషన‌ల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పైస్టేజిలో స్థిరికరిస్తారు. ఆ విధంగా మాస్టర్ స్కేళ్లలో రెండు ఇంక్రిమెంట్‌ల లాభం కలుగుతుంది. మరల ఇంక్రిమెంట్ మాత్రం ఒక సంవత్సరం తరువాత మాత్రమే మంజూరు చేస్తారు. రెండవ పద్ధతి ప్రకారం ముందుగా FR-22(a) (I) ననుసరించి ప్రమోషన్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజ్ ఇచ్చి, క్రింది పోస్టులో ఇంక్రిమెంట్ తేదీ నాటికి వార్షిక ఇంక్రిమెంట్, ఒక నోష‌నల్ ఇంక్రిమెంట్ కలిపి తదుపరి స్టేజి వద్ద పునఃవేతన స్థిరీకరణ చేస్తారు. పై రెండు పద్ధతుల్లో ఉద్యోగి/ ఉపాధ్యాయుడు ఇంక్రిమెంట్ తేదికి ఆప్షన్ ఇచ్చుకోవడం వల్ల పాత ఇంక్రిమెంట్ తేదీనే కొనసాగుతుంది. ఉద్యోగికి ఏ పద్ధతి లాభదాయకమైతే ఆ తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవచ్చును. జీవో 145 ప్రకారం 30 రోజులలోపు ఉద్యోగి ఎటువంటి ఆప్షన్ ఇవ్వకపోతే డిడివో స్వయంగా ఉద్యోగికి ఏది లాభకరమో ఆ పద్ధతిలో వేతన స్థిరీకరణ చేయాల్సి ఉంటుంది. FR-22(B) ప్రకారం వేతన స్థిరీకరణ తరువాత ఒక సంవత్సరం తరువాతనే వార్షిక ఇంక్రిమెంట్ మంజురు అవుతుంది. ఇక్కడ FR-31(2) వర్తించదు.

40 వేల జీతం తీసుకునేవారు..

ప్రమోషన్ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు పే రివిజన్ కమిషన్-2020లో 40 వేల రూపాయలు అంతకన్నా ఎక్కువ వేతనం తీసుకునే వారు ఇంక్రిమెంట్ తేదీకే ఆప్షన్ ఇచ్చుకోవడం ప్రయోజనకరం. అదే విధంగా ప్రమోషన్ తేదీ, ఇంక్రిమెంట్ తేదీ ఒకే నెలలో ఉన్న ఉద్యోగులు ప్రమోషన్ పోస్టులో చేరిన తేదీకి ఆప్షన్ ఇచ్చుకోవడం ప్రయోజనకరం. క్రింది కేడర్‌లో అప్రయత్న పథకంలో భాగంగా 24 సంవత్సరాల స్కేలు పొందియుంటే వారికి FR-22(B) వర్తించదు. FR-22(a)(i) మరియు FR-31(2) ప్రకారం నిర్ణయించబడుతుంది. 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని అర్హతలు ఉన్నప్పటికీ అట్టి స్కేలు తీసుకోకుండా ప్రమోషన్ పొందినప్పుడు FR-22(B) ప్రయోజనం పొందవచ్చునా? అనే సందేహం చాలా మంది ఉపాధ్యాయుల్లో ఉన్నది. ప్రమోషన్ పొందిన కేడర్‌లో అప్రయత్న పదోన్నతి పథకం (AAS) వర్తించదన్న నిబంధన 1983 నుండి ఉండనే ఉంది. ఏదైనా స్కేలు పొందితే దానివల్ల ఉద్యోగికి ప్రయోజనం ఉండాలి. కానీ ఈ విషయంలో ఉద్యోగి నష్టపోతున్నాడు. ఈ విషయంపై స్పష్టమైన ఉత్తర్వులు లేవు. ఫలానా స్కేలు కచ్చితంగా తీసుకోమ్మని ప్రభుత్వం ఆదేశించలేదు. కావున 24 సంవత్సరాల స్కేలు ప్రయో జనం తిరస్కరించి ప్రమోషన్ కేడర్‌లో FR-22(B) ప్రయోజనం పొందవచ్చును.

ఆ అధికారం డీడీఓలకే..

FR-27 ప్రకారం సీనియర్- జూనియర్ వేతన వ్యత్యాసాలు సవరించబడతాయి. ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం సవరించుకోవచ్చు. సీనియర్ కంటే జూనియర్ వేతనం ఎక్కువ తీసుకోకూడదని ఎక్కడా లేదు. ఇదే విషయాన్ని ఉన్నత న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే సీనియర్, జూనియర్ వేతన వ్యత్యాసాలు సరిచేయడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే ఉపాధ్యాయులకు స్టెప్పింగ్ అప్ చేసే అధికారం డీడీఓలకే ఇవ్వబడింది. జీవో 475 ప్రకారం ఉపాధ్యాయులకు సంబంధించి ప్రమోషన్ పోస్టులో ఒకే సబ్జెక్టులో ప్రమోషన్ పొంది ఉండాలి. ప్రభుత్వ మెమో 5476 ప్రకారం జూనియర్‌కు ప్రమోషన్ వచ్చిన ఐదు సంవత్సరాల లోపల సీనియర్ స్టెప్పింగ్ అప్ కోసం దరఖాస్తు చేయాలి. ఈ పరిమితి మించిన దరఖాస్తులు పరిశీలించరు.

ప్రభుత్వ మెమో 007 ప్రకారం ప్రమోషన్ రాతపూర్వకంగా తిరస్కరిస్తే అప్పటివరకు పొందిన అప్రయత్న పదోన్నతి పథక ప్రయోజనాలు ఉపసంహరించవచ్చును. అయితే దీనికి సవరణగా ప్రభుత్వం జీవో216 ను విడుదల చేసింది. ఈ ఉత్తరువు ప్రకారం ప్రమోషన్ వదులుకున్న వారికి తదుపరి ప్రయోజనాలు ఉండవని కింది కేడర్లో అప్పటికే తీసుకున్న అప్రయత్న పదోన్నతి పథక ప్రయోజనాలు రికవరీ చేయకూడదని ప్రకటించింది. జీవో 227 ప్రకారం ఒకసారి ప్రమోషన్ అవకాశాన్ని వదులుకునే అవకాశం ఉంటుంది రెండోసారి కూడా ప్రమోషన్ తిరస్కరిస్తే ఆ తేదీ నుండి మాత్రమే అప్రయత్న పదోన్నతి పథక ప్రయోజనాలు వర్తించవు. ఆ తేదీ కంటే ముందున్న ప్రయోజనాలు ఏవీ ఉపసంహరించరు.

సుధాకర్ ఏ.వీ

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed