- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నియామకాల్లోనూ పుచ్చులేనా?
నీట్ కుంభకోణం, ఆ తర్వాత వెను వెంటనే యూజీసీ నెట్ పరీక్షా పత్రం లీకేజీ వార్తలు చూసి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు శభాష్...ఇన్నేళ్ల చరిత్రలో కేవలం ఒక్కసారి కూడా అక్రమాల ఆరోపణలు ఎదుర్కోలేదు అంటూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ గత మూడు నాలుగు రోజుల నుంచి అటు జాతీయ మీడియా ఇటు సోషల్ మీడియాలో ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఓబీసీ, దివ్యాంగుల కోటాలో ఉద్యోగం సంపాదించిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏక సభ్య కమిటీని నియమించింది.
యూపీఎస్సీనో లేదా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల వల్ల ఈ ఉదంతం బయటకు రాలేదు. తనకు సకల సౌకర్యాలు కావాలని సీనియర్ అధికార్లను ఒత్తిడి చేయడం, తన ప్రవర్తన మీద అనుమానం కలిగి తీగ లాగితే డొంక బయటపడినట్లు ఈ వ్యవహారం బయటకు రావడం గమనార్హం. ఈ వ్యవహారం చూసాక ప్రజల్లో ముఖ్యంగా పోటీ పరీక్షల అభ్యర్థుల్లో యూపీఎస్సీ మీద సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల డొల్లతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
రక్షణ కుడ్యాలు
సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, కాగ్,యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను రాజ్యాంగం రక్షణ కుడ్యాలు గా అభివర్ణించారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. ఇంతటి కీలక వ్యవస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం లోపభూయిష్టంగా ఉంది అనేది రాజ్యాంగం లోని 14వ భాగాన్ని చూస్తే ఇదే విషయం తేటతెల్లం అవుతుంది. సభ్యుల అర్హతలు, నియమాలు మొదలైన కీలక అంశాలు రాజ్యాంగంలో పేర్కొనలేదు. రాజ్యాంగం విధించిన ఒకే ఒక్క నిబంధన ఏంటి అంటే సభ్యులలో సగం మంది కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో కనీసం పదేళ్లు పని చేసి ఉండాలి. మిగతా విషయాలను సంబంధిత ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టింది. అపరిమిత విచక్షణ అనార్థాలకు దారితీస్తుంది అనేది విదితమే. ఎన్నికల సంఘం సభ్యుల నియామకం కోసం ఏ విధంగా అయితే చట్టాలు తెచ్చారో అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవస్థల నియమాలను కూడా పకడ్బందీగా జరిగేలా చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది.
నాయకులకు పునరావాస కేంద్రాలు
రాజ్యాంగంలో ఈ విషయానికి సంబంధించి ఉన్న లోపాన్ని దేశంలోని కొన్ని అధికార పార్టీలు, తమ కోసం పాటు పడిన వారికి అప్పనంగా ఆరేళ్ళ పదవీ కాలం కలిగిన ప్రభుత్వాలను ఇచ్చి తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయి అనేది సభ్యుల నేపథ్యం తదితర విషయాలు చూస్తే అనుమానం కలగక మానదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సభ్యుల నేపథ్యం గురించి వారు గత అధికార పార్టీకి, ప్రస్తుత విపక్ష పార్టీకి ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నారో ఇటీవల ఒక ప్రధాన పత్రిక కథనాన్ని ప్రచురించింది.
ఇంటర్వ్యూలో మాయాజాలం
తాజా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, గ్రూప్-1 ఇంటర్వ్యూలలో అక్రమాలు జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు న్యాయం జరగాలని చెప్పి గ్రూప్ 1 కి ఇంటర్వ్యూ ఉండకూడదు అని ఉపన్యాసాలు ఇచ్చి తీరా తూచ్.. ఇంటర్వ్యూలు ఉంటాయి, క్రితంసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం అంటూ జీవో విడుదల చేసి, మరుసటి రోజే 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ని విడుదల చేసారు. అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి గ్రూప్ 1 ఇంటర్వ్యూ లను తొలగించిన ప్రభుత్వం మరి తర్వాత ఏ ప్రాతిపదికన మరలా గ్రూప్ 1 ఇంటర్వ్యూలని పునరుద్ధరించారో చెప్పలేదు. ఎవరి ఒత్తిడి మీద నాటి ప్రభుత్వం ఈ పని చేసిందో కూసింత ఇంగిత జ్ఞానం ఉన్నవారికి తెలియక మానదు.
సభ్యుల నియామకం పటిష్టంగా జరగాలి. కొన్ని రోజుల క్రితం చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ తదుపరి చైర్మన్గా ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించింది. ఈ పోస్టుకు పలువురు వ్యక్తులను మౌఖిక పరీక్షలు, తదితర సామర్ధ్య పరీక్షలు నిర్వహించి ఆయన పేరుని ప్రతిపాదించింది. క్యాబినెట్ నియామక కమిటీ ఆమోదం పొందితే మన తెలుగు వ్యక్తి ఎస్బీఐ చైర్మన్ అవ్వనున్నారు. కాని ఇటువంటి ప్రక్రియ మాత్రం రాజ్యాంగ సంస్థలకి ఇప్పటికి లేకపోవడం మన వ్యవస్థల్లో, పరిపాలనలో డొల్లతనాన్ని తెలియజేస్తుంది.
2018 గ్రూప్1 నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన వారి నియామకాలు చెల్లవు అని, వారు మరల మెయిన్స్ పరీక్ష రాయాలని మార్చిలో ఇచ్చిన తీర్పును చూసి పోటీ పరీక్షల అభ్యర్థులు నివ్వెరపోయారు. నోటిఫికేషన్ రావడం ఒక ఎత్తు, వచ్చాక సమర్థవంతంగా పరీక్ష నిర్వహణ, లోపాలు లేని ప్రశ్న పత్రాలు, సరి తగిన కీ, త్వరితగతిన ఫలితాలు వెల్లడి, పోస్టింగులు మొదలైన వాటిని లోపాలు లేకుండా పూర్తి చేయడం మరొక ఎత్తు. ఇవి పూర్తయ్యే దాకా పోటీ పరీక్షల అభ్యర్థులు దిన దిన గండమే. పరీక్ష ఎప్పుడు రద్దు చేస్తారో, వచ్చిన ఉద్యోగం ఎప్పుడు తీస్తారో అనే అభద్రతా భావంలో నిరుద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం 2018 బ్యాచ్ గ్రూప్ 1 అధికారులు ప్రశాంతంగా తమ ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి. నిజాయితీగా కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయపడాల్సిన పరిస్థితి రావడానికి కారణం నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిజిటల్ మూల్యాంకన గురించి తీసుకున్న కొన్ని నిర్ణయాలు.
తాజాగా గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా రాజీనామా చేశారు. అధికారం మారినప్పుడల్లా ఏపీపీఎస్సీ చైర్మన్ కి తల నొప్పులు తప్పడం లేదు. నాడు ఉదయ భాస్కర్, నేడు గౌతమ్ సవాంగ్ లాగా మరొకరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే త్వరలో ఏపీపీఎస్సీ చైర్మన్గా నియామకం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి.
జి.వి.సాయి కుమార్ గుంత
93911 42989